దసరా మూవీ విజయం సాధించడంతో చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడని… యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో తనదైన మార్క్ చూపించాడని ప్రశంసలు కురుస్తున్నాయి. దసరా మూవీ ముందు వరకూ శ్రీకాంత్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే సుకుమార్ దగ్గర చేరకముందు శ్రీకాంత్ ఎన్నో కష్టాలు పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీకాంత్ ఒదెలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్ చేస్తున్నాయి.
దసరా మూవీ రిలీజ్ సందర్భంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు శ్రీకాంత్ ఓదెల. ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన కొన్ని సమాధానాలు చూస్తే సినిమాపై ఆయనకున్న కమిట్ మెంట్ తెలుస్తోంది.
ప్ర: మీరు ఎప్పటి నుంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకున్నారు?
శ్రీ: నా 10th పరీక్ష రాసిన తర్వాత, నేను జగడం చూశాను. అప్పుడే సినిమాలపై ఆసక్తి కలిగింది. దాని శైలి నాకు నచ్చింది. అలాగే నాన్నకు, మామకు సినిమాలంటే ఇష్టం. నన్ను తరచు సినిమాలకి తీసుకెళ్ళేవారు. నాన్న ఒత్తిడి వల్ల నేను బి.కామ్ చదివాను. గ్రాడ్యుయేషన్ కోసం కరీంనగర్‌లో మామయ్య దగ్గరే ఉన్నాను. నా కజిన్స్ అంతా ఉన్నత చదువులు చదివి యూఎస్‌లో సెటిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో నేను కూడా యూఎస్‌లో సెటిల్ కావాలని నాన్న కోరుకున్నాడు. అవన్నీ కాదని సినిమాపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌కు బయల్దేరా.
ప్ర: సినిమాల్లో అవకాశం ఎలా?
శ్రీ:మా బావ నన్నుకొందరు దర్శకులకు రికమెండ్ చేశారు. కానీ నాకు సుకుమార్ సర్ దగ్గర పనిచేయాలనే ఆసక్తి ఉండేది. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కొట్టేయాలనే ఆశతో హైదరాబాద్‌లోని సుకుమార్ సార్ ఇంటి చుట్టూ 4 ఏళ్లు తిరిగా. ఉదయం 4గంటలకే ఇంటి ముందు కూర్చునే వాన్ని. నిరీక్షణ ఫలించి ఓ రోజు సుకుమార్ కంటపడ్డా. సుకుమార్ సర్ పిలిచి అడిగారు. నాకు సినిమాలంటే ఇష్టమని చెప్పా. నన్ను ఓ షార్ట్ ఫిలిం చేసుకొని రావాలని సూచించారు. అయితే ఎలా చేయాలో తెలియక పోయిన ఎదో రకంగా కష్టపడి షార్ట్‌ఫిలిమ్‌ను పూర్తి చేశా. నా అదృష్టం కొద్ది అది సుకుమార్ గారికి కూడా నచ్చింది. అలా సుకుమార్ సర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిపోయా.‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా.
ప్ర: సుకుమార్ నుంచి ఏం నేర్చుకున్నారు?
శ్రీ:సినిమా అంటే మనకు పాజిటివ్ కోణంలో భయం ఉండాలి. ప్రతి సీన్‌ను వచ్చే వరకు బాగా తీయడం దానిని జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయాలి అని సుకుమార్ సర్ నుంచి నేర్చుకున్నాను.
ప్ర: సుకుమార్‌ను పక్కన పెడితే, మీ ఇతర సినిమాల మేకింగ్ ఇన్‌స్పిరేషన్‌లు ఎవరు?
శ్రీ: కృష్ణవంశీ గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన అంతఃపురం (1998) చూడలేదు. ఒకరోజు నాన్న నన్ను అంతఃపురం సినిమా చూశావా అని అడిగారు. ఆ సినిమా చూడకుండా సినిమా ఎలా తీస్తావు అని అడిగారు. నేను ఏదో కోల్పోతున్నానని భావించా. వెంటనే అంతఃపురం చూశాను. షాట్ మెకింగ్‌లో కొన్ని మెలకువలు నేర్చుకున్నాను. రాజమౌళి గారు, పూరి గారు కూడా నాకు చాలా ఇష్టం.
ప్ర: నానిని ఎలా సంప్రదించారు?
నానికి దసరా కథ చెప్పమని మా నిర్మాత సుధాకర్‌గారు పట్టుబట్టారు. నేను నాని అన్న మేనేజర్‌ని సంప్రదించాను.అతను నాకు నేరేషన్ కోసం 40 నిమిషాల సమయం ఇచ్చారు. నాని అన్నను కలిసిన తర్వాత..‘మీ మేనేజర్ నన్ను 40 నిమిషాల్లో కథ వివరించమని చెప్పారు. ఆ టైంలో కథ పూర్తి కాదు. ఎక్కడైనా మీకు విసుగు అనిపిస్తే, మీరు నన్ను ఆపమని అడగవచ్చు అని చెప్పాను. దానికి నాని అన్న ఒప్పుకున్నారు. దాదాపు నాలుగు గంటల నేరేషన్ ఇచ్చాను. కథ నాని అన్నకు బాగా నచ్చింది. కానీ నేను విజువల్‌గా సినిమా తీయగలనా అని భయపడ్డారు. ఓ రెండు సీన్లు ఎంచుకుని టెస్ట్ షూట్ చేయమన్నారు. అవసరమైన నటీనటులను తీసుకుని రెండున్నర రోజుల పాటు వికారాబాద్ సమీపంలోని గ్రామంలో ఆ సన్నివేశాలను చిత్రీకరించాను. ఎడిటింగ్‌కి, పోస్ట్ ప్రొడక్షన్‌కి రెండు రోజులు పట్టింది. నాని అన్నకు ఫుటేజీని చూపించినప్పుడు నాపై అన్నకు అనుమానం తీరింది.
ప్ర: దసరా కథకు మీ ప్రేరణ ఏమిటి?
ఇది నేను రాసిన కొత్త కథ కాదు. ఓ రోజు ఏపీలో జరిగిన ఓ సంఘటన నాలో స్ఫూర్తిని నింపింది. ఐదు నిమిషాల సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. నేను 2018 ప్రారంభంలో రాయడం ప్రారంభించాను. షూటింగ్ పూర్తయ్యే వరకు రాయడం కొనసాగించాను. నా దగ్గర బౌండ్ స్క్రిప్ట్ లేదు. నాకు సమయం దొరికినప్పుడల్లా, నేను దానిని మరింత మెరుగుపరచాను.
ప్ర: నాని లాంటి నటుడితో పని చేయడం ఎలా అనిపించింది?
నాని అన్న కథలో జోక్యం చేసుకుంటాడని, తన మార్పులతో మేకర్స్‌ని ఇబ్బంది పెడతాడని విన్నాను. అదే విషయాన్ని నిర్మాత సుధాకర్‌గారికి చెప్పాను. కానీ ఆయన నన్ను మందలించి, నేరేషన్‌తో ముందుకు వెళ్లమన్నారు. నాని అన్న ప్రాజెక్ట్‌కి ఒప్పుకుని మా ప్రయాణం మొదలయ్యాక, ఎప్పుడు మార్పులు అడుగుతాడో అనే భయం నాలో ఉండేది కానీ గొప్పదనం ఏంటంటే.. ఆయన బదులు ఇంకెవరైనా దసరా చేసి ఉంటే అది ఉగాది పచ్చడి అయ్యేది. ఒక్కరోజు కూడా నన్ను ప్రశ్నించలేదు. ‘అన్నా నేను ఇలా చేస్తున్నాను, సరే, సరే’ అని చెప్పారు. అతను నేను విన్నదానికి పూర్తి భిన్నంగా ఉన్నారు. నటుడిగా నేను ఏది అడిగినా చేశారు. నా సొంత అన్నలా ప్రవర్తించాడు.
శ్రీకాంత్ ఓదెల గురించి సుకుమార్ మాటల్లో…
రంగస్థలం ఆడియో రిలీజ్ సందర్భంగా సుకుమార్ ప్రత్యేకంగా శ్రీకాంత్‌ను అభినందించారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“ రంగస్థలం షూటింగ్ కోసం 1000 మందిని కాస్ట్యూమ్స్‌తో సహా చకచక రెడీ చేయించి శ్రీకాంత్ సిద్ధంగా ఉంచేవాడు. రంగస్థలంలో బ్యాక్‌గ్రౌండ్ చక్కగా, పక్కాాగా ఉందంటే దానికి కారణం శ్రీకాంత్‌యే”
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!