Telangana @ 10 Years: 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి దోహదపడిన 10 అంశాలు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telangana @ 10 Years: 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి దోహదపడిన 10 అంశాలు!

    Telangana @ 10 Years: 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి దోహదపడిన 10 అంశాలు!

    June 1, 2023

    తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. 2014 జూన్‌ 2న దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ 2023 జూన్‌ 2తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో ఏట అడుగుపెట్టబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ ప్రాంతం.. ప్రస్తుతం ప్రగతిలో దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు హైదరాబాద్‌ మినహా తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి కనిపించేది కాదు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కరెంటు లేని ఇళ్లే కనిపించేవి. నీరు లేక ఏడారిని తలపించే భూములు తారసపడేవి. కొత్త రాష్ట్రం అవతరణ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 

    కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, సంక్షేమం ఇలా ఏ రంగం చూసుకున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఒకప్పుడు రాష్ట్రం వస్తే తెలంగాణ మరింత వెనకబడి పోతుందంటూ సెటైర్లు వేసిన ఏపీ నాయకులు నోరెళ్లబెట్టేలా కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో  తెలంగాణ అభివృద్ధికి దోహదం చేసిన కీలక అంశాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం అనగానే ముందుగా తూర్పు-పశ్చిమ గోదావారి, కోస్తాంద్ర జిల్లాలే గుర్తుకు వచ్చేవి. అప్పట్లో తెలంగాణలోని వ్యవసాయ భూములన్నీ బీడువారిపోయి ఎంతో నిత్తేజంగా కనిపించేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ది బాధ్యతను తన భుజాలపై వేసుకున్న కేసీఆర్‌ నీటి పారుదల సౌరకర్యాలపై దృష్టి కేంద్రీకరించారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి అత్యాద్భుత పథకాల ద్వారా తెలంగాణను సస్యశామలం చేశారు. 

    మిషన్‌ కాకతీయ

    పల్లెల్లోని చెరువులను బాగు చేసేందుకు మన ఊరు-మన చెరువు పథకాన్ని సీఎం కేసీఆర్‌ 2015 మార్చిలో ప్రారంభించారు. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యతను ఆదర్శంగా తీసుకొని ఈ పథకానికి ‘మిషన్ కాకతీయ’ అనే పేరు పెట్టారు. ఈ పథకం కింద గత ఐదేళ్లలో 46,000 చెరువులను పునరుద్దరించి 25 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చారు. దీని కోసం ప్రభుత్వం రూ.22,000 కోట్లను ఖర్చు చేసింది. అంతేగాక భూగర్భ జలాలను పెంచి వ్యవసాయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించింది. ఈ పథకం ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు అందడంతో రైతులు కూడా రాష్ట్రాభివృద్దిలో భాగస్వామ్యులయ్యారు

    మిషన్ భగీరథ

    రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి సరఫరాకు ఉద్దేశించి ‘మిషన్‌ భగీరథ’ పథకాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. స్కీమ్‌ కింద 1.30 లక్షల కి.మీ. పొడవున పైప్‌లైన్‌ను వేసి రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చింది. మిషన్‌ భగీరథ కింద గ్రామాల్లో ప్రతీ ఇంటికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటిని అందిస్తున్నారు. అలాగే మండలాల్లో 135 లీటర్లు, మున్సిపల్‌ కార్పోరేషన్‌లో 150 లీటర్లు చొప్పున ప్రతీ గృహానికి నీటిని సరఫరా చేస్తున్నట్లు  ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 

    24 గంటల కరెంట్‌

    తెలంగాణ అవతరణ తర్వాత గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం 24 గంటల కరెంటు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతాన్ని నిత్యం కరెంటు కోతలు వెంటాడేవి. ఒక రోజులో కరెంటు ఉన్న దాని కంటే లేని సమయమే ఎక్కువగా ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి నేడు 24 గంటలపాటు కరెంటు ఉండే స్థితికి తెలంగాణ వచ్చింది. అటు వ్యవసాయానికి సైతం 24 గంటల పాటు ఉచితంగా కరెంటు అందిస్తూ కేసీఆర్‌ సర్కార్‌ రైతులను ఆదుకుంటోంది. 

    రైతు బంధు

    ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతీ సీజన్‌లో ఒక్కో రైతుకి రూ.5000 చొప్పున ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. విత్తనాలు, రసాయనాలు, ఎరువుల కొనుగోలు లేదా ఇతరాత్ర అవసరాలను తీర్చుకునేందుకు రైతులు ఈ నగదును వినియోగిస్తున్నారు.  రైతులకు మద్దతునిచ్చేందుకు భారత్‌లో ప్రవేశపెట్టిన తొలి పెట్టుబడి పథకం ఇదే కావడం విశేషం.

    రైతు బీమా

    రైతులకు బీమా సదుపాయం కల్పించే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘రైతు బీమా’ స్కీమ్‌ను తీసుకొచ్చింది. రైతు ఏదైనా కారణం వల్ల చనిపోతే అతడి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. తద్వారా మృతుడి కుటుంబం వీధిన పడకుండా ఆదుకుంటోంది. 

    దళిత బంధు

    రాష్ట్రంలోని దళితుల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ద్వారా దళితులు ఎంట్రప్రెన్యూర్లుగా మారుతున్నారు. దేశంలో ఉన్న ప్రస్తుత అన్ని స్కీమ్‌లలో కెల్లా అతిపెద్ద నగదు బదిలీ పథకం ఇదే కావడం విశేషం. 

    ఆరోగ్యలక్ష్మి

    గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ‘ఆరోగ్య లక్ష్మీ’ పథకాన్ని తెలంగాణ సర్కార్ తీసుకొచ్చింది. 2015 జనవరి 1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇది అమలు అవుతోంది. ఈ కార్యక్రమం కింద గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ ఒకపూట భోజనాన్ని అందిస్తున్నారు.  మూడేళ్లలోపు పిల్లలకు నెలకు 16 కోడిగుడ్లు ఇస్తున్నారు. వీటితోపాటు గోధుమలు, పాలపొడి, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ప్రతి నెలా మొదటి తేదీన అందజేస్తారు.

    ఆసరా పింఛన్లు

    వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, హెచ్‌ఐవీ రోగులను ఆదుకునేందుకు ‘ఆసరా’ అనే పింఛన్‌ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని 2014, నవంబర్ 8న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గ్రామాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిని ఆసరా లబ్ధిదారులుగా ఉన్నారు. ప్రతి నెల వికలాంగులకు రూ. 1500, వృద్ధులు, వితంతువులు, గీత, బీడీ, చేనేత కార్మికులకు, హెచ్‌ఐవీ రోగులకు రూ. 1000 చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. 

    డబుల్ బెడ్ రూమ్ స్కీం

    నిరుపేదలకు ఇళ్లు అందించే ఉద్దేశ్యంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకాన్ని 2015లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌ కింద ప్రభుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున గృహసముదాయాలను నిర్మించి అర్హులైన పేదలకు అందజేస్తున్నారు. ఈ పథకం వల్ల లక్షలాది మంది పేదల సొంతింటి కల నెరవేరింది. 

    హరితహారం

    తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంగా తీర్చిదెద్దేందుకు కేసీఆర్ ప్రభుత్వం హరితాహరం పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో 22శాతంగా ఉన్న అటవీ విస్తరణను 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మెుక్కలు నాటడం, విత్తనాలు చల్లడం వంటి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ పర్యావరణ హితానికి కేసీఆర్‌ సర్కార్ పాటు పడుతోంది. 

    ఐటీ రంగం

    తెలంగాణ అభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తున్న రంగం ఐటీ. హైదరాబాద్‌లో గత తొమ్మిదేళ్లలో రూ. 4 లక్షల కోట్లకు పైగా ఐటీ పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. అంతేగాక రూ.22,700 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడింట ఒక ఉద్యోగం తెలంగాణదే కావడం విశేషం. కేటీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ఐటీ రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో పనిచేస్తున్న మొత్తం ఐటీ ఉద్యోగుల్లో ఐదో వంతు హైదరాబాద్‌ నుంచే పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్‌ ఐటీ రంగంలో 3 లక్షల 23 వేల మంది పని చేసేవారు. ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది ప్రత్యక్షంగా పని చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version