క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు మలయాళ ఇండస్ట్రీ కేరాఫ్‌గా మారిపోయింది. పగ, ప్రతీకారం, హత్యలు, పోలీసు ఇన్‌వెస్టిగేషన్ స్టోరీల నేపథ్యంలో రూపొందిన మలయాళ చిత్రాలు ఓటీటీ పుణ్యమా అని తెలుగులోనూ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో మలయాళ చిత్రాలకు ఇక్కడి ఆడియన్స్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘తలవన్’ ఓటీటీలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ ఓటీటీలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ట్రెండింగ్ కావడానికి కారణాలేంటి? ఈ సినిమా ప్లాట్ ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ట్రెండింగ్‌లో ‘తలవన్’
మలయాళం స్టార్ నటులు బీజు మీనన్ (Biju Menon), అసిఫ్ అలీ (Asif Ali) ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘తలవన్’ (Thalavan). మలయాళంలో రిలీజయ్యే అల్లు అర్జున్ ప్రతి సినిమాలో హీరోకు డబ్బింగ్ చెప్పే జిస్ జాయ్ (Jis Joy) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మే 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. రూ.25 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇందులో మియా జార్జ్ (Miya George), దిలీష్ పోతన్, శంకర్ రామక్రష్ణన్ వంటి ప్రముఖ మలయాళ నటులు సైతం నటించారు. కాగా, ఈ సినిమా సోనిలివ్ (SonyLIV) వేదికగా సెప్టెంబర్ 10 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి సోనిలివ్‌లో అత్యధిక వ్యూస్ సాధిస్తూ టాప్‌లో ట్రెండింగ్ అవుతుంది. ఈ సినిమాను చూసిన ఓటీటీ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
నెట్టింట పాజిటివ్ రెస్పాన్స్
‘తలవన్’ చిత్రంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ మీలో ఉత్కంఠను పెంచడమే కాకుండా మంచి అనుభూతిని పంచుతుందని అంటున్నారు. పోలీసులుగా బిజు మీనన్, ఆసిఫ్ అలీ నటన అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో గుడ్ ఇన్‌వెస్టిగేషన్ మూవీ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రచన, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే తనకు బాగా నచ్చిందని అభిప్రాయయపడ్డాడు. ఇలా సర్వత్రా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం విశేషం.
ఎందుకు చూడాలంటే?
మహిళ హత్య కేసులో ఓ పోలీసు అధికారి అన్యాయంగా ఇరుక్కోవడం, అతనంటే అసలు గిట్టని మరో అధికారికి కేసు దర్యాప్తు బాధ్యత అప్పగించడం వంటి ఇంట్రస్టింగ్ స్టోరీలైన్‌తో దర్శకుడు జిస్ జోయ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. తన ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా సినిమాను నడిపి మంచి మార్కులు కొట్టేశారు. ప్రతీ ఒక్కరిపైనా అనుమానం కలిగేలా కథను నడిపించి ఆడియన్స్‌లో ఇంట్రస్ట్‌ను పెంచాడు. సీఐ జయశంకర్‌ను ఈ హత్య కేసులో ఎందుకు ఇరికించారో దర్శకుడు చూపిన విధానం మెప్పిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. దర్శకుడు జిస్ జోయ్ చెప్పిన కథేమి కొత్తది కాకపోయిన ఒక సగటు క్రైమ్ ఇన్‌వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తలవన్‌ను మలచడంలో ఆయన పూర్తిగా విజయవంతమయ్యాడు. ఈ వీకెండ్‌లో మంచి క్రైమ్ థ్రిల్లర్‌ను కోరుకునేవారు ‘తలవన్’ చిత్రాన్ని అసలు మిస్ కావొద్దు.
కథేంటి?
ఎస్ఐ కార్తిక్ వాసుదేవన్ (ఆసిఫ్ అలీ) ట్రాన్స్‌ఫర్‌పై సీఐ జయశంకర్ (బిజు మేనన్) పనిచేస్తోన్న పోలీస్‌స్టేషన్‌కు వస్తాడు. కార్తిక్‌ది కాస్త దూకుడు మనస్తత్వం. అది జయశంకర్‌కు నచ్చదు. ఓ కేసు విషయంలో కార్తిక్, జయశంకర్‌ల మధ్య గొడవ జరుగుతుంది. అనుకోకుండా ఓ రోజు జయశంకర్ ఇంటి మేడపై రమ్య అనే యువతి మృతదేహం దొరుకుతుంది. రమ్యతో జయశంకర్‌కు సంబంధం ఉందనే ప్రచారం ఉండటంతో ఈ హత్య అతడే చేశాడని పోలీసులు అనుమానిస్తారు. అతడిని అరెస్టు కూడా చేస్తారు. ఇంతకీ రమ్యను ఎవరు హత్య చేశారు? ఈ నేరంలో జయశంకర్ ఎలా చిక్కుకున్నాడు? ఈ మర్డర్ కేసును విచారించే బాధ్యతను కార్తిక్ చేపట్టడానికి కారణం ఏమిటి? గొడవలను పక్కనపెట్టి జయశంకర్‌ను ఈ కేసు నుంచి కార్తిక్ కాపాడాడా? లేదా? అన్నది స్టోరీ.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?