ప్రపంచానికి భారతీయ సినిమా ఖ్యాతిని చాటిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరిపేర్లు విశ్వవ్యాప్తంగా మార్మోగాయి. ఈ సారి ఆస్కార్ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు కూడా ఉంటాయని ఎంతోమంది ప్రముఖ సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ చివరికి అందరికీ నిరాశే మిగిలింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ‘చెల్లో షో’(the last film show)ను ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక చేసింది. అంత బజ్ క్రియేట్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ను కాదని ఎప్పుడు విడుదలైందో కూడా తెలియని ఓ గుజరాతీ సినిమాను ఎంపిక చేయడం వెనక కారణం ఏమై ఉండొచ్చు ఓ సారి చూద్దాం.
ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్
భారత ప్రభుత్వం ఇప్పటిదాకా కేవలం 3 సినిమాలను మాత్రమే ఆస్కార్‌కు పంపింది. 1957లో మదర్ ఇండియా, 1988లో బాంబే, 2001లో లగాన్ సినిమాలను అధికారికంగా ఆస్కార్‌కు పంపింది. ఇందులో మదర్ ఇండియా కేవలం ఒక్క ఓటుతో ఆస్కార్ చేజార్చుకుంది. 2001 తర్వాత ఇప్పటిదాకా మరో సినిమాను ఇండియా అధికారికంగా పంపలేదు. అయితే సినీ నిర్మాతలు కూడా ఆస్కార్‌కు పంపుకునే అవకాశం ఉంటుంది. అలా ఇప్పటిదాకా 54 సినిమాలు పోటీకి వెళ్లాయి. అందులో 34 హిందీ సినిమాలే. తెలుగు నుంచి ఒకే ఒక్క సినిమా పోటీకి వెళ్లింది, అది 1986లో కె. విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతిముత్యం. దశాబ్దాల తర్వాత తెలుగు సినిమా వెళ్తుందనుకుంటే నిరాశే ఎదురైంది.
ఇవేనా కారణాలు:
భారతీయ సినీ సమాఖ్య ఆస్కార్స్‌కు నామినేట్ చేసిన సినిమాలను పరిశీలిస్తే కళాత్మకంగా, వాస్తవికతకు దగ్గరగా ఉండే సినిమాలే పంపుతోంది. ‘మదర్ ఇండియా’ సమాజంలోని కుతంత్రాన్ని ఎదుర్కొంటూ భర్త లేని ఓ పేద మహిళ తన పిల్లల్ని పెంచే కష్టాలను చూపెడుతుంది. ‘సలామ్ బాంబే’ ముంబయి మురికివాడల్లో నివసించే పిల్లల చుట్టూ తిరుగుతుంది. ‘లగాన్’ బ్రిటిష్ కాలంలో ట్యాక్స్‌ల భారాన్ని తప్పించుకునేందుకు ఓ గ్రామంలోని కుర్రాళ్లు క్రికెట్‌తో పోరాడే కథ. ఈ అన్నింటిలో కామన్ పాయింట్ గ్రామీణ, వాస్తవిక నేపథ్యం. ఆర్‌ఆర్‌ఆర్ పూర్తిగా కల్పిత, గ్రాఫిక్స్‌తో ముడిపడిఉన్న కథ. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఎంపిక చేయకపోవడానికి ఇది ఒక కారణం అయి ఉండొచ్చు.
అయితే సినిమాను పంపకపోవడంపై ట్విట్టర్ జనం అనేక కథలు అల్లుతున్నారు. రాజకీయ కోణంలోనే ‘చెల్లో షో’ను ఆస్కార్‌కు పంపారని ఆరోపిస్తున్నారు. ఈ యేడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 182 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో ఓట్ల కోసమే గుజరాతీ సినిమాను ఆస్కార్‌కు నామినేట్ చేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. వాస్తవికత ఉన్న కథలే పంపాలనుకుంటే తమిళ సినిమా ‘సూరరయి పోట్రు’ ఆకాశమే హద్దురా సినిమాను పంపవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు అసలు చెల్లో షో ఒరిజినల్ సినిమానే కాదు, అలాంటి సినిమాను ఎలా పంపుతారని ప్రశ్నిస్తున్నారు. అద్భుతమైన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ను కాదని ఓ రీమేక్ సినిమాను పంపుతారా అంటూ పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ‘చెల్లో షో’ కథ 1988లో ఇటలీ, ఫ్రాన్స్‌లో విడుదలైన ‘సినిమా పారడిసో’ కథను పోలి ఉండటమే. ‘సినిమా పారడిసో’లో ఓ కుర్రాడు ప్రొజెక్టర్ రూం బాయ్ సాయంతో అక్కడికి వెళ్లి సినిమాపై ప్రేమను పెంచుకుంటాడు. ‘చెల్లో షో’లోనూ ఓ కుర్రాడు ప్రొజెక్టర్ రూపంలో కాలం గడుపుతూ సినిమాపై ప్రేమను పెంచుకుంటాడు. దీంతో అద్భుతమైన కథ, కథనం, నటన ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ను కాదని ఫ్రీమేక్‌గా తెరకెక్కిన సినిమాను పంపితే ఆస్కార్ ఎలా వస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్‌కు ఇంకా సమయం ముగిసిపోలేదు
RRR సినిమాను కేంద్ర ప్రభుత్వం ఆస్కార్ కు నామినేట్ చేయకపోయినా అస్కార్ బరిలో నిలిచేందుకు ఇంకా అవకాశం ఉంది. ఆస్కార్ అకాడమీ రూల్స్ ప్రకారం.. ఏ సినిమైనా ‘లాస్ ఏంజెల్స్’లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వారం పాటు ప్రదర్శించబడితే చాలు, ఆ సినిమా ఆస్కార్ అవార్డుల బరిలో నిలవచ్చు. దీంతో RRR జనరల్ ఎంట్రీ కేటగిరిలో పోటీకి వెళ్లొచ్చు. ఈ కేటగిరిలో నామినేట్ చేసుకోడానికి నవంబర్ 15 వరకు అవకాశం ఉంది. సినిమా మేకర్స్ పోటీలోకి తీసుకెళ్లాలని అభిమానులు కోరుతున్నారు.