Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!

    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!

    March 14, 2024

    టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), ‌అలీ (Ali), సునీల్‌ (Sunil), వేణుమాదవ్‌ (Venu Madhav) లాంటి సీనియర్‌ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్‌ కమెడియన్స్‌ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్‌ సైతం  సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం. 

    సుహాస్‌ (Suhas)

    ప్రముఖ నటుడు సుహాస్‌.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్‌ అయిన సుహాస్‌.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్‌ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్‌..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్‌ నటిస్తున్నాడు.

    వైవా హర్ష (Harsha Chemudu) 

    షార్ట్‌ఫిల్మ్స్‌ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్‌ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్‌’, ‘పక్కా కమర్షియల్‌’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది.  

    అభినవ్‌ గోమటం (Abhinav Gomatam)

    యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్‌ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్‌.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా  ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్‌ హీరోగా మారాడు. 

    సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer)

    ‘జబర్దస్త్‌’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్‌.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్‌ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు.

    సత్యం రాజేష్‌ (Satyam Rajesh)

    సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్‌.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్‌ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 

    ప్రియదర్శి (Priyadarsi)

    యంగ్‌ కమెడియన్‌ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’  (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు.

    వెన్నెల కిషోర్‌ (Vennela Kishore)

    టాలీవుడ్‌లోని స్టార్‌ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్‌ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్‌.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్‌ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్‌’తో కథానాయకుడిగా మారిన కిషోర్‌.. రీసెంట్‌గా  ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది. 

    ధన్‌రాజ్‌ (Dhanraj)

    జబర్దస్త్‌ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్‌ ధన్‌రాజ్‌. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్‌.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version