సాంప్రదాయానికి అద్దం పట్టే పండుగ సంక్రాంతి. తెలుగు వారికి అతిపెద్ద ఫెస్టివల్‌గా దీన్ని చెప్పవచ్చు. ఉద్యోగ రిత్యా ఏడాది పొడవునా ఎక్కడెక్కడో నివసించే తెలుగువారంతా సంక్రాంతి వచ్చేసరికి తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. అమ్మమ్మ, తాతయ్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పండను మరింత ఆనందగా, ఆహ్లాదంగా మార్చే ఐదు యాక్టివిటీస్‌ను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
గాలిపటాల ఎగరవేత
సంక్రాంతి అనగానే ప్రధానంగా గుర్తుకువచ్చేది గాలిపటాలు. కుటుంబ సభ్యులు అంతా కలిసి ఇంటి మేడ పైకి వెళ్లి గాలిపటాలు ఎగరవేయడం ద్వారా ఈ సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవచ్చు. ఒకరి గాలిపటాన్ని మరొకరు ఢీ కొడుతూ సరదాగా పోటీ పడవచ్చు. ఎవరిది ఎంత ఎత్తు ఎగురుతుందోనన్న చిన్నపాటి కాంపిటీషన్ పెట్టుకొని ఆత్మీయులను ఓడించేందుకు ప్రయత్నించవచ్చు.
భోగి మంటలు
భోగి మంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. పాతకు పాతరేస్తూ కొత్తను అహ్వానించడం భోగి లక్షణం. కాబట్టి భోగి రోజున వేకువ జామునే లేచి ఇంట్లోని పాత వస్తువులను మంటల్లో వేయడం ద్వారా కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఆ మంటల్లో చలి కాచుకుని సరదాగా గడపవచ్చు. కుటుంబ సభ్యులంతా ఆ మంటల వెలుగుల్లో సెల్ఫీలు దిగి వాటిని తమ సెల్‌ఫోనుల్లో భద్రపరుచుకోండి.
రంగు రంగుల ముగ్గు
సంక్రాంతి అనగానే మనందరికి గుర్తుకు వచ్చే మరో అంశం అందమైన ముగ్గులు. ముఖ్యంగా మహిళలు చూడచక్కని ముగ్గులతో సంక్రాంతికి స్వాగతం పలుకుతుంటారు. ముగ్గులకు సరిపోయే రంగులను అద్ది ఇంటి ప్రాంగణాన్ని మరింత అందంగా ముస్తాబు చేస్తుంటారు. ఈ పండగకు కూడా ఇంట్లోని స్త్రీలందరూ ఒక చోట చేరి అందమైన రంగవల్లులను వేయండి. ఒకరికొకరితో సరదా సంభాషణలు చేసుకుంటూ అందమైన ముగ్గులను తీర్చిదిద్దండి.
సంప్రదాయ పిండి వంటలు
సంక్రాంతి పర్వదినం సందర్భంగా నోరూరించే పిండి వంటలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అరిసెలు, చక్రాలు, చెక్కలు, బూరెలు, గారెలు, బొబ్బట్లు, కాజాలు, సున్నండలు ఇలా రుచికరమైన పిండి వంటలను కుటుంబ సభ్యులు అంతా కలిసి చేసుకోవడానికి ప్రయత్నించండి. దీని వల్ల బంధువుల మధ్య ఆప్యాయతలు పెరిగి బంధం మరింత బలపడుతుంది. అంతేగాక తర్వాతి జనరేషన్ వారికి కూడా కుటుంబ విలువలు ఏంటో తెలుస్తాయి.
సాంస్కృతిక కార్యక్రమాలు
సంక్రాంతి అంటేనే బంధువులంతా ఒక చోట చేరే పండగ. కాబట్టి కుటుంబ సభ్యులంతా కలిసి ఆహ్లాదకరమైన ఆటలు ఆడటానికి ప్రయత్నించండి. కుర్చీల ఆట, అంత్యాక్షరీ, డ్యాన్స్ పోటీలు, డంబ్ షెరాజ్ వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఈ సంక్రాంతిని కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయవచ్చు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది