చిరంజీవి- మోహన్‌బాబు మధ్య మాటల యుద్ధం ఇలా మొదలైంది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరంజీవి- మోహన్‌బాబు మధ్య మాటల యుద్ధం ఇలా మొదలైంది

    చిరంజీవి- మోహన్‌బాబు మధ్య మాటల యుద్ధం ఇలా మొదలైంది

    February 18, 2022

    తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరో తెలియని సందిగ్ధత ఏర్పడింది. దాసరి నారాయణ రావు మరణాంతరం ఎవరి పనులు వారు చూసుకుంటూ ఇండస్ట్రీ బాధ్యతలను పక్కన పెట్టారు. కాని ఇటీవల మా ఎన్నికలు, ఏపీ టికెట్ల ధరల అంశాలు తెరపైకి రావడంతో పెద్ద దిక్కు ఎవరంటూ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమను నడిపిస్తున్నారని కొందరు భావిస్తుండగా.. అసలు తెలుగు పరిశ్రమకు ప్రస్తుతం పెద్దలెవరు లేరంటూ మోహన్ బాబు వ్యాఖ్యనిస్తున్నారు.

    ఈ ఇద్దరు సీనియర్ హీరోలు నిప్పు ఉప్పులా మారి ఒకరిపై మరొకరు చాలా సందర్భాల్లో పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. అసలు మంచి మిత్రులుగా మెలిగిన వీరి మధ్య మనస్పర్థలు ఎలా వచ్చాయి..? అందుకు గల కారణాలు ఏంటో మీరూ తెలుసుకోండి.

    వివాదం ఇలా ప్రారంభమైంది

    తెలుగు చిత్ర పరిశ్రమ 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో 2007లో వజ్రోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో చిరంజీవికి లెజెండరీ, మోహన్ బాబుకు సెలబ్రిటీ పురస్కారాలను ప్రకటించారు. దీంతో తనను కాదని చిరంజీవికి లెజెండరీ అవార్డు ప్రకటించడంతో మోహన్‌బాబు మనస్థాపానికి గురయ్యాడు. పరోక్షంగా వేదికపైనే విమర్శలు చేసి పురస్కారాన్ని తిరస్కరించాడు. చిరంజీవి కూడ మోహన్‌బాబు తీరుపై విమర్శలు చేసి అవార్డు తిరిగి ఇచ్చేశాడు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోగా వీరిద్దరి మధ్య వివాదాన్ని దాసరి నారాయణ రావు సద్దుమణిగించారు. కాని మరలా వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

    రాజకీయ కారణాలు

    చిరంజీవి 2008, ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవిపై జీవిత- రాజశేఖర్ పలు కామెంట్లు చేశారు. వారికి మద్దతుగా మోహన్ బాబు కూడ నిలవడంతో వీరిద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. అలాగే మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ మోహన్ బాబు వైసీపీకి మద్దతు ప్రకటించారు. మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి పోటీ చేశారు. ఇలా రాజకీయంగా మంచు, మెగా ఫ్యామిలీల మధ్య దూరం బాగా పెరిగిపోయింది. అలాగే ఏపీలో వరదలు సంభవించినప్పుడు చిరంజీవి సాయం చేయకపోవడాన్ని మోహన్‌బాబు తప్పుబట్టారు.

    మా ఎన్నికలు

    ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు, ప్రత్యర్థిగా ప్రకాశ్ రాజ్ పోటీ చేశారు. ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేసినా నేను విష్ణును తప్పుకోమని చెప్పి వారికి మద్ధతు ఇచ్చేవాడినని కాని మెగా ఫ్యామిలీ తమకు మద్దతు ఇవ్వడం లేదని మోహన్‌బాబు బహిరంగంగా విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీ చేసినప్పటికీ పోటీ మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే విధంగా జరిగింది. పవన కల్యాణ్, మంచు విష్ణులు కూడ పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు.

    సినిమా టికెట్ల అంశం

    ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల విషయంపై జోక్యం చేసుకోవడంతో ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి సీఎం జగన్‌తో మాట్లాడదామని మోహన్‌బాబు పిలుపునిచ్చారు. కాని ఎవరు ముందుకు రాకపోవడంతో అందరూ సైలెంట్ అయ్యారు. కాని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు చిరంజీవి, మహేశ్ బాబు, రాజమౌళి, ప్రభాస్‌లాంటి అగ్ర హీరోలు సీఎం సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి సీఎం కార్యాలయం నుంచి నాకు కూడ ఆహ్వానం అందిందని.. కాని కొందరు మాత్రం తనకు తెలియకుండానే వెళ్లారని మోహన్‌బాబు మరోసారి ఘూటు వ్యాఖ్యలు చేశారు.

    ఇప్పుడెందుకు వైరల్ అయ్యారు

    మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా ఫిబ్రవరి 18న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మోహన్‌బాబు ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువవయ్యాయని పేర్కొన్నారు. ఇగో కారణంగానే అందరం కలవలేకపోతున్నామన్నాడు. గతంలో అందరం కలిసి సమస్యలు పరిష్కరించుకునేవాళ్లమని వివరించాడు. నా దృష్టిలో ఎవరికి వారే గొప్పవారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. 

    సరదా సంభాషణలు 

    చిరంజీవి- మోహన్‌బాబు మధ్య ఎన్ని మనస్పర్థలు వచ్చినా ఇట్టే కలిసిపోతుంటారు. చాలా సందర్భాల్లో ఒకరిపై మరొకరు ఛలోక్తులు చేసుకున్నారు. చిరంజీవి ట్విట్టర్ ఖాతాను తెరిచిన వెంటనే మోహన్‌బాబు స్వాగతం మిత్రమా అంటూ ట్వీట్ చేశాడు. అందుకు సరదాగా రాననుకున్నావా.. రాలేననుకున్నావా అంటూ చిరంజీవి రీట్వీట్ చేశాడు. ఇటీవల బాలకృష్ణ హోస్టుగా చేసిన అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో కూడ చిరంజీవి గురించి మోహన్‌బాబు పాజిటివ్‌గా మాట్లాడారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version