‘కాంతార’ ఎందుకు తప్పక చూడాల్సిన సినిమా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘కాంతార’ ఎందుకు తప్పక చూడాల్సిన సినిమా?

  ‘కాంతార’ ఎందుకు తప్పక చూడాల్సిన సినిమా?

  October 10, 2022

  ‘కాంతార’, ఓ కన్నడ సినిమా. పాన్‌ ఇండియా సినిమా అంటూ పెద్ద హంగూ ఆర్భాటాలు ఏమీ లేకుండానే రిలీజైన ఈ సినిమా పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగుతోంది. ఎందుకు ఈ సినిమాకు అంత క్రేజ్‌. ఇప్పటిదాకా ఎవరూ చెప్పని కథ చెప్పారా?, ఎవరికీ సాధ్యం కానీ కథనం ఉందా? ఏమో! కానీ ఈ సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటికి వచ్చేటపుడు మాత్రం మాములుగా రావు. నీకేదో దేవుడు ఆవహించి శివాలెత్తిన అనుభూతి కలుగుతుంది. నీ బుర్ర నిండా ఆ సినిమా చివరి అరగంటనే గిర్రున తిరుగుతుంది. భాషాభయం,బేధం లేని సినీ ప్రియులు ఈ పాటికే కన్నడలో చూసేసి ఉంటారు. అయినా తెలుగులో నవంబర్‌ 15న విడుదల కాబోతోంది. అసలెందుకు ఈ సినిమా చూడాలి? ఇది చదివితే మీకే తెలుస్తుంది.

  రక్షిత్‌ శెట్టి, రిషభ్‌ శెట్టి, రాజ్‌ బీ శెట్టి…కన్నడ సినీ చరిత్ర పుటల్లో తప్పక నిలిచే పేర్లు. వీరు సినిమాల్లో పనిచేయడం కాదు సినిమా అనేది వీరి జీవితం. వారి సినిమాలు చూస్తే అది మీకే తెలుస్తుంది. రక్షిత్‌ శెట్టి ‘ఉలిదవరు కదంతే’ సినిమాను డైరెక్ట్‌ చేస్తే, కిర్రిక్ పార్టీ, భీమసేన నల మహారాజ, అవనే శ్రీమన్నారాయణ లాంటి అద్భుతమైన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక రాజ్ బీ శెట్టి గురించి చెప్పాలంటే ఆయన ‘గరుడ గమన వృషభ వాహన’ ఒక్క సినిమా చాలు. ఈ సినిమా చూశాక మీకు కన్నడ సినిమాలపై ప్రేమ పెరగకపోతే ఒట్టు, అలా ఉంటుంది. రాజ్‌ బి శెట్టి, రిషభ్‌ శెట్టి కళా ప్రియులు, సంస్కృతిని ప్రేమించేవారు, జీవన విధానాన్ని దగ్గరగా పరిశీలించి అది నలుగురికి చాటి చెప్పాలనే తపన ఉన్నవారు. అందుకే వీరి సినిమాల్లో సహజత్వం ఉంటుంది. నటనలో తీవ్రత కనబడుతుంది. అలాగని ఏదో డాక్యుమెంటరీలా ఉండదు. భారీ ఫైట్లు, బీభత్సమైన సెట్లు లేకుండానే మిమ్మల్ని కుర్చీలోంచి ఎగరేయగల సత్తా ఉన్న దర్శకులు, నటులు. ‘గరుడ గమన..’ శివ పాత్రతో రాజ్ బీ శెట్టి గూస్‌బంప్స్‌ తెప్పిస్తే…. ‘కాంతార’లో శివగా రిషభ్‌ శెట్టి పూనకాలు తెప్పించాడు. ఎక్కడో దక్షిణ కర్ణాటకలో ‘తులునాడు’గా పిలిచే ప్రాంతంలో అక్కడి ప్రజల విశ్వాసాలు, భూతకళ(దైవ కళ)గా పిలిచే ఓ నృత్య కళను తీసుకుని సినిమాలో ప్రేక్షకుల మతులు పోగొట్టేలా తీయడం రిషభ్‌ శెట్టికే చెల్లింది.

  నిజానికి ‘కాంతార’ స్టోరీలైన్ చిన్నది. ‘ఓ అడవి, అందులో ఓ భూమి, ఆ భూమి కోసం కుట్రలు, కుతంత్రాలు’ అంతే. కానీ దానీ చుట్టూ రాసుకున్న కథనం, కామెడీ, సన్నివేశాలు మిమ్మల్ని వెంటాడేలా ఉంటాయి. థియేటర్లో ఉలిక్కిపడేలా చేస్తాయి. హీరో పాత్ర పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది. ‘శివ’ అంటే రౌద్రం. ఆ రౌద్రం సినిమా అంతటా కనిపిస్తుంది. అటవీ అధికారి, ఊరి జమిందారు, హీరో అన్న ఇలా ఏ పాత్ర తీసుకున్న పక్కాగా రాసుకున్నారు. మూఢ విశ్వాసాలను ప్రోత్సహించేలా ఉందంటూ కొందరు నాస్తికులు అనొచ్చు. కానీ సినిమాగా చూస్తే ‘కాంతార’ అద్భుతం. ఈ మధ్య ఏ సినిమాలోనూ ఇంతలా మనసులోకి చొచ్చుకుపోయే క్లైమాక్స్‌ లేదంటే అతిశయోక్తి కాదు. ఇక సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. రిషభ్‌ శెట్టి ఎంత చక్కగా రాసుకున్నాడో….అంత గొప్పగా అజ్‌నీశ్‌ లోక్‌నాథ్ BGM అందించాడు. సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందంటే…మీకు థియేటర్లో కాదు అడవిలో కూర్చున్న అనుభూతిని తెస్తుంది. 

  ఇంతకీ ‘కాంతార’ అంటే ఏంటో తెలీదు కదా. ఓ రకంగా ‘అడవి’ అని అర్థం. సినిమా అభిమానులు అస్సలు మిస్‌ అవ్వకండి. సినిమా చూసి మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ల రూపంలో పంచుకోండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version