ఏ రోజైతే బ్రిటీష్ మీడియా, ఆ దేశ క్రికెట్ అభిమానులు భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీని పొగరుబోతు అని అవమానించిందో సరిగ్గా 20 ఏళ్ల తర్వాత సాక్షాత్తూ బ్రిటన్ ప్రభుత్వం ఆదేశ పార్లమెంటులోనే దాదాను సత్కరించింది. లెజండరీ క్రికెటర్ అని స్తుతించింది. అసలు గంగూలీపై బ్రిటీష్ మీడియా ఎందుకు చులకనగా మాట్లాడింది. ఇప్పుడెందుకు ఆ దేశం గంగూలీని సన్మానించిందో ఓసారి గతాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం.
భావోద్వేగాలు రగిల్చిన నాట్ వెస్ట్ ఫైనల్
2002 జులై 13న లార్డ్స్ నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 325 పరుగులు చేసింది. ఆ తర్వాత 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఇన్నింగ్స్ ను ధాటిగా ప్రారంభించింది. కానీ సొంత ప్రేక్షకుల మద్దతుతో పుంజుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు 146 పరుగులకే 5 కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాపై పై చేయి సాధించారు.దీంతో జట్టు కష్టాల్లోకి వెళ్లింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఇంగ్లిష్ ఆటగాళ్లు మన ప్లేయర్లను కట్టడి చేసేందుకు చాలా ప్రయత్నించారు. పరుగులు తీస్తున్న క్రమంలో అడ్డుపడటం, ఉరుమి ఉరుమి చూడటం వంటివి చేశారు.ఇంగ్లాండ్ బౌలర్ ఫ్లింటాప్ అయితే ఏకంగా భారత ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేశాడు. ఇదంతా చూస్తున్న సగటు భారతీయ ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిల్చింది. ఇంగ్లాండ్ పై గెలిచి బుద్ది చెప్పాలని ప్రతి ఒక్కరూ భావించారు. చక్కని పోరాట పటిమ ప్రదర్శించిన యవరాజ్-కైఫ్ కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.69 పరుగులు చేసి యువీ ఔటైనప్పటికీ.. కైఫ్ మాత్రం చెలరేగి ఆడాడు. ఫలితంగా రెండు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.
దీంతో అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరభ్ గంగూలీ భారత్ విజయం సాధించగానే పట్టలేని సంతోషంతో చొక్కా విప్పితిప్పాడు. దానిని గాల్లోకి తిప్పుతూ విజయదరహాసం చేస్తుంటే సగటు క్రీడాభిమాని రోమాలు నిక్కపొడిచాయంటే అతిశయోక్తి కాదు.
గంగూలీపై నోరుపారేసుకున్న బ్రిటన్ మీడియా
అయితే డ్రెస్సింగ్ రూమ్ బయట గంగూలీ ప్రవర్తించిన తీరుపై ఇంగ్లాండ్ మీడియా విషాన్ని వెల్లగక్కింది. గంగూలీ క్రీడాస్ఫూర్తితో ప్రవర్తించలేదని ఆరోపించింది. గర్వంతో ఊగిపోయాడని విమర్శించింది. ఇతర టీమిండియా ఆటగాళ్లపైనా తన అక్కసు వెళ్లగక్కింది. తమ ఆటగాళ్లను మాత్రం వెనకేసుకొచ్చింది.
గంగూలీకి సన్మానం
కాల చక్రంలో ఏదైనా జరగవచ్చు అనేదానికి నిదర్శనం ఇదే కాబోలు.
యాదృచ్ఛికంగా 20 ఏళ్ల తర్వాత అదే నరరంలో నాట్‌వెస్ట్ ఫైనల్ విజయాన్ని అందించిన జూలై 13నే భారత క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీని బ్రిటన్ ప్రభుత్వం సత్కరించింది. బ్రిటన్ పార్లమెంటులో సత్కరిస్తూ క్రికెట్ కు ఎనలేని సేవలు గంగూలీ చేశారని కీర్తించింది.
నాట్ వెస్ట్ సిరీస్ భారత క్రికెట్ చరిత్రలో మైలురాయి
ఎవరు ఏమన్నప్పటికీ భారత క్రికెట్ చరిత్రలో నాట్ వెస్ట్ సిరీస్ 2002 లిఖించదగ్గ అధ్యాయం. టీమిండియా పోరాట స్ఫూర్తికి, ఆత్మగౌరవానికి నిలువుటద్దంగా నిలిచిందనడంలో ఎలాంటీ సందేహం లేదు.