నాని, నజ్రియా జంటగా నటించిన ‘అంటే సుందరానికి’ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నాని మరోసారి కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించడం, నజ్రియా మొదటి తెలుగు సినిమా కావడంతో ప్రేక్షకుల సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి మూవీ ఎలా ఉంది అసలు స్టోరీ ఏంటి తెలుసుకుందాం
కథేంటంటే..
సుందర్(నాని), లీలా(నజ్రియా) చిన్ననాటి స్నేహితులు. అయితే సుందర్ హిందూ, లీలా థామస్ క్రిస్టియన్. ఇద్దరి కుటుంబంలో వారి ఆచారాలను చాలా కఠినంగా పాటిస్తుంటారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లు పెరిగి పెద్దయిన తర్వాత ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. అయితే వారి కుటుంబాల్లో చెప్పేందుకు భయపడుతుంటారు. దీంతో ఇద్దరు అబద్దాలు చెప్పి వాళ్లను ఒప్పించాలనుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది. ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతాయి. చివరికి పెళ్లి జరుగుతుందా లేదా తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కొత్త ఆలోచనలతో కథలను చెప్తుంటాడు. ఇంతకుముందు మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా కూడా మంచి క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి. వివేక్ ఆత్రేయ సినిమా అంటే బాగుంటుంది అని అంచనాలు వేసుకోని వెళ్లినవారిని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. సింపుల్ స్టోరీని ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా చక్కగా తెరకెక్కించాడు. సినిమాలో ఎక్కువగా లీలా, సుందర్ స్టోరీ కంటే రెండు ఫ్యామిలీల మధ్య కథ ఎక్కువగా ఉంటుంది. నాని, నజ్రియాల కెమిస్ట్రీ చాలా చక్కగా పండింది. ఆ పాత్రల్లో వారిని తప్ప ఎవరినీ ఊహించుకోలేనంతగా ఒదిగిపోయారు. స్టోరీ ప్రారంభంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ ముందు నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. ఇక అక్కడినుంచి ప్రేక్షకులకు కథతో పాటు ప్రయాణించేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథలో వచ్చే సన్నివేశాలను బట్టి కామెడీ పండింది. కానీ కామెడీ కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లు ఏమీ లేవు. ఎమోషన్స్ కూడా అదే స్థాయిలో కనిపించాయి. చివరికి ప్రేక్షకులకు ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చాలా చక్కగా చెప్పి ముగించాడు దర్శకుడు.
ఎవరెలా చేశారంటే..
న్యాచురల్ స్టార్ నానికి ఇలాంటి పాత్రలు చేయడం కొత్తేం కాదు. ఇలాంటి పక్కింటి కుర్రాడిలా ఉండే క్యారెక్టర్స్‌లో నాని ఇమిడిపోతాడు. నజ్రియా మొదటిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నా చాలా చక్కని అభినయం కనబరిచింది. వీరి తల్లిదండ్రులుగా నటించిన నరేశ్, తల్లి రోహిణి, నదియా, అజగం పెరుమాళ్ పాత్రలు ఈ సినిమాకు చాలా కీలకం. అందరూ నటీనటులు వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక అమృతం హర్షకు ఈ సినిమాతో మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ లభించిది.
సాంకేతిక విషయాలు
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరోసారి తన కలం బలాన్ని చూపించాడు. రాసుకున్న కథను తెరపై చూపించడంలోనూ విజయం సాధించాడు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ పాటలు ఎలా ఉన్నప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను కథకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫర్ నికిత్ బొమ్మె విజువల్స్‌ను చక్కగా చూపించాడు. ఎడిటింగ్ విషయానికొస్తే మొదటి బాగంలో ఎడిటర్ రవితేజ గిరిజాల కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది.
బలాలు
నాని, నజ్రియా
నటీనటులు
కథ
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
బలహీనతలు
సినిమా ప్రారంభంలో కాస్త సాగదీసినట్లు అనిపించడం
పాటలు
రేటింగ్: 3/5