జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది. సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది. ఇటీవల పలు సాంగ్స్ రిలీజ్ చేసిన దేవర టీమ్ మంగళవారం (సెప్టెంబర్ 10) ట్రైలర్‌నూ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. తారక్ ఇందులో తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు మేకర్స్ ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తారక్ అభిమానుల్లో కొత్త భయానికి తెరతీసింది. గతంలో తారక్ చేసి ద్విపాత్రాభినయం చిత్రాలు ఫ్లాప్ కావడంతో ‘దేవర’ ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డ్యూయల్ అంటే ఫసక్కేనా!
‘దేవర’ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్ గతంలోనూ పలు చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ (Jr NTR Dual Role Films) చేశారు. ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’, ‘అదుర్స్’ చిత్రాల్లో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. వీటిలో తారక్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆంధ్రావాలా’. పూరి జగన్నాథ్ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శక్తి’ మూవీలోనూ తారక్ ద్విపాత్రాభినయం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ రెండు చిత్రాలు తారక్, అతడి ఫ్యాన్స్‌కు పీడకలను మిగిల్చాయి. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్’ ప్రయోగం కొద్దిమేర ఫలించినా కమర్షియల్‌గా ఆ సినిమా సక్సెస్ కాలేదు. రూ.26 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘అదుర్స్’ కేవలం రెండు కోట్ల మార్జిన్ (రూ.28 కోట్ల గ్రాస్) మాత్రమే సాధించింది. అయితే తారక్ రెండు కంటే ఎక్కువ పాత్రలు చేసిన ‘జై లవ కుశ’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్ డ్యూయల్ రోల్ కాకుండా త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం.
‘దేవర’ హిట్ కష్టమేనా!
జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ చేసినప్పుడల్లా ఏదోక ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత చిత్రాలు అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారక్‌ను వెంటాడుతున్న ఈ బ్యాడ్ సెంటిమెంట్ ‘దేవర’పై కూడా పనిచేస్తే భారీ దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి ‘దేవర’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు ‘దేవర’తో తారక్ చెక్ పెడతాడని స్పష్టం చేస్తున్నారు. అటు ‘దేవర’ ట్రైలర్ కూడా అదిరిపోయిందని ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘దేవర’ సినిమా సక్సెస్ కావాలని మనమూ కోరుకుందాం.
‘NTR 31’లోనూ డ్యూయల్ రోల్!
తారక్ (Jr NTR) హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలోనూ జూ.ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ‘దేవర’కు ఊహించని ఫలితం ఎదురైతే ‘NTR 31’ను కూడా ఆ సెంటిమెంట్ వెంటాడే ప్రమాదం ఉంది.
దేవర ట్రైలర్ ఎలా ఉందంటే?
దేవర ట్రైలర్ ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.