తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో తెలుగుతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా నేడు రిలీజ్ కానుండటంతో #JrNTR, #DevaraTrailer, #KoratalaSiva వంటి హ్యాష్‌ట్యాగ్స్ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ తన ప్రతీ సినిమాలో ఓ ప్రత్యేక ఫార్మూలాను అనుసరిస్తుంటారు. ఆయన గత చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అయితే దీనిని ఆధారంగా చేసుకొని కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను అంచనా వేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
కొరటాల ఫార్ములా ఇదే?
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’ (Mirchi), ‘శ్రీమంతుడు’ (Srimanthudu), ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage), ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ఈ సినిమా కథ, నేపథ్యం వేర్వేరు అయినప్పటికీ అందులో అంతర్లీనంగా ఉన్న ఫార్ములా మాత్రం ఒక్కటే. అది ఏంటంటే, ఔట్‌సైడర్ అయిన హీరో ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ కష్టాలు అనుభవిస్తున్న ప్రజలకు అండగా ఉంటాడు. ఇబ్బందులకు గురిచేస్తున్న విలన్‌ను బుద్ది చెప్తాడు. కట్ చేస్తే హీరోకు ఆ ప్రాంత విలన్‌కు లింకప్ చేస్తూ ఓ గతం ఉంటుంది. పైన చెప్పిన ఈ సినిమాల ప్లాట్స్‌ను గుర్తుచేసుకొని దానికి ఇప్పుడు చెప్పిన ఫార్మూలాను అన్వయించుకుంటే మీకూ ఇది నిజమే అనిపిస్తుంది. కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ కూడా ఇదే ఫార్మూలతో వచ్చిందే. ఔట్‌సైడర్ అయిన చిరు, పాదగట్టం అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ అరచాకం సృష్టిస్తున్న విలన్లను అంతం చేస్తాడు. రామ్‌చరణ్ – పాదగట్టం – చిరును లింకప్ చేస్తూ ఓ ఫ్లాష్‌బ్యాక్‌ను రాసుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ.
దేవర స్టోరీ ఇదేనా?
కొరటాల శివ గత చిత్రాల ఫార్మూలాను ఆధారంగా కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను ప్రిడిక్షన్ చేస్తున్నారు. దాని ప్రకారం ఫస్ట్ టీజర్‌లో చూపించిన ఎర్ర సముద్రాన్ని ఒక ప్రాంతంగా అంచనా వేస్తున్నారు. ఎర్ర సముద్ర ప్రాంతంలో నివసించే జాలర్లకు ఎన్టీఆర్ నాయకుడు. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్న విలన్లకు అతడు గట్టిగా బుద్ది చెబుతాడు. దీంతో కుట్ర చేసి విలన్ల గ్యాంగ్ అతడ్ని అంతం చేస్తుంది. విలన్ల దాడి నుంచి తప్పించుకున్న అతడి కుమారుడు (ఎన్టీఆర్) పెద్దయ్యాక తిరిగి ఆ ప్రాంతానికి వచ్చి విలన్లపై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది ప్లాట్ అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొరటాల ఫార్మూలాను బట్టి చూస్తే ‘దేవర’ ప్లాట్ ఇదే అయ్యి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకూ వాస్తవమో తెలియదు కాని ప్లాట్ మాత్రం కన్విన్సింగ్ ఉందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
చరిత్ర సృష్టించిన ‘దేవర’
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’ (Devara) చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే పాటలతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఓవర్సీస్‌లో దీని ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా తాజాగా అది 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో టికెట్ల ప్రీసేల్ ద్వారా అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
ముగ్గురు స్టార్ డైరెక్టర్లతో తారక్..
‘దేవర’ తర్వాత తారక్ లైనప్‌లో బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’తో పాటు ‘NTR 31’ కూడా ఉంది. హిందీ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, ‘NTR 31’ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. అయితే తాజాగా కొరటాల శివతో పాటు ఈ ఇద్దరు డైరెక్టర్లతో తారక్ దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తన ముగ్గురు డైరెక్టర్లతో తారక్ కలయిక సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ క్రేజీ కలయికకు ఓ కారణం ఉన్నట్లు సమాచారం. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు దర్శకులతో తారక్ ఓ ఇంటర్యూలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ట్రైలర్ లోడింగ్..
యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతోన్న దేవర చిత్రం నుంచి నేడు (సెప్టెంబర్ 10) ట్రైలర్ రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు దీన్ని రీలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ట్రైలర్ 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్ కూడా యాక్షన్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.