విరాట్ కోహ్లీ ఈ పేరు వింటే చాలు ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. టీమిండియా బ్యాటింగ్ లైనప్ మొత్తం ఒక వైపు, విరాట్ కోహ్లీ మరో వైపు అనేలా చూసేవారు. అలాగే ప్రణాళికలు కూడా రచించేవారు. కానీ కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అతడి బ్యాటు నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లు రావడం తగ్గిపోయింది. దీంతో ప్రత్యర్థులు కూడా విరాట్ కోహ్లీని తేలిగ్గా తీసుకోవడం స్టార్ట్ చేశారనే భావన ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.
కోహ్లీ సెంచరీ అదో జాతీయ సమస్య..
రన్ మెషీన్ కోహ్లీ సెంచరీ చేయక దాదాపు 838 రోజులు దాటిపోయింది. విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి సెంచరీ వస్తుందని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయినా కానీ వారి ఆశ మాత్రం నెరవేరడం లేదు. వన్డే, టీ20, టెస్టు ఇలా ఫార్మాట్ ఏదైనా సరే కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే బౌలర్లు, ఫీల్డర్లకు చెమటలు పట్టేవి. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అంతే కాకుండా అతడి బ్యాటు నుంచి భారీ ఇన్నింగ్స్ కోసం కోహ్లీ వీరాభిమానులు మాత్రమే కాకుండా క్రీడా ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో కలుపుకుని మూడంకెల స్కోరు నమోదు చేయకుండా కోహ్లీ 71 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
గతంలో 7 ఇన్నింగ్సులకోసారి..
విరాట్ కోహ్లీ గతంలో ఏడు ఇన్సింగ్సులకోసారి మూడంకెల స్కోరును నమోదు చేసేవాడు. కానీ గత రెండున్నర సంవత్సరాల నుంచి మాత్రం కోహ్లీ మూడంకెల స్కోరును అందుకోవడంలో వరుసగా విఫలమవుతూ ఉన్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు ఆడిన కోహ్లీ ఇందులో కూడా మూడంకెల స్కోరును నమోదు చేయలేకపోయాడు. కోహ్లీకిది వందో టెస్టు. ఇప్పటి వరకు వంద టెస్టులు ఆడిన 12వ భారత ఆటగాడు విరాట్ కోహ్లీ.
సచిన్ వందో సెంచరీ సమయంలో ఇలానే..
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ సమయంలో కూడా ఇలాంటి నిరీక్షణనే ప్రేక్షకులు అనుభవించారు. 99 సెంచరీలు పూర్తి చేసిన సచిన్ వందో సెంచరీ పూర్తి చేసేందుకు 362 రోజుల సమయం పట్టింది. సచిన్ అప్పుడు దాదాపు 33 ఇన్నింగ్సులు ఆడాడు. చివరకు అతడు బంగ్లాదేశ్ మీద సెంచరీ చేసి వంద సెంచరీల రికార్డును అందుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ విషయంలో కూడా అలాగే జరుగుతోందని అంతా అనుకుంటున్నారు.
ప్రమాదంలో కోహ్లీ యావరేజ్…
కింగ్ కోహ్లీ అంటేనే యావరేజ్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం కోహ్లీకి టెస్టుల్లో 50+ యావరేజ్ ఉంది. కానీ గత కొద్ది రోజులుగా అతడు భారీ స్కోర్లు నమోదు చేయకపోవడంతో ఆ యావరేజ్ క్రమంగా పడిపోతుంది. దీంతో అతడి యావరేజ్ క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. 12వ తేదీ నుంచి లంకతో మొదలు కానున్న రెండో టెస్టులో కోహ్లీ భారీ స్కోరు చేయకపోతే చాలా రోజుల తర్వాత కోహ్లీ యావరేజ్ 50 కంటే తక్కువకు పడిపోతుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!