హైదరాబాద్ నగరం మరో ఆధ్యాత్మిక కట్టడం ముస్తాబవుతోంది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్’ (Hare Krishna Heritage Tower)ను నిర్మించబోతున్నారు.
హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లకు పైగా వ్యయంతో ఈ హెరిటేజ్ టవర్ నిర్మిస్తున్నారు.
ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆధ్యాత్మిక కట్టడానికి శంకుస్థాపన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
430 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ టవర్ పూర్తైతే దేశంలో ఎత్తైన కట్టడాల్లో ఒకటిగా నిలవనుంది. హైదరాబాద్‌కు మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది.
ఈ హెరిటేజ్ టవర్ ప్రత్యేకతల విషయానికి వస్తే ఆలయ మండపంలో రాధాకృష్ణులతో పాటు ఎనిమిది మంది ప్రధాన గోపికల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు.
తిరుమల తరహాలో అతిపెద్ద ప్రాకారంతో కూడిన శ్రీనివాసుడి ఆలయం కూడా ఇందులో ఏర్పాటు కానుంది.
శ్రీనివాస గోవిందుడి కోసం పూర్తిగా రాతి నుంచి దేవాలయాన్ని చెక్కనున్నారు. విభిన్నమైన పురాతన కాలం నాటి దేవాలయ కట్టడాల సంస్కృతి ఉట్టిపడేలా దీని నిర్మాణం జరగనుంది.
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్టుగా రూపొందే ఈ హెరిటేజ్ టవర్ కాకతీయ, చాళుక్య, ద్రవిడ చక్రవర్తుల కాలం నాటి కట్టడాల శైలిని పోలి ఉండనుంది.
ఈ హెరిటేజ్ టవర్‌లో మ్యూజియం, గ్రంథాలయంతో పాటు ప్రతిఒక్కరిలో ఆధ్యాత్మికభావం పెంపొందించేలా మందిరాలు, హోలోగ్రామ్, లేజర్ ప్రొజెక్టర్లతో కూడిన ఇతరత్రా ఆధునిక సౌకర్యాలూ అందుబాటులోకి తేనున్నారు.
ఉచిత అన్నదాన సత్రం కూడా ఈ హెరిటేజ్ టవర్‌లో ఏర్పాటు చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులకోసం ఎలివేటర్లు, ర్యాంపులతో పాటు భక్తులు నిరీక్షించేందుకు క్యూ హాల్ నిర్మించనున్నారు.
హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ప్రారంభోత్సవం అయితే ఆ ప్రాంతమంతా అధ్యాత్మిక, వాణిజ్య హబ్‌గా మారనుంది. ఎంతో మంది చిరు వ్యాపారులకు ఉపాధి లభించనుంది.
హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణానికి తన వంతుగా తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు ప్రకటించింది. 2028 నాటికి ఈ ఆధ్యాత్మిక కట్టడం పూర్తి కానుంది.