టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో సంగీత (Sangeetha Krish) ఒకరు. అందం, నటన, డ్యాన్స్‌లతో ఆమె పలు చిత్రాల్లో అదరగొట్టింది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఇవాళ సంగీత పుట్టిన రోజు. 46వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
నిర్మాతల ఫ్యామిలీ
చెన్నైకి చెందిన సంగీత 1978 అక్టోబర్ 21న జన్మించింది. ఆమె అసలు పేరు రసిక కాగా సినిమాల్లోకి వచ్చాక సంగీతగా మార్చుకుంది. ఆమె తాత కె.ఆర్. బాలన్ తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత. 20కి పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. తండ్రి శాంతారామ్ కూడా తమిళంలో పలు చిత్రాలను నిర్మించడం గమనార్హం. సంగీతకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్ డేస్‌లోనే భరతనాట్యం నేర్చుకుంది. మలయాళం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గంగోత్రి’ (1997) సినిమా సంగీత ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ ఫిల్మ్ ‘సర్కస్ సత్తిపండు’.
ఆ చిత్రాలతో గుర్తింపు
1997లోనే సర్కస్ సత్తిపండు సినిమాలో నటించినప్పటికీ తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో తమిళం, మలయాళ భాషల్లో సంగీత వరుసగా చిత్రాలు చేసింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘ఆశల సందడి‘ (1999) మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. ఆ తర్వాత‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖుషీ ఖుషీగా’, ‘సంక్రాంతి’ శివపుత్రుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది.
సింగర్‌తో లవ్ మ్యారేజ్
కెరీర్ పీక్స్‌లో ఉండగానే నటి సంగీత వివాహం చేసుకున్నారు. తమిళ స్టార్ సింగర్ క్రిష్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఆమె తొలిసారి క్రిష్‌ను చూశారు. తన నుంచి అవార్డు తీసుకోవడానికి స్టేజీపైకి వస్తున్న క్రమంలో అతడి లుక్స్ చూసి తను ఫిదా అయినట్లు ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆపై అతడి అట్రాక్టివ్ స్పీచ్‌కు ఆమె మరింత కనెక్ట్ అయ్యారు. అనుకోకుండా అదే రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో డిన్నర్ ప్లాన్ చేయగా క్రిష్ కూడా అక్కడకు వచ్చారట. ఆ సందర్భంగా క్రిష్‌తో నేరుగా మీరు నచ్చారని సంగీత అన్నారట. ఆపై ఇద్దరు నెంబర్లు మార్చుకోవడం, మూడు నెలల్లో ఎంగేజ్‌మెంట్, 8 నెలల్లో పెళ్లి కూడా జరిగిపోయినట్లు సంగీత తెలిపారు. తర్వాతి ఏడాది అవార్డు ఫంక్షన్‌కు తామిద్దరం జంటగా వెళ్లినట్లు పేర్కొన్నారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు!
తెలుగులో పలు హిట్ చిత్రాలు చేసినప్పటికీ సంగీత ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. 2010లో వచ్చిన ‘కారా మజాకా‘ తర్వాత మరో తెలుగు చిత్రం చేయడానికి 10 ఏళ్ల సమయం తీసుకుంది. మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు‘తో మరోమారు తెలుగు ఇండస్ట్రీలోకి కమ్ బ్యాక్ ఇచ్చింది. అప్పటివరకూ హీరోయిన్‌గా, లీడ్ యాక్ట్రెస్‌గా నటించిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మెుదలు పెట్టింది. ఆచార్య (స్పెషల్ సాంగ్), మసూద, వారసుడు వంటి సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా మసూద చిత్రానికి గాను ఉత్తమ సహాయనటిగా సైమా అవార్డు సైతం అందుకుంది.
బుల్లితెర హోస్ట్‌గానూ..
నటి సంగీత బుల్లితెర హోస్ట్‌గానూ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణిస్తోంది. తమిళ టెలివిజన్ డ్యాన్స్ షోస్ జోడీ నెం.1, డ్యాన్స్ జోడీ డ్యాన్స్, సూపర్ జోడీ (తెలుగు)లకు ఆమె జడ్జిగా వ్యవహరించారు. కొత్త డ్యాన్సర్లను ప్రోత్సహిస్తూ తగిన సూచనలు చేశారు. ఈటీవీ వేదికగా వచ్చే పండుగ స్పెషల్ షోలలోనూ పాల్గొంటూ బుల్లితెర ఆడియన్స్‌ను అలరిస్తున్నారు.