దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చారు. ఈ క్రమంలోనే ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ (James Cameron).. మరోమారు మన దర్శకధీరుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఓ అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
జేమ్స్ కామెరాన్ ఏమన్నారంటే?
తాజాగా సాటర్న్ అవార్డుల కార్యక్రమంలో జేమ్స్ కామెరాన్ (James Cameron on SS Rajamouli) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గురించి అడిగారు. గతంలో రాజమౌళిని, ఆర్‌ఆర్‌ఆర్ మూవీని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దాని గురించి కాస్త చెబుతారా అంటూ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీంతో కామెరాన్ స్పందిస్తూ.. ‘నిజం చెప్పాలంటే నేను అతనితో చాలా నిజాయతీగా నాకు అనిపించిన విషయాన్ని చెప్పాను. అది (ఆర్‌ఆర్‌ఆర్) చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమాను ప్రపంచ వేదికపై ఆదిరిస్తూ ఇలాంటి స్థాయికి చేరడం గొప్పగా ఉంది’ అని సమాధానం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోని ఆర్ఆర్ఆర్ టీమ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో విషయం బయటకొచ్చింది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ రియాక్షన్ ఇదే!
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్.. రాజమౌళిని (James Cameron on SS Rajamouli) మరోమారు మెచ్చుకోవడంపై ఆర్‌ఆర్ఆర్ టీమ్ స్పందించింది. కామెరాన్ వీడియోను షేర్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు జత చేసింది. ‘జేమ్స్ కామెరాన్.. మీ అమూల్యమైన మాటలు మాలో స్ఫూర్తి నింపుతాయి. మరింత బాగా పని చేసేలా ప్రేరేపిస్తాయి. ఇండియన్ సినిమా అన్ని సరిహద్దులను చెరిపేస్తుందని మేము బలంగా విశ్వసిస్తున్నాం’ అని ఆర్ఆర్ఆర్(RRR) మూవీ తన ఎక్స్ అకౌంట్లో అభిప్రాయపడింది. మరోవైపు ఈ ట్వీట్‌ను నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. రాజమౌళి పనితనాన్ని మెచ్చుకుంటూ తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గతంలోనూ ఇలాగే..!
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ గతేడాది ‘గోల్డెన్ గ్లోబ్స్’ తో పాటు ‘ఆస్కార్’ కూడా గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు పాట’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి కింద ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. ఆస్కార్ అవార్డ్ కార్యక్రమానికి వచ్చిన జేమ్స్ కామెరాన్‌ను అప్పట్లో రాజమౌళి కలిశారు. తాను కూడా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చూశానని.. అదోక అద్భుతం అంటూ ఆ సందర్భంగా రాజమౌళితో కామెరూన్ వ్యాఖ్యానించారు. తన భార్యకు కూడా ‘ఆర్ఆర్ఆర్’ చూడాలని సూచించినట్లు చెప్పారు. ప్రపంచస్థాయి దర్శకుడు రాజమౌళిని, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని ప్రశంసించడంతో ఆ వార్త యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.
రాజమౌళి బిజీ బిజీ..!
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోనే (Deepika Padukone)ను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తారని సమాచారం.
జర్మనీలో చెమటోడ్చిన మహేష్!
సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం జర్మనీ వెళ్లారు. రాజమౌళి సినిమా కోసమని అక్కడ మూడు వారాల పాటు వ్యాయామంలో శిక్షణ కూడా తీసుకున్నారని టాక్. ఇటీవల మహేష్ హైదరాబాద్‌కు తిరిగి రాగా ఎయిర్‌పోర్టులో అతడి లుక్ చూసి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. లాంగ్ హెయిర్‌తో తలపైన టోపి పెట్టుకుని అచ్చం హాలీవుడ్ హీరోలాగా మహేష్ కనిపించాడు. దీంతో రాజమౌళి సినిమాలో అతడి లుక్ ఇలాగే ఉండొచ్చని ఊహాగానాలు మెుదలయ్యాయి. ఇదిలా ఉంటే రాజమౌళి తండ్రి, సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా సమాచారం బయట పెట్టారు. స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని, సినిమా నటీనటులు ఎంపిక, షూటింగ్ త్వరలోనే జరుగుతుందని అన్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?