నటీనటులు : వరుణ్ సందేశ్, అనీ జిబి, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, శ్రేయా రాణి రెడ్డి, మధు తదితరులు
రచన, దర్శకత్వం : రాజేష్ జగన్నాథం
సంగీతం : సంతు ఓంకార్
సినిమాటోగ్రఫీ : రమిజ్ నవీత్
ఎడిటర్ : అనిల్ కుమార్. పి
నిర్మాత: రాజేష్ జగన్నాథం
విడుదల తేదీ: 21 జూన్, 2024
వరుణ్‌సందేశ్ హీరోగా.. రాజేశ్ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న వరుణ్ సందేశ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తాడు. దీంతో అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? ఆ ఆరుగురిలో హత్య చేసింది ఎవరు? ‘నింద’ పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా వివేక్ అడ్డుకోగలిగాడా? లేదా? అనేది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
కెరీర్‌లో చాలా వరకూ లవర్ బాయ్ పాత్రలే చేసిన వరుణ్ సందేశ్.. ఇందులో వివేక్ అనే పాత్రలో కొత్త కనిపించాడు. మానవ హక్కుల కమీషనర్ ఉద్యోగిగా తన మార్క్ నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ పడిన కష్టం.. ప్రతీ సీన్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాతో అతడు నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. అటు బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు తమ నటనతో ఆకట్టుకున్నారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
చేయని నేరానికి ఏళ్ల తరబడి శిక్ష అనుభవించిన ఘటనలు ఇటీవల తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దర్శకుడు రాజేష్ జగన్నాథం ఈ పాయింట్‌నే కథాంశంగా తీసుకోవడం ప్రశంసనీయం. ఆరుగురు వ్యక్తుల కిడ్నాప్‌తో కథ మెుదలు పెట్టిన దర్శకుడు.. వారి నుంచి నిజాన్ని రాబట్టేందుకు ఇంటర్వెల్ వరకూ సమయాన్ని తీసుకోవడం కాస్త సాగదీతలా అనిపిస్తుంది. ప్రేక్షకులకు బోర్ తెప్పిస్తుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ను దర్శకుడు చాలా ఆసక్తికరంగా నడిపించారు. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అన్న ప్రశ్నలకు సెకండాఫ్‌లో క్లారిటీ ఇస్తూ వచ్చారు డైరెక్టర్. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఫస్టాఫ్‌లోని సాగదీత సన్నివేశాలను పక్కనబెడితే క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ మూవీ పర్వాలేదనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్యం సంగీతం మెప్పిస్తుంది. అయితే కొన్ని చోట్ల డైలాగ్స్‌ను డామినేట్ చేయడం వల్ల సరిగా వినిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ లోకేషన్స్‌లో సినిమాను తీసినప్పటికీ విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వరణ్ సందేశ్ నటన
నేపథ్య సంగీతం
సెకండాఫ్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్
సాగదీత సీన్స్