Nitish Kumar Reddy: ఆస్ట్రేలియా గడ్డపై నితీష్ రెడ్డి తగ్గేదేలే.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nitish Kumar Reddy: ఆస్ట్రేలియా గడ్డపై నితీష్ రెడ్డి తగ్గేదేలే.. వీడియో వైరల్

    Nitish Kumar Reddy: ఆస్ట్రేలియా గడ్డపై నితీష్ రెడ్డి తగ్గేదేలే.. వీడియో వైరల్

    December 28, 2024

    బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డి (Nitish Kumar Reddy) అదరగొట్టాడు. క్లిష్ట సమయంలో భారత్‌ తరపున క్రీజులోకి వచ్చిన అతడు సెంచరీతో కదం తొక్కాడు. రోహిత్‌, కోహ్లీ, కే.ఎల్‌.రాహుల్‌, రిషబ్‌ వంటి హేమా హేమీ బ్యాటర్లు తడబడ్డ పిచ్‌పై స్థిరంగా బ్యాటింగ్ చేస్తూ ఆసిస్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. ఈ క్రమంలో వరుసగా అర్ధ శతకం, శతకం పూర్తి చేసుకొని భారత్‌ను ఫాలోఆన్‌ గండం నుంచి గట్టెక్కించాడు. అయితే హాఫ్‌ సెంచరీ సందర్భంగా ‘పుష్ప’ మేనరిజమ్‌తో నితీష్‌ చేసుకున్న సెలబ్రేషన్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 

    నితీశ్‌ ‘తగ్గేదేలే’..

    ఆంధ్రప్రదేశ్‌ వైజాగ్‌కు చెందిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. బోర్డర్‌ – గవాస్కర్‌ ట్రోఫీతోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాపై జరుగుతున్న మూడో మ్యాచ్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టెస్టుల్లో తన మెుదటి హాఫ్‌ సెంచరీ చేశాడు. ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ వేసిన 82 ఓవర్‌ మూడో బంతిని ఆఫ్‌ సైడ్‌ ఆడి బౌండరీకి తరలించిన నితీష్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ మేనరిజంతో సంబరాలు చేసుకున్నాడు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా కేరింతలు మెుదలయ్యాయి. ఆపై మరింత నిలకడగా ఆడిన నితీష్‌ కుమార్‌ 171 బంతుల్లో తన తొలి శతకాన్ని కూడా నమోదు చేశాడు. ప్రస్తుతం 105 (176) స్కోరుతో నాటౌట్‌గా క్రీజులో కొనసాగుతున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ 358/9 (116)గా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ చేసిన స్కోర్‌కు 116 పరుగులు వెనకబడి ఉంది.

    తండ్రి భావోద్వేగం..

    కుమారుడు నితీష్‌ కుమార్ రెడ్డి టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేయడంతో అతడి తండ్రి ముత్యాలరెడ్డి ఆనందాలకు అవధులు లేకుండా పోయింది. నితీష్‌ ఇన్నింగ్స్‌ చూసేందుకు వైజాగ్‌ వచ్చి మెల్‌బోర్న్‌ వచ్చిన ముత్యాల రెడ్డి కుమారుడి సక్సెస్ చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అంతకుముందు సుందర్‌ (50), బుమ్రా (0) వెంట వెంటనే ఔట్‌ కావడంతో నితీష్‌ సెంచరీపై మైదానంలో ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలో అద్భుతమైన ఫోర్‌ కొట్టిన నితీష్‌ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు నితీష్‌ రెడ్డికి స్డాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే నితీష్‌ కుమార్‌ క్రికెట్‌ కెరీర్‌ కోసం ఆయన తండ్రి ముత్యాల రెడ్డి ఎన్నో త్యాగాలు చేశారు. కొడుకును క్రికెటర్‌గా మార్చేందుకు 25 ఏళ్ల సర్వీస్‌ ఉన్న ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. 

    ఆసీస్‌పై నితీష్‌ జైత్రయాత్ర

    బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2024-25తో నితీష్‌ కుమార్‌ టెస్టుల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కఠినమైన ఆస్ట్రేలియా పిచ్‌లపై రోహిత్‌, విరాట్‌ కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్లు తేలిపోతున్న క్రమంలో నితీష్‌ టీమిండియా తరపున గొప్పగా పోరాడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల ఆరు ఇన్నింగ్స్‌లో నితీష్‌కు బ్యాటింగ్‌ చేసే ఛాన్స్ వచ్చింది. ఆడిన ప్రతి టెస్టు మ్యాచ్‌లో నితీష్ 40కి పైగా పరుగులు చేశాడు. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నితీష్ 59 బంతుల్లో 41 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 27 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అడిలైడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ 54 బంతుల్లో 42 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లో 42 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నితీష్ కుమార్ 11 బంతుల్లో 1 పరుగు చేసి ఔటయ్యాడు. మ్యాచ్‌ డ్రా కావడంతో రెండో ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ రాలేదు. ఇక నాల్గో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో ఏకంగా సెంచరీతో రాణించాడు నితీష్‌. 

    నితీష్‌.. క్రికెట్‌ కెరీర్

    ఏపీలోని వైజాగ్‌లో 26 మే, 2003న నితీశ్‌ కుమార్‌ రెడ్డి జన్మించాడు. అతడిది దిగువ మధ్య తరగతి కుటుంబం. తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్తాన్ జింక్‌లో గతంలో ఉద్యోగం చేశారు. కాగా, నితీష్ రెడ్డి ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. హిందూస్తాన్ జింక్ కంపెనీ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్‌తో తన ఆటను ప్రారంభించాడు. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కెరీర్ ఆరంభంలో విశాఖ మైదానంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు హాజరైన నితీష్ కుమార్ రెడ్డి.. మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో కడపలోని ఏసీఏ అకాడమీలో చేరి మరింత రాటు దేలాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఓపెనర్‌గా ఆడిన నితీష్ కుమార్ రెడ్డి మీడియం పేసర్‌గానూ సత్తా చాటాడు. ఇక అండర్ – 19బీ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించి అక్కడ తన టాలెంట్‌ ఏంతో చూపించాడు. 2019-20 రంజీ సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున సత్తా చాటి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version