ఐపీఎల్-2024 సీజన్‌లో మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు.. తెలుగు బిడ్డ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) విధ్వంసం సృష్టించాడు. అద్భుత బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ బౌలర్లకు తలొగ్గలేదు. ఫోర్లు, సిక్సర్లతో వారికి చుక్కలు చూపించాడు. ముఖ్యంగా 15వ ఓవర్‌లో హర్‌ప్రీత్ బ్రార్ వేసిన బంతులను ఉతికారేశాడు. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 22 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న నితీశ్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
నితీశ్ వీర విహారం
మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ బ్యాటర్లు.. అభిషేక్ శర్మ (16), ట్రావిస్ హెడ్ (21), ఐడెన్ మార్క్‌రమ్ (0) త్వరగా ఔట్ కావడంతో 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి SRH కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (64) తన బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రాహుల్ త్రిపాఠి (11), హెన్రిచ్ క్లాసెన్ (9) ఔటైనా.. నితీశ్ ఏ మాత్రం దూకుడు తగ్గించలేదు. 32 బంతుల్లోనే అర్ధ శకతం పూర్తి చేసుకున్నాడు. నితీశ్ అద్భుత ఇన్నింగ్స్‌తో సన్‍రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన పంజాబ్‌ను 180/6 స్కోరుకు కట్టడి చేసి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.
రూ. 20లక్షల కనీస ధరతో..
2023లో నితీశ్‌ను రూ.20 లక్షల కనీస ధరతో సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. తొలి సీజన్లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సీజన్లో అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని సన్‌రైజర్స్ భావించింది. ఇందుకు అనుగుణంగా చెన్నైతో మ్యాచ్ (CSK vs SRH)లో లోయర్ మిడిలార్డర్లో బరిలోకి దింపింది. ఈ మ్యాచ్ ఛేదనలో నితీశ్.. 8 బంతుల్లో 14 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడి ప్రతిభను గుర్తించిన సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్.. పంజాబ్‌పై మ్యాచ్‌లో కాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. దీంతో వచ్చిన ఛాన్స్‌ను పూర్తిగా సద్వివినియోగం చేసుకొని నితీశ్ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. అటు బౌలింగ్‌లోనూ 1/33 గణాంకాలను నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఐదేళ్లకే బ్యాట్ పట్టిన నితీశ్
ఏపీలోని వైజాగ్‌లో 26 మే, 2003న నితీశ్ కుమార్ రెడ్డి జన్మించాడు. అతడిది దిగువ మధ్య తరగతి కుటుంబం. తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్తాన్ జింక్‌లో గతంలో ఉద్యోగం చేశారు. కాగా, నితీష్ రెడ్డి ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. హిందూస్తాన్ జింక్ కంపెనీ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్‌తో తన ఆటను ప్రారంభించాడు. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కెరీర్ ఆరంభంలో విశాఖ మైదానంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు హాజరైన నితీష్ కుమార్ రెడ్డి.. మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో కడపలోని ఏసీఏ అకాడమీలో చేరి మరింత రాటు దేలాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఓపెనర్‌గా ఆడిన నితీష్ కుమార్ రెడ్డి మీడియం పేసర్‌గానూ సత్తా చాటాడు. ఇక అండర్ – 19బీ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించి అక్కడ తన టాలెంట్ ఏంతో చూపించాడు. 2019-20 రంజీ సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్.. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో 366 పరుగులు చేశాడు.
మరో పేస్ ఆల్‌రౌండర్ దొరికినట్లేనా?
టీమ్‌ఇండియాను పేస్ ఆల్‌రౌండర్ల కొరత ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. కపిల్‌దేవ్ తర్వాత ఆ స్థాయిలో నమ్మదగిన ప్లేయర్ ఇప్పటివరకూ భారత జట్టుకు లభించలేదు. హార్దిక్ పాండ్య పేస్ ఆల్‌రౌండర్‌గా కొద్ది కాలం అదరగొట్టినప్పటికీ కీలక టోర్నీల్లో గాయపడుతూ జట్టును ఇబ్బంది పెడుతున్నాడు. ఇక విజయ్‌శంకర్, వెంకటేశ్ అయ్యర్ అంటూ కొంతమంది పేస్ ఆల్‌రౌండర్లు జట్టులోకి వచ్చినా ప్రభావం చూపించలేకపోయారు. తాజాగా శివమ్ దూబె.. పేస్ బలం చూపిస్తాడా అంటే.. బ్యాటింగ్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఈ సమయంలో పేస్ ఆల్‌రౌండర్ కోసం బీసీసీఐ గాలింపు కొనసాగుతూనే ఉంది. నితీశ్ బ్యాటింగ్ స్టైల్, బౌలింగ్‌లో వైవిధ్యం చూస్తుంటే ఆ స్థానానికి అర్హుడని అనిపిస్తోంది. ఈ టోర్నీలో నిలకడగా రాణించడంతోపాటు ఫిట్‌నెస్‌నూ కాపాడుకుంటే వచ్చే టీ20 ప్రపంచకప్‌లో నితీశ్ ఎంపిక ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హార్దిక్ పాండ్యకు బ్యాకప్‌గా నితీశ్ పేరును పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?