యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్ (Hanuman) యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రంతో పాటు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఏర్పడింది. ఇక ‘హనుమాన్’కు సీక్వెల్ కూడా ఉండనున్నట్లు ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ‘జై హనుమాన్’ రిలీజ్, తమ సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం అవి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
‘బాధ్యత పెరిగింది’
పాన్ ఇండియా స్థాయిలో హనుమాన్ సక్సెస్ కావడం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వ్యాఖ్యానించారు. ‘హనుమాన్’ రూ.100 కోట్లు మాత్రమే వసూలు చేసుంటే ఈ పాటికీి సీక్వెల్‌ను ఎప్పుడో రిలీజ్ చేసేవాళ్లమని పేర్కొన్నారు. కానీ ఆ చిత్రం మా అంచనాలకు మించి కలెక్షన్లు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. దీంతో ‘జై హనుమాన్’పై మరింత బాధ్యతగా వర్క్ చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘జై హనుమాన్’ కోసం ఎంతో కష్టపడుతున్నామని ప్రశాంత్ వర్మ అన్నారు. స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ సీక్వెల్ అందరి అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అభిమానులు స్క్రీన్‌పై ఏ అంశాలైతే చూడాలని భావిస్తున్నారో అవి కచ్చితంగా చూపిస్తామని ప్రశాంత్ వర్మ హామి ఇచ్చారు.
‘ముందే వీఎఫ్‌ఎక్స్ పనులు’
‘హనుమాన్’ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వందల కోట్లతో రూపొందిన ‘ఆదిపురుష్’ కంటే ‘హనుమాన్’ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయంటూ ప్రశంసలు వచ్చాయి. దీనిపై కూడా ప్రశాంత్ వర్మ తాజాగా స్పందించారు. ‘హనుమాన్ సమయంలో మొదట షూటింగ్ చేసి తర్వాత వీఎఫ్‌ఎక్స్ పనులు ప్రారంభించాం. కానీ దీని సీక్వెల్ (జై హనుమాన్)కు మాత్రం వీఎఫ్‌ఎక్స్ పనులు ముందే సిద్ధం చేస్తున్నాం. దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం పట్టవు. ప్రస్తుతానికైతే షూటింగ్ మెుదలవ్వలేదు’ అంటూ జై హనుమాన్‌పై ప్రశాంత్ వర్మ కీలక అప్‌డేట్స్ ఇచ్చారు.
బాలీవుడ్ స్టార్స్ పక్కా!
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌పై ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాల కోసం కొందరు బాలీవుడ్ స్టార్స్‌ను కలిసినట్లు చెప్పారు. వారితో తన ఆలోచనలు పంచుకున్నట్లు తెలిపారు. ఇందులో వారు కచ్చితంగా భాగం అవుతారని స్పష్టం చేశారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని తెలిపారు. అటు ‘జై హనుమాన్’ పట్టాలెక్కేందుకు కూడా సమయం పట్టనుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పష్టం చేశారు. దాని కంటే ముందు ‘అధీరా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పేర్కొన్నారు. దీనితో పాటు మరో రెండు సినిమాలకు కూడా ప్రస్తుతం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇతర దర్శకులు కూడా వాటి కోసం వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిలో మోక్షజ్ఞ ఫిల్మ్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం కనీసం ఒకటి, రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు.
మోక్షజ్ఞతో మూవీ షురూ
నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్ లుక్‌లో స్మైలింగ్ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ మోక్షజ్ఞకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
‘జై హనుమాన్’తో లింకప్!
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ కాంబోరానున్న చిత్రానికి ‘PVCU 2’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తన సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్ ఉంటుందని గతంలో ప్రశాంత్ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ‘PVCU 2’ ప్రాజెక్ట్ తర్వాత ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా ‘జై హనుమాన్’తో కనెక్షన్ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ మామా ఏం ప్లాన్ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.