సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ మర్నాడే బెయిల్‌పై బన్నీ విడుదలైనప్పటికీ ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) టాలీవుడ్‌ను టార్గెట్ చేశారంటూ విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొక్కిసలాట ఘటనపై స్పందించారు. అల్లు అర్జున్ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
‘అనుమతి లేకున్నా వచ్చారు’
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఘటన జరిగిన తీరు, హీరో నిర్లక్ష్య ధోరణి గురించి ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ రెండో తారీఖున అప్లికేషన్ పెట్టుకుంటే మూడో తారీఖు పోలీసులు తిరస్కరించారు. నాలుగో తారీఖున ఎవరూ థియేటర్‌కి రావొద్దు మేము పర్మిషన్ ఇవ్వము అని పోలీసులు తిరస్కరించినా హీరో రాత్రి 9.30కి థియేటర్‌కు వచ్చారు’ అని రేవంత్ తెలిపారు.
‘సైలెంట్‌గా వెళ్లలేదు’
అల్లు అర్జున్ అనుమతి లేకుండా రావడమే కాకుండా రూఫ్ టాప్ ఓపెన్ చేసి భారీ జన సమీకరణకు కారణమయ్యాడని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘బన్నీ సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే ఇంత జరిగేది కాదేమో. క్రాస్ రోడ్ చౌరస్తా ముందు నుంచే కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అందరికి హాయ్ చెప్తూ వెళ్లారు. దీనివల్ల చుట్టుపక్కల థియేటర్ల ఆడియన్స్ బన్నీని చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. దీంతో రోడ్లపై వేలాది మంది పోగయ్యారు. దీంతో అక్కడ ఒక విధమైన రద్దీ వాతావరణం ఏర్పడింది’ అని రేవంత్ అన్నారు.
‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’
ర్యాలీగా బన్నీ రావడంతో అతడితో పాటే థియేటర్‌లోకి ఫ్యాన్స్ బలంగా తోసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో అతని ప్రైవేటు సెక్యూరిటీ.. 50, 60 మంది బౌన్సర్లు విపరీతంగా ఎలా పడితే అలా తోసేయడంతో తొక్కిసలాట జరిగిందని సీఎం తెలిపారు. చివరికి అక్కడ ఉన్న జనాలను పోలీసులు చెల్లాచెదురు చేయడంతో అక్కడ ఇద్దరు విగత జీవులుగా పడి కనిపించారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకేసారి అంతమంది తోసుకురావడంతోనే తొక్కిసలాట జరిగి ఆమె (రేవతి) చనిపోయిందని అసెంబ్లీలో స్పష్టం చేశారు.
‘బిడ్డను రక్షించేందుకు రేవతి యత్నించింది’
తొక్కిసలాట సమయంలో బిడ్డను కాపాడుకునేందుకు తల్లిగా రేవతి ఎంతో ప్రయత్నించిందని సీఎం రేవంత్ తెలిపారు. సొమ్మసిల్లిపడిపోయినా కూడా బిడ్డ చేతిని మాత్రం గట్టిగానే పట్టుకొని ఉండిపోయిందని అన్నారు. పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని, బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడని సీఎం అన్నారు. అటు థియేటర్లో కూడా హీరోని కలవాలని తొక్కిసలాట జరిగినట్టు తెలిసిందని రేవంత్ చెప్పారు.
‘వెళ్లమని చెప్పినా వినలేదు’
తొక్కిసలాట అనంతరం హీరోను వెళ్లిపోమని పోలీసులు సూచించారని కానీ ఆయన వినలేదని సీఎం రేవంత్ తెలిపారు. సినిమా చూసే వెళ్తానని తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. ‘హీరో థియేటర్‌లో ఉండగా బాల్కనీలో కూడా అభిమానులు నిల్చొని ఒకరిపై ఒకరు పడే పరిస్థితి ఏర్పడింది. కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో హీరోను వెళ్లిపోమని చెప్పడానికి వెళ్తే ఏసీపి కూడా రావొద్దని థియేటర్ వాళ్లు చెప్పారు. అందరిపై కేసులు నమోదు చేస్తానని హెచ్చరిస్తే అప్పుడు లోపలికి అనుమతించారు’ అని రేవంత్ చెప్పారు.
‘రిటర్న్‌లోనూ చేతులు ఊపుకుంటూ వెళ్లాడు’
అల్లు అర్జున్ వద్దకు ఏసీపీ వెళ్లి బయట పరిస్థితిని వివరించిన ఆయన పట్టించుకోలేదని సీఎం అన్నారు. ‘బయట ఒకరు చనిపోయారని ఏసీపీ హీరోకి చెప్పారు. మీరు ఇక్కడ కూర్చుంటే బయట ఉన్న చాలా మందిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు వెళ్ళిపోవాలి అంటే లేదు సినిమా చూసి వెళ్తా అని ఆ హీరో చెప్పినట్టు నాకు సిటీ కమిషనర్ చెప్పడం జరిగింది. దాంతో పై అధికారి రంగంలోకి దిగి హీరోకి చెప్పి ఇక్కడ్నుంచి మీరు వెళ్ళాలి అని అతన్ని తీసుకెళ్లి బండి ఎక్కిస్తే మళ్ళీ అతను సైలెంట్ గా వెళ్లకుండా రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ అభిమానులను చూసుకుంటూ రోడ్ షో చేసుకుంటూ వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కొంతమంది థియేటర్ వాళ్ళను అరెస్ట్ చేసారు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్లి హీరోని మీరు A11 అని చెప్తే అతను పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు ఆ తర్వాత అరెస్ట్ చేసారు’ అని సీఎం అన్నారు.
‘అతడి కాలు, చేతులు పోయాయా’
జైలు నుంచి విడుదలయ్యాక సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టడం పైనా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినీ ప్రముఖులు.. ఒక్క రోజు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఆయన ఇంటికెళ్లి ప్రభుత్వాన్ని తిడుతండ్రు. నన్ను తిడుతుండ్రు. అతడ్ని పరామర్శిస్తుండ్రు. ఏమైంది అధ్యక్ష.. అతడి కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నాయా. అతడ్ని (బన్నీ) ఇంతమంది సినీ ప్రముఖులు పలకరించారు గానీ, ఆస్పత్రిల్లో ఉన్న పిల్లాడ్ని (శ్రీతేజ్) కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రాలేదు’ అని అన్నారు.
ఇక పై నో బెనిఫిట్ షోస్
సినిమా రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూనే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఇకపై ఊరుకోనని సీఎం రేవంత్ అన్నారు. ఇందుకు సీఎం కూర్చీలో కూర్చున్నన్ని రోజులు అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఆ వెంటనే మైక్ అందుకున్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ‘తెలంగాణలో ఇకపై బెన్ ఫీట్ షోలు, టికెట్ల రేట్ల పెంపును రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించారు. బన్నీపై చర్యలతో పాటు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయానికి MIM నేత అక్బరుద్ధీన్ ఓవైసీ మద్దతు తెలపడం విశేషం.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి