The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్‌’ డైరెక్టర్‌ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్‌’ డైరెక్టర్‌ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

    The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్‌’ డైరెక్టర్‌ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

    September 10, 2024

    కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌). సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధిస్తూ రూ.300 కోట్ల మార్క్‌ను సైతం అందుకుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రం ‘ది గోట్‌’కు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్‌ వెంకట్ ప్రభు స్పందించారు. తెలుగు, హిందీ ప్రేక్షకులపై అతడు చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 

    ‘అందుకే నచ్చలేదు’

    తెలుగు, హిందీ భాషల్లో ‘ది గోట్‌’ (The Greatest Of All Time) సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రూ.22 కోట్లకు ఈ మూవీని కొనుగోలు చేయగా ఇప్పటివరకు రూ.10 కోట్ల గ్రాస్‌ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బ్రేక్‌ ఈవెన్‌ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్‌ ప్రభు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబంధించిన సీన్స్ హైలైట్‌ చేయడం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఇది నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్‌లో ది గోట్‌ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. అంతేకాదు ఐపీఎల్‌లోని ముంబయి, బెంగళూరు జట్టు అభిమానులు తమ చిత్రాన్ని ఎక్కువగా ట్రోల్‌ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అభిమానిని కావడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. వెంకట్‌ ప్రభు కామెంట్స్‌ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 

    తెలుగు ఆడియన్స్ ఫైర్‌..!

    డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు తాజా కామెంట్స్‌ను తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో ‘ది గోట్‌’ డిజాస్టర్‌ దిశగా వెళ్లడానికి కారణాలు వేరే ఉన్నాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కంటెంట్‌ బాగుంటే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల చిత్రాలను తాము ఆదరిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘మానాడు’ చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ఒకసారి గుర్తుచేసుకోవాలని డైరెక్టర్‌కు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనికి విపరీతంగా అభిమానులు ఉన్నారని, హైదరాబాద్‌లో సీఎస్కే మ్యాచ్‌ జరిగితే ఎల్లో జెర్సీలతో స్టేడియం నిండిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ‘ది గోట్‌’ ఫెయిల్యూర్‌కు గల కారణాలేంటో అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

    తెలుగులో ఫ్లాప్‌కు కారణాలు ఇవే!

    దర్శకుడు వెంకట్‌ ప్రభు రొటిన్‌ స్టోరీతో ది గోట్‌ను తెరకెక్కించారు. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు. అయితే టెర్రరిజం మూలాలతో తెరకెక్కినప్పటికీ ఏజెంట్‌ సినిమాల్లో కనిపించే ట్విస్టులు ఇందులో ఉండవు. మలుపులు, మెరుపులు ఏ ఒక్కటీ కథనంలో కనిపంచలేదు. కనీసం హీరో చేసే ఆపరేషన్స్‌లోనూ థ్రిల్‌ లేదు. పైగా విరామం వరకూ కథంతా సాగతీత వ్యవహారమే. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు, యోగిబాబు కామెడీ ట్రాక్‌ తెలుగు ఆడియన్స్‌ సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌, క్లైమాక్స్‌లో వచ్చే ఐపీఎల్‌ ట్రాక్‌ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయి. 

    నో చెప్పిన ధోని!

    ‘ది గోట్‌’లో చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. హీరో శివ కార్తికేయ (Sivakarthikeyan), హీరోయిన్ త్రిష (Trisha) అతిథులుగా అలరించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీని కూడా క్లైమాక్స్‌లో చూపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) విజువల్స్‌ ద్వారా మహీని వెండితెరపై చూపారు. నిజానికి ధోనీతో ఒక్క సన్నివేశమైనా సినిమాలో చేయించాలని దర్శకుడు వెంకట్‌ ప్రభు అనుకున్నారట. అందుకు మహీ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్‌ విజువల్స్‌ ద్వారా స్క్రీన్‌పై చూపించారు. 20 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ క్రికెట్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకర్షించింది. 

    నెగిటివ్‌ రివ్యూలపైనా మండిపాటు

    ‘ది గోట్‌’ సినిమాపై వచ్చిన నెగిటివ్‌ రివ్యూలపై దర్శకుడు వెంకట్‌ ప్రభు స్పందించారు. ‘సినిమాని రూపొందించేందుకు మేం పడిన కష్టం గురించి మాట్లాడరు. కానీ, కొందరు సినిమాపై కావాలనే నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తుంటారు. ఈ సినిమాలో ఉన్నన్ని రిఫరెన్స్‌లు ఏ చిత్రంలోనూ లేవు. ఏ హీరో అభిమాని అయినా ఈ సినిమాని సెలబ్రేట్‌ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రిఫరెన్స్‌లు తీసుకున్నాం. అతిథి పాత్రల కోసమే చిత్రాన్ని రూపొందించలేదు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దా. సినిమా ఆడియన్స్‌ కోసమేగానీ రివ్యూవర్స్‌కు కాదు’ అని అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version