ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. థియేటర్‌లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న పలు సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఎలా ఉన్నాయి? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
కల్కి 2898 ఏడీ
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఇక హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్) కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్ యష్కిన్ (కమల్ హాసన్) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది?’ అన్నది కథ.
రాయన్
తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్’ (Raayan). సందీప్ కిషన్, దుషారా విజయన్, ప్రకాశ్‌రాజ్, కాళిదాస్ జయరాం, అపర్ణా బాలమురళి కీలక పాత్రలు పోషించారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మంచి వసూళ్లను సైతం రాబట్టి ప్రశంసలు అందుకుంది. కాగా, ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా రాయన్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘రాయన్ (ధనుష్) తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో జీవిస్తుంటాడు. పెద్ద తమ్ముడు ముత్తువేల్ (సందీప్ కిషన్) ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ సమస్యలు తెస్తుంటాడు. ఆ ఊళ్ళో దొరై (శరవణన్), సీతారాం (ఎస్.జే. సూర్య) అనే ఇద్దరు రౌడీలు ఉండగా ఓ రోజు దొరై అనూహ్యంగా చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారాం టార్గెట్ చేస్తాడు. దొరైని చంపింది ఎవరు? రాయన్ తమ్ముళ్లు ఏం అయ్యారు?’ అన్నది స్టోరీ.
గర్ర్
ప్రముఖ మలయాళ నటులు కుంచకో బోబన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో చేసిన చిత్రం ‘గర్ర్’ (Grrr). సర్వైవల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి జయ్ కె. దర్శకత్వం వహించారు. జూన్ 14న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులను స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా (Grrr movie ott release date) ఆగస్టు 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘ప్రేమించిన యువతి దూరం కావడంతో రెజిమెన్ నాడర్ (కుంచకో బోబన్) ఫుల్‌గా తాగేసి ఆ మత్తులో జూకి వెళ్తాడు. అక్కడితో ఆగకుండా కంచె దూకి మరి సింహం ఉన్న డెన్‌లోకి ప్రవేశిస్తాడు. జూ ఉద్యోగి హరిదాస్ నాయర్ (సూరజ్ వెంజరమూడు) అతడ్ని రక్షించేందుకు వెళ్లి అతడితోపాటు ఇరుక్కుపోతాడు. ఆ ఇద్దరినీ కాపాడేందుకు పోలీసులు, జూ అధికారులు చేసిన ప్రయత్నాలు ఏంటి? సింహం బారి నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది స్టోరి.
విరాజి
వరుణ్ సందేశ్ (Varun Sandesh) కొత్తగా ప్రయత్నించిన చిత్రం ‘విరాజి’ (Viraaji). ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు. ఈనెల 2న థియేటర్‌లో వచ్చిన ఈ మూవీ మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు ఓటీటీ వేదికగా ‘ఆహా’ (Aha)లో ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ (viraji movie ott release date) అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘వివిధ వృత్తులకు చెందిన పది మంది రకరకాల కారణాలతో పాడుబడ్డ బంగ్లాకు వస్తారు. తమను ఎవరో ట్రాప్ చేసి రప్పించారని వారికి అర్థమవుతుంది. వారిలో ఇద్దరు తప్పించుకునేందుకు యత్నించి దారుణ హత్యకు గురవుతారు. ఆ టైమ్‌లోనే డ్రగ్స్‌కు అలవాటు పడిన ఆండి (వరుణ్ సందేశ్) ఆ బంగ్లాలోకి వస్తాడు. ఆండి రాకతో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఆ బంగ్లాకు రప్పించింది ఎవరు? వారంతా క్షేమంగా బయటపడ్డారా? లేదా?’ అన్నది స్టోరీ.
తుఫాన్
‘బిచ్చగాడు‘ ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తుఫాన్‘ (Toofan Movie 2024). ఆగస్టు 9న తెలుగులో రిలీజైన ఈ సినిమాని రెండు వారాలైన కాకుండానే అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. అయితే గత వారమే ఈ సినిమా తమిళ వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. ఆగస్టు 23 నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్‌కి తీసుకొచ్చారు. ప్లాట్ ఏంటంటే ‘సలీం (విజయ్ ఆంటోని) ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీలో ఏజెంట్‌గా చేస్తుంటాడు. ఏకాంతంగా గడిపేందుకు అండమాన్ ద్వీపానికి వస్తాడు. ఓ శునకాన్ని కాపాడే క్రమంలో అతడికి సౌమ్య (మేఘా ఆకాశ్)తో పరిచయం ఏర్పడుతుంది. అయితే సౌమ్యకు స్థానిక వడ్డీ వ్యాపారి డాలి నుంచి సమస్యలు ఎదరవుతుంటాయి. ఇంతకీ ఏంటా ఆ సమస్య? ఆమెకు సలీం ఎలా అండగా నిలిచాడు? డాలిని ఎలా ఎదిరించాడు?’ అన్నది స్టోరీ.
వీరాంజనేయులు విహారయాత్ర
పైన పేర్కొన్న చిత్రాలతో పాటు గత వారం వచ్చిన మరికొన్ని ఆసక్తికర సినిమాలు కూడా ఓటీటీలో ఉన్నాయి. అలా లాస్ట్ వీక్ వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వీరాంజనేయులు విహార యాత్ర‘ (Veeranjaneyulu Vihara Yatra Review). ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్ ఇంటిల్లపాది హ్యాపీగా చూసేయచ్చు. ప్లాట్ ఏంటంటే ‘నాగేశ్వరరాలు (నరేశ్) మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఓ కారణం చేత ఉద్యోగం పోవడం, కూతురు పెళ్లి ఫిక్స్ కావడంతో అతడికి డబ్బు అవసరమవుతుంది. ఈ క్రమంలో తన తండ్రి వీరాంజనేయులు గోవాలో కొన్న ఇంటికి సంబంధించి రూ.60 లక్షల ఆఫర్ వస్తుంది. దీంతో ఇంటిని అమ్మేందుకు ఫ్యామిలీతో కలిసి గోవాకు బయల్దేరుతారు. ఈ ప్రయాణం నాగేశ్వరరావు ఫ్యామిలీపై ఎలాంటి ప్రభావం చూపింది?’ అన్నది స్టోరీ.
పేక మేడలు
గత వారమే ఓటీటీలోకి వచ్చిన మరో ఆసక్తికర చిత్రం ‘పేక మేడలు’ (Pekamedalu). క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో వినోద్ కిషన్, అనూష కృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15 నుంచి ఈటీవీ విన్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘లక్ష్మణ్, వరలక్ష్మి దంపతులు. మూసీ ఒడ్డున ఉన్న బస్తీలో నివసిస్తుంటారు. లక్ష్మణ్ ఇంజనీరింగ్ చేసినప్పటికీ ఖాళీగా తిరుగుతుంటాడు. ప్లాట్స్ అమ్మి కోట్లు సంపాదిస్తానని గాల్లో మేడలు కడుతుంటాడు. ఈ క్రమంలో యూఎస్ నుంచి వచ్చిన శ్వేతకు డబ్బున్న వ్యక్తిగా లక్ష్మణ్ దగ్గరవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? లక్మణ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి?’ అన్నది స్టోరీ.
ఎవోల్
బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఎవోల్’ (EVOL) చిత్రం ఆగస్టు 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. యోగి వెలగపూడి దర్శకత్వం వహించిన ఈమూవీలో సూర్యశ్రీనివాస్, శివబొడ్డు రాజు, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్స్ చేశారు. లవ్ ఇంగ్లిష్ స్పెల్లింగ్‍ను తిరగేసి రాస్తే వచ్చే ఎవోల్ టైటిల్‍తో ఈ మూవీ వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ఇద్దరు స్నేహితులతో ఓ అమ్మాయి ఒకేసారి ప్రేమలో పడుతుంది. వారికి శారీరకంగా దగ్గరవుతుంది. ఆయితే ఆ ఇద్దరిని ఆమె నిజంగానే ప్రేమించిందా? లేదా ట్రాప్ చేసిందా? ఈ లవ్ స్టోరీ చివరికీ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది?’ అన్నది స్టోరీ.
డార్లింగ్
టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా నటించిన ‘డార్లింగ్’ (Darling) చిత్రం ఆగస్టు 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హాట్ స్టార్ వేదికగా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘రాఘవ్ (ప్రియదర్శి) చిన్నప్పటి నుంచి పెళ్లి, హనీమూన్ అంటూ కలలు కంటాడు. భార్యను తీసుకొని హనీమూన్‌కు పారిస్ వెళ్లాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతడి లైఫ్‌లోకి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న ఆనంది (నభా నటేష్) వస్తుంది. ఆమెతో రాఘవ్ ఎన్ని తిప్పలు పడ్డాడు?’ అన్నది కథ.