టాలీవుడ్ నటుడు అడివి శేష్ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు అడివి శేష్ ఓకే చెప్పాడు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్‌పై పడింది. Sesh Ex Shruti పేరుతో స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు కూడా మెుదలుపెట్టారు. క్రమంలోనే హీరోయిన్ శ్రుతి హాసన్ చిత్ర యూనిట్‌కు ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్!
యంగ్ హీరో అడివి శేష్, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కాంబోలో చిత్రం అనగానే ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. షానియెల్ దేవ్ దర్శకత్వంలో లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ను సైతం ఖరారు చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మరి శ్రుతి హాసన్‌ను కన్విన్స్ చేసి మళ్లీ తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటారా? అన్న దానిపై ప్రస్తుతం సందిగ్దం నెలకొంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
డెకాయిట్ స్టోరీ ఇదే!
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారని మూవీ టీమ్ తెలిపింది. డెకాయిట్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్ చేశారు. ఇందులో అడివి శేష్, శ్రుతి హాసన్ కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. కాగా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది.
బాలీవుడ్ స్టార్‌కు గాయం
అడివి శేష్ (Adivi Sesh) నటించిన ‘గూఢచారి’ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జీ 2’లో అడివి శేష్ నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్ హష్మీ గొంతు వద్ద గాయమైంది. జంపింగ్ సీన్స్ తీస్తున్న సమయంలో మెడ స్వల్పంగా కట్ అయి రక్తం కారింది. దీంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి నట్టు సమాచారం. వెంటనే వైద్యులు ఇమ్రాన్‌కు చికిత్స అందించారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బనితా సంధు (Banita Sandhu) హీరోయిన్‌గా మధుశాలిని, సుప్రియ యార్లగడ్డ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందిస్తున్నాడు.
అడివి శేష్ సినీ ప్రస్థానం
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Goodachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Major), ‘హిట్ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే.