Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్‌ తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్‌ తెలుసా?

    Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్‌ తెలుసా?

    May 7, 2024

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) డైరెక్షన్‌ తొలి సారి వచ్చిన ‘ఆర్య’ (Arya) చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వన్‌ సైడ్‌ లవ్‌ అనే ఇంట్రస్టింగ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా తొలి రోజు డివైడ్‌ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలా థియేటర్లలో 125 రోజులకు పైగా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 2004 మే7న ఈ సినిమా రిలీజ్‌ కాగా, నేటితో సరిగ్గా 20 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఆర్యకు సంబంధించిన తెర వెనక రహాస్యాలపై ఓ లుక్కేద్దాం.

    దిల్‌ సక్సెస్‌తో సుకుమార్‌కు ఛాన్స్‌

    నితీన్‌ హీరోగా చేసిన ‘దిల్‌’ చిత్రానికి డైరెక్టర్‌ సుకుమార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో నిర్మాత దిల్‌ రాజుకు సుకుమార్‌ ‘ఆర్య’ స్టోరీ వినిపించారు. ఇంప్రెస్‌ అయిన అతడు..  ‘దిల్‌’ సినిమా సక్సెస్‌ అయితే కచ్చితంగా డైరెక్షన్‌ ఛాన్స్ ఇస్తా అని సుకుమార్‌కు మాటిచ్చారు. ఈ లోపు పూర్తి కథ సిద్ధం చేసుకో అని సూచించారు. ఆ తర్వాత రిలీజైన ‘దిల్‌’.. బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో సుకుమార్‌కు డైరెక్టర్‌ ఛాన్స్ వచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత ఆర్య సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ పడింది. 

    మిస్‌ చేసుకున్న అల్లరి నరేష్‌

    ఆర్య చిత్రానికి తొలుత హీరోగా అల్లరి నరేష్‌ను సుకుమార్ అనుకున్నారట. అతడ్ని దృష్టిలో పెట్టుకొనే కథను కూడా రాశారట. అయితే కొన్ని కారణాల వల్ల కథ ఆయన వరకూ వెళ్లలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్యూలో నరేష్‌ స్వయంగా పంచుకున్నారు. ‘సుకుమార్‌ ‘100%లవ్‌’ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశారు. ‘‘అల్లరి’లోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ‘ఆర్య’ కథ మీ కోసం రాసుకున్నా’’ అని చెప్పారు. ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్‌ కంటే బాగా ఎవరూ చేయలేరు’ అని నరేశ్‌ అన్నారు. 

    బన్నీని అలా ఫైనల్‌ చేశారు!

    ఆర్య కథ సిద్ధమైన తర్వాత హీరోను ఎవరు పెట్టాలన్న సందేహం కొన్ని రోజుల పాటు దర్శక నిర్మాతలను వెంటాడిందట. హీరో కోసం వెతుకున్న క్రమంలోనే దిల్‌ మూవీ స్పెషల్‌ షో నిర్వహించారు. ఆ సమయంలో బన్నీ కూడా వెళ్లాడు. అల్లుఅర్జున్‌ చలాకీ తనం, కామెడీ టైమింగ్‌ చూసి తన కథకు బన్నీ అయితేనే సరిగ్గా సరిపోతాడని దిల్‌ రాజుతో సుకుమార్‌ అన్నాడట. వెళ్లి అల్లు అర్జున్‌తో మాట్లాడరట. గంగోత్రి తర్వాత చాలా కథలు విని విసిగిపోయిన బన్నీ రొటీన్‌ స్టోరీ అనుకొని నో చెప్పారట. ఎట్టకేలకు విన్నాక కథ బన్నీకి బాగా నచ్చిందట. అటు చిరంజీవి, అల్లు అరవింద్‌కు కూడా ఇంప్రెస్‌ కావడంతో సినిమా పట్టాలెక్కింది. 

    అసిస్టెంట్‌గా చేసిన స్టార్‌ డైరెక్టర్‌

    కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన శ్రీకాంత్‌ అడ్డాల.. ఆర్య మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాదు ఓ సీన్‌లోనూ ఆయన కనిపించాడు. ఇక ఈ సినిమా టైటిల్‌ విషయంలోనూ తొలుత కాస్త గందరగోళం నెలకొందట. ఈ వన్‌సైడ్‌ లవ్‌ స్టోరీకి ఏ పేరు పెడితే బాగుంటుందా? అని దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్‌ రాజు తెగ ఆలోచించారట. ఈ క్రమంలో ‘నచికేత’ టైటిల్‌ పెడితే ఎలా ఉంటుదని చిత్ర యూనిట్‌ యోచించిందట. చివరకు బన్నీ పాత్ర పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేశారట. 

    120 రోజుల్లో షూటింగ్‌ పూర్తి

    ఆర్య చిత్ర షూటింగ్‌ను దర్శకుడు శరవేగంగా పూర్తి చేశాడు. 2003 నవంబరు 19న ఈ సినిమా లాంఛనంగా మెుదలవ్వగా.. 120 రోజుల్లోనే  పూర్తి చేశారు. అటు సుకుమార్‌ – దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ మూవీ ఆల్బమ్‌.. మ్యూజిక్‌ లవర్స్‌ను ఫిదా చేసింది. ముఖ్యంగా తెలుగు అక్షరాలమాలకు కొత్త అద్దం చెప్పే ‘అ అంటే అమలాపురం..’ పాట అప్పట్లో మాస్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆటోలు, ట్రాక్టర్లు, ఫంక్షన్లు, ఈవెంట్స్‌ ఇలా ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపించేది. 

    ఆర్యతో వారికి స్టార్‌డమ్‌

    ఆర్య సినిమా సక్సెస్‌.. డైరెక్టర్‌ సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌, నిర్మాత దిల్‌ రాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, డీవోపీ రత్నవేలు జీవితాలను మార్చివేసింది. వారి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. గంగోత్రి తర్వాత బన్నీ చేసిన రెండో చిత్రం ఆర్య. ఈ సినిమాలో బన్నీ స్టైల్‌, డ్యాన్స్‌, గ్రేస్‌, యాక్షన్‌ చూసి తెలుగు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఆర్య వచ్చి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా హీరో బన్నీ ఎక్స్‌ వేదికగా ప్రత్యేక పోస్టును సైతం పెట్టాడు. ‘నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం.. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని బన్నీ పోస్టు పెట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version