నటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, టీనా శ్రావ్య, రాద్యా సురేశ్, తేజశ్వీరావు, సాయికుమార్
దర్శకత్వం: యదు వంశీ
సంగీతం : అనుదీప్ దేవ్
సినిమాటోగ్రాఫర్ : రాజు ఎడురోలు
ఎడిటర్ : అన్వర్ అలీ
నిర్మాత : నిహారిక కొణిదెల
విడుదల: 09-08-2024
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu Review). సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. సాయికుమార్, గోపరాజు రమణ ఇతర ముఖ్య రోల్స్‌లో కనిపించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? నిర్మాతగా నిహారికకు మంచి సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గోదావరి జిల్లాలోని పురుషోత్తంపల్లి గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి భరింకాళమ్మతల్లి జాతర నిర్వహిస్తారు. ‘బలి చేట’ పేరుతో జరిగే ఈ ఉత్సవానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఈసారి జాతర జరిగిన 10 రోజులకు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో సర్చంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)కి పోటీగా శివ (సందీప్ సరోజ్) బరిలోకి దిగేందుకు రెడీ అవుతాడు. అయితే 12 ఏళ్ల క్రితం జరిగిన జాతర గొడవలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకడు ప్రాణాలు కోల్పోతాడు. స్నేహితుల మధ్య జరిగిన కులాల కొట్లాట ఇందుకు కారణం కావడంతో ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని పంచాయతీలో తీర్మానం చేస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? రిజర్వేషన్ల అంశం శివ గ్యాంగ్‌ను ఎలా విచ్ఛిన్నం చేసింది? 12 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు తిరిగి కలిశారా? అసలు ఈ గొడవలో సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి పాత్ర ఏంటి? శివ సర్పంచ్‌గా గెలిచాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
ఈ చిత్రంలో 11మంది కుర్రాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. శివగా సందీప్ సరోజ్, సుబ్బుగా త్రినాథ్ వర్మ, విలియంగా ఈశ్వర్ రచిరాజు, సూర్యగా యశ్వంత్ పెండ్యాల ఇలా ఎవరికి వారే తమదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. సాయికుమార్, గోపరాజు రమణ, కంచరపాలెం కిషోర్ వంటి వారి నటనానుభవం ఈ కథకు అదనపు బలాన్ని అందించింది. పెద్దోడుగా ప్రసాద్ బెహరా నటన అందర్నీ అలరిస్తుంది. వినోదభరిత సన్నివేశాల్లో ఎంతగా నవ్వించాడో భావోద్వేగభరిత సన్నివేశాల్లో అంతగా ఎమోషన్‌ను పండించాడు. ఇతర పాత్రదారులు కూడా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు యదు వంశీ 90’sలో కథను నడిపించారు. సమాజంలో అంతర్భాగమైన రిజర్వేషన్ల అంశాన్ని సున్నితంగా టచ్ చేశారు. ఒకే కథలో స్నేహం, ప్రేమ, కులాల సమస్య, రాజకీయం చూపించే ప్రయత్నం చేశారు. గోదావరి యాసలో రాసుకున్న సంభాషణలు, జాతర సన్నివేశాల్ని తీర్చిదిద్దుకున్న తీరు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అయితే చాలా వేగంగా గోదావరి స్టైల్ కామెడీతో కథను నడిపించారు. ఆయా సన్నివేశాలకు 90స్ కిడ్స్ సూపర్‌గా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్స్‌పై దర్శకుడు ఫోకస్ పెట్టారు. అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ స్లో అయినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు నేటి పొలిటికల్ లీడర్స్‌కు సెటైరికల్‌గా అనిపిస్తాయి. సినిమాలోని ప్రేమ కథనలు అసంపూర్తిగా వదిలేయడం, రిజర్వేషన్ల అంశాన్ని కథలో అర్థంతరంగా ముగించడం, అనవసరంగా కొన్ని సన్నివేశాలను ఇరికించడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే అనుదీప్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జాతర నేపథ్యంలో వచ్చే నేపథ్య సంగీతం కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రాఫర్ రాజు కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిహారిక కొణిదెల ఎక్కడా రాజీ పడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
- కథా నేపథ్యం
- గోదావరి స్టైల్ కామెడీ
- జాతర సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- నెమ్మదిగా సాగే కథనం
- ద్వితియార్థం
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!