మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర‘. గత కొన్నెళ్లుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 27) గ్రాండ్‌గా రిలీజైంది. అక్కడక్కడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఓవరాల్‌గా హిట్ టాక్ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. అనిరుధ్ సంగీతం నెక్స్ట్ లెవల్లో ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. రిలీజ్‌కు ముందే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇకపై మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సక్సెస్‌తో 23 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న రాజమౌళి ఫ్లాప్ రికార్డును తారక్ బద్దలు కొట్టాడని చెప్పవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తనయుడే డిక్లేర్ చేయడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్!
దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే బ్లాక్ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటివరకూ వెంటనే హిట్ కొట్టిన సందర్భం లేదు. రాజమౌళి సినిమా తర్వాత ప్రతీ హీరో డిజాస్టర్‌తో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచారు. ఇది 23 ఏళ్ల క్రితం వచ్చిన రాజమౌళి ఫస్ట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ నెం.1’ నుంచి కొనసాగుతూ వస్తోంది. ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’ చిత్రాల తర్వాత తారక్ ఘోర పరాజయాలను చవి చూశాడు. అలాగే ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ, ‘మర్యాద రామన్న’ తర్వాత సునీల్, ‘ఈగ’ తర్వాత నాని ఫ్లాప్‌లు అందుకున్నవారే. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్, రానా, అనుష్క కూడా తమ నెక్ట్స్ చిత్రాల్లో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ‘ఆర్ఆర్‌ఆర్’ తర్వాత తారక్ నటించిన చిత్రం కావడంతో సహజంగానే ‘దేవర’పై అందరిలోనూ ఆందోళనలు రేకెత్తాయి.
23 ఏళ్ల రికార్డు బద్దలు
రాజమౌళి ఫ్లాప్ రికార్డు సెంటిమెంట్ మెుదలైందే తారక్‌తో అని అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 27, 2001లో రిలీజైన స్టూడెంట్ నెం.1 చిత్రం నుంచి ఈ ఫ్లాపుల పరంపర కొనసాగుతూ వస్తోంది. అయితే 23 ఏళ్ల తర్వాత అదే రోజైన సెప్టెంబర్ 27న దేవర రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంటే ఈ ఫ్లాపుల సెంటిమెంట్ 23 ఏళ్ల కిందట ఏ హీరోతో మెుదలైందో, ఏ రోజు మెుదలైందో, మళ్లీ ఇన్నాళ్లకు అదే హీరోతో, అదే రోజుతో ముగిసిందని చెప్పవచ్చు. దీంతో రాజమౌళికి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్‌ను తారక్ బద్దలు కొట్టాడని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపై ఏ హీరో కూడా రాజమౌళి ప్లాపుల సెంటిమెంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోస్టులు పెడుతున్నారు.
కార్తికేయ స్పెషల్ పోస్టు
ఇదే విషయాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ట్వీట్ చేశాడు. ‘ఫైనల్‌గా 23 ఏళ్ల మిత్‌ను బ్రేక్ అయింది. అది కూడా ఏ వ్యక్తితో ఏ రోజు అయితే మొదలైందో మళ్లీ అదే రోజు అదే వ్యక్తితో బద్దలైంది. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఎంతో దగ్గరగా, ఆయన ఎదుగుదల, సక్సెస్‌ను చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన చేసిన అద్భుతాలను చూస్తున్నాను. తెలుగు సినిమాకు ఆయన చేస్తున్న కృషిని చూస్తూ ఉన్నాను. నాకు అస్సలు మాటలు రావడం లేదు. ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. దేవర ది బిగ్గెస్ట్ మాస్ సెలెబ్రేషన్స్ ఇన్ సినిమా. ఇక ఇప్పుడు మ్యాడ్నెస్ కూడా మాట్లాడుతుంది. ఆల్ హెయిల్ ది టైగర్’ అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.
ఫ్యాన్స్‌తో దేవర చూసిన జక్కన్న
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ‘దేవర’ (Devara Release) సందడి కనిపిస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ (NTR) నటించిన సోలో మూవీ కావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. ఈనేపథ్యంలో సినిమాహాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇదిలాఉండగా, తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) వీక్షించారు. కుటుంబసభ్యులతో కలిసి బాలానగర్‌లోని మైత్రీ విమల్ థియేటర్‌కు వచ్చిన జక్కన్న అక్కడి సినీప్రియులకు అభివాదం చేశారు. అనంతరం వారితో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూశారు. మరోవైపు, చెన్నైలోని ఓ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్. చిత్రంలోని ఫియర్ సాంగ్‌ను ఆలపించి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.