టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మృతి కారణాల పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ఏపీలో అమ్ముతున్న చీప్ లిక్కర్, కల్తీ మద్యమే కారణమని వైసీపీ సర్కారును ట్రోల్ చేస్తున్నారు. అక్కడ విరివిగా లభించే ‘బూమ్ బూమ్’ బీర్లను రాకేశ్ మాస్టర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు కోల్పోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు వీడియోలను షేర్ చేస్తున్నారు.
ఏపీలో మద్యపానం నిషేధం పేరిట తొలుత మద్యం ధరలు భారీగా పెంచారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ, కల్తీ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారనీ ఆరోపించారు. వీటి తయారీ వెనుక ఉన్నది వైసీపీ నేతలే ఉన్నారని గతంలో ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే. బ్రాండెడ్ మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని.. అందుకే చీప్ మద్యానికి అనుమతించారని కామెంట్లు చేస్తున్నారు. కల్తీ మద్యానికి రాకేష్ మాస్టర్ బలి అయ్యారని పోస్టులు పెడుతున్నారు.
మరణం ముందే తెలుసు..
ఎప్పుడూ యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్ చేసే రాకేష్ మాస్టర్ మృతిని చూసి తట్టుకోలేని అభిమానులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. రాకేష్ మాస్టర్ తాను చనిపోతాననే విషయం తనకు ముందే తెలుసు. తన అనారోగ్యం గురించి తెలిసినా… అందర్ని నవ్విస్తూ కడుపులోనే తన బాధను దాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకేశ్ మాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. “నా శరీరంలో మార్పు కనిపిస్తోంది. అది నాకు తెలుస్తోంది. నువ్వు ఉదయించే సూర్యుడివి నువ్వు అయితే… నేను అస్తమించే సూర్యుడిని. అమ్మా, నాన్నలను బాగా చూసుకో” అంటూ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. దీంతో తాను చనిపోతానన్న విషయం తనకు ముందే తెలుసని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
రాకేష్ మాస్టర్ చివరి కోరిక
ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ తన చివరి కోరిక ఏమిటో చెప్పారు. ఆయన చనిపోయాక ఎక్కడ సమాధి చేయాలో పేర్కొన్నారు. ‘ఇల్లు, దుస్తులు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. నా మామగారి సమాధి పక్కన వేప మెుక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్ ఛానెల్స్‌కు విజ్ఞప్తి చేశా’ అని మాస్టర్ అన్నారు.
డాక్టర్లు ఏమన్నారు?
రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులెటెన్ విడుదల చేశారు. ఉదయం రక్త విరేచనాలు కావడంతో మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో రాకేష్ మాస్టర్ అడ్మిట్ అయ్యారు. ఆయనకు డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ తీవ్రంగా ఉండటంతో శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతిన్నాయి అని గాంధీ సూపరింటిండెంట్ రాజారావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు.
ప్రభాస్‌కు డ్యాన్స్ శిక్షణ
రాకేశ్ మాస్టర్‌కి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. కెరీర్ ఆరంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో వేణు ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కంటెస్టెంట్‌కు మాస్టర్‌గా వ్యవహరించాడు. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది.