టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), ప్రముఖ నటి శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అక్కినేని నాగార్జున తన కుమారుడికి ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని స్వయంగా ప్రకటించడంతో ఈ వార్త నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. అయితే స్టార్ హీరోయిన్ సమంతను గతంలో నాగచైతన్య వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. నాగ చైతన్య తాజా ఎంగేంజ్‌మెంట్ నేపథ్యంలో ఈ డివోర్స్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. అక్కినేని కుటుంబాలకు వివాహాలు అసలు కలిసి రావడం లేదన్న చర్చ కూడా నెట్టింట వినిపిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలోని దాదాపు నాలుగు జంటలు విడాకుల తీసుకున్న విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అక్కినేని ఫ్యామిలీ
అక్కినేని నాగచైతన్య – సమంత విడాకుల వ్యవహారానికి ముందే ఆ ఫ్యామిలోలో నాలుగు జంటలు విడాకులు తీసుకున్నాయి. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరావు. అన్నపూర్ణమ్మ దంపతులకు ఐదుగురు సంతానం కాగా వారిలో ఒకరైనా అక్కినేని నాగార్జున హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించారు. కూతురు సత్యవతి పిల్లలైన సుమంత్, సుప్రియ ఇద్దరూ కూడా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితమే. మరో కూతురు నాగసుశీల కుమారుడు సుశాంత్ కూడా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు.
నాగార్జున విడాకులు
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం.
సుమంత్ విడాకులు
నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు.
సుప్రియా జీవితంలో విషాదం
సుమంత్ సోదరి సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) కూడా దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పరిచయమైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో సుప్రియ హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే ఆ తర్వాత ఆమె నటనకు దూరమై ఎక్కువగా సినీ నిర్మాణ కార్యకలాపాలలో భాగమైంది. ఈ క్రమంలోనే ఆమె చరణ్ రెడ్డి అనే నటుడిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది. అయితే వీరి వివాహం కూడా ఎక్కువ రోజులు సాఫీగా సాగలేదు. కొన్నాళ్లకు చరణ్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు.
అఖిల్ నిశ్చితార్థం రద్దు
అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం కంటే ముందే అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అయినా శ్రియ భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళలేదు. కొన్ని కారణాలతో అఖిల్-శ్రియ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలో శ్రియ భూపాల్ మరో యువకుడిని పెళ్లి చేసుకోగా అఖిల్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
నాగ చైతన్య – సమంత డివోర్స్
2017లో నాగ చైతన్య, సమంత గోవాలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. 2010లో ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఏర్పడిన పరిచయం ఆపై ప్రేమగా మారింది. ఏడేళ్ల లవ్ తర్వాత వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అటువంటిది అనూహ్యంగా 2021లో ఈ జంట విడాకులు తీసుకొని ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ లోకాన్ని షాక్‌కు గురి చేసింది. ఆ సమయంలో అందరూ సమంతనే పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. పెళ్లి తర్వాత సమంత బోల్డ్ రోల్స్ చేయడమే విడాకులకు కారణమైందని కొందరు నిందించారు.