Indian Oscar Entry 2025: ఆస్కార్‌ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Indian Oscar Entry 2025: ఆస్కార్‌ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!

    Indian Oscar Entry 2025: ఆస్కార్‌ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!

    September 24, 2024

    ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ ఏడాది మన దేశం తరుపున ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరూ భావించారు. అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ చిత్రం భారత్‌ తరపున ఆస్కార్‌ బరిలో నిలవడం లాంఛనమేనని అనుకున్నారు. అయితే అనూహ్యంగా హిందీ చిత్రం ‘లాపతా లేడీస్‌’ 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపికైంది. దీంతో గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో కావాలని కల్కి టీమ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

    కల్కి’కి అన్యాయం జరిగిందా?

    కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’ (Laapataa Ladies For Oscars) 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 12 మందితో కూడిన జ్యూరీ ఈ సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేసింది. దీనికి అస్సామీ దర్శకుడు జాహ్ను బారువా నేతృత్వం వహించారు. మెుత్తం 29 చిత్రాలు భారత్‌ తరపున నామినేట్‌ అయ్యేందుకు పోటీలో నిలిచాయి. అందులో టాలీవుడ్‌ నుంచి ‘కల్కి 2898 ఏడీ’, ‘హనుమాన్’, ‘మంగళవారం’ చిత్రాలు ఉన్నాయి. అయితే గ్లోబల్‌ స్థాయిలో సక్కెస్‌ అయినా కల్కిని కాదని లాపతా లేడీస్‌ను భారత్‌ తరపున ఎంపిక చేయడంపై సినీ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆస్కార్‌ సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు జరిగిన అన్యాయమే ‘కల్కి’కి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. 

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాటలో కల్కి!

    గతేడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో భారత్‌ తరపున ‘ఆర్ఆర్‌ఆర్‌’కు చోటుదక్కలేదు. దీంతో దర్శకధీరుడు రాజమౌళి జనరల్‌ కేటగిరిలో ఆస్కార్‌ను నామినేషన్స్‌ పంపించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు, ఉత్తమ డైరెక్టర్‌ సహా 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌కు పంపారు. ఈ క్రమంలో ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో షార్ట్‌ లిస్ట్‌ అయ్యి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు కల్కి టీమ్‌ కూడా భారత్‌ తరపున అధికారికంగా కాకపోయిన జనరల్‌ చిత్రాల కేటగిరిలో ఆస్కార్‌ బరిలో నిలవాలని భావిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరహాలోనే వివిధ కేటగిరీల కింద నామినేషన్స్‌ పంపాలని చిత్ర యూనిట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్‌ కమిటీ కల్కి పంపిన నామినేషన్స్‌ను పరిగణలోకి తీసుకొని షార్ట్‌ లిస్ట్‌ చేస్తే అధికారికంగా పోటీలో నిలుస్తుంది. అటు ‘హనుమాన్‌’ టీమ్‌ కూడా జనరల్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేషన్స్‌ పంపాలని భావిస్తున్నట్లు సమాచారం. 

    ‘లాపతా లేడీస్‌’ ఎంపికకు కారణం ఇదే

    లాపతా లేడీస్‌ చిత్రాన్ని భారత్‌ తరపున అధికారికంగా ఆస్కార్‌ బరిలో నిలపడానికి గల కారణాలను ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌, అస్సామి దర్శకుడు జాహ్ను బారువ వెల్లడించారు. ‘జ్యూరీ అన్ని రంగాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సరైన చిత్రాలను చూడాలి. ముఖ్యంగా లాపతా లేడీస్‌ భారతదేశ సామాజిక వ్యవస్థలు, నైతికతను చాటిచెప్పింది. భారతీయతను గొప్పగా చూపారు. అందుకే నామినేట్‌ అయిన 29 చిత్రాల్లో మేము దీన్ని ఎంపిక చేశాం. ఇది కేవలం ఒక్కరోజులో ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు. 8 రోజుల పాటు జ్యూరీ సభ్యులందరం చర్చించుకొని లాపతా లేడీస్‌ను ఎంపిక చేశాం’ అని జాహ్ను బారువా తెలిపారు. ఇక ఈ సినిమా ఆస్కార్‌కు ఎంపిక కావడంపై దర్శకురాలు కిరణ్‌రావు కూడా ఆనందం వ్యక్తంచేశారు. ‘అద్భుతమైన కథకు ప్రాణం పోయడంలో ఎంతగానో శ్రమించిన టీమ్‌, వారి హార్డ్‌వర్క్‌కు దక్కిన గుర్తింపు ఇది. భారత్‌లో ప్రేక్షకులు ఏవిధంగా మా చిత్రాన్ని ఆదరించారో.. ప్రపంచస్థాయిలోనూ అదే విధంగా అభిమానిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

    సౌత్‌ నుంచి పోటీ పడ్డ చిత్రాలు ఇవే!

    ఆస్కార్‌ అవార్డుల రేసులో భారత్‌ తరపున బరిలోకి దిగేందుకు మెుత్తం 29 చిత్రాలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. అస్కార్‌ కోసం ఈసారి ఎక్కువగా సౌత్‌ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్‌ నుంచి మూడు కాగా, కోలివుడ్‌ నుంచి 6 చిత్రాలు నామినేట్‌ లిస్ట్‌లో చోటు సంపాదించాయి. వాటిలో విజయ్‌ సేతుపతి నటించిన ‘మహారాజా’, విక్రమ్‌ హీరోగా నటించిన ‘తంగలాన్‌’, సూరి ప్రధాన పాత్ర పోషించిన ‘కొట్టుక్కాళి’, లారెన్స్‌ – ఎస్‌.జే. సూర్య నటించిన ‘జిగర్తండా డబుల్‌ ఎక్స్‌’, మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్‌ హీరోగా చేసి దర్శకత్వం వహించిన ‘జమ’ చిత్రాలు ఉన్నాయి. మలయాళం నుంచి ‘ఆట్టం’, ‘ఆడుజీవితం’ (ది గోట్‌ లైఫ్‌), ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’, ‘ఉళ్ళోజుక్కు’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్‌ నుంచి 13 సినిమాలు ఆస్కార్‌ కోసం నామినేట్‌ అయ్యాయి. అయితే భారత్‌ నుంచి ‘లాపతా లేడిస్‌’ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన రానుంది. 

    లాపతా లేడీస్‌ ప్రత్యేకత ఏంటి?

    సినిమాకి కథే హీరో అని ‘లాపతా లేడీస్‌’ చిత్రం మరోసారి నిరూపించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. మరి ఆ తర్వాత వారి జీవితాలు ఎలా సాగాయి? వాళ్ల భర్తల దగ్గరికి ఎలా చేరుకున్నారు? అనేది ఇందులో చూపించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఓ వైపు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే మరోవైపు సమాజంలోని మహిళల గుర్తింపు గురించి ప్రశ్నలు లేవనెత్తేలా తీర్చిదిద్దారు. పితృస్వామ్య వ్యవస్థపై తీసిన వ్యంగ్య చిత్రమిది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధోబీ ఘాట్‌’కు దర్శకత్వం వహించిన కిరణ్‌, 13 ఏళ్ల గ్యాప్‌ తర్వాత తెరకెక్కించిన చిత్రమిది. బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version