వెనక్కి తగ్గిన కొండా సురేఖ
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)ను విమర్శించే క్రమంలో సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya), నాగార్జున (Nagarjuna) పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ కూడా కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరమంటూ సెలబ్రిటీలు ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. తన స్వశక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఎంతో ఆదర్శమని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.
కోర్టుకు వెళ్లిన నాగార్జున
తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను సినీ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) న్యాయస్థానం తలుపుతట్టాడు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.
అసలేం జరిగిందంటే?
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌పై సురేఖ బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు.ఆ క్రమంలో అక్కినేని ఫ్యామిలీతో సహా హీరోయిన్ సమంతను వివాదంలోకి లాగారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి, సినిమా వాళ్లకు కూడా వాటిని అలవాటు చేశారని విమర్శించారు. రేవ్ పార్టీలు చేయడంతో పాటు సినీ ప్రముఖులను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. అంతటితో ఆగకుండా నాగ చైతన్య – సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు మంత్రి వ్యాఖ్యానించారు. ఇందుకు సమంతను నాగార్జున ఫోర్స్ చేయగా ఆమె ఒప్పుకోలేదని చెప్పారు. దీంతో మాట వింటే విను.. లేదంటే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారని మంత్రి సురేఖ అన్నారు. ఈ మాటలు తీవ్ర దుమారం రేపడంతో నాగార్జున, అమలతో పాటు ఇండస్ట్రీలకు చెందిన పలువురు స్టార్ హీరోలు ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొండి: నాగార్జున
మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఖండించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని కోరారు. ‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖగారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ ఎక్స్ వేదికగా నాగార్జున పోస్టు పెట్టాడు.
యాక్టర్ల జీవితాలను హైడ్‌లైన్స్ కోసం వాడొద్దు: నాగ చైతన్య
మంత్రి సురేఖ చేసిన ఆరోపణలు ఆమోదనీయం కాదని నటుడు నాగచైతన్య వ్యాఖ్యానించారు. ‘జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన, దురదృష్టకర విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య, నేను విడిపోయాం. ఎంతో పరిణితితో ఆలోచించి మా విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నాం. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు’’ అని నాగచైతన్య (Naga Chaitanya) పేర్కొన్నారు.
నా విడాకుల్లో రాజకీయ ప్రమేయం లేదు: సమంత
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల (Konda Surekha Comments)పై సమంత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను (Samantha) వేడుకుంటున్నా. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అని సామ్ పేర్కొంది.
ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు : చిరంజీవి
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలి’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
చౌకబారు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేష్ బాబు
నటుడు మహేష్ బాబు సైతం ఎక్స్ వేదికగా ఈ వివాదంపై స్పందించారు. ‘మా సినీ కుటుంబానికి చెందిన ప్రముఖులపై మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఒక కుమార్తెకు తండ్రిగా, ఒక భార్యకు భర్తగా, ఒక తల్లికి కుమారుడిగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఈ ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు తీవ్రంగా కలచివేశాయి. ఇతరుల మనోభావాలను దెబ్బతీయనంత వరకూ వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అలాగే సినీరంగాన్ని టార్గెట్‌గా చేసుకుని వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా. మన దేశంలో ఉన్న మహిళలతోపాటు సినీ ప్రముఖులను గౌరవమర్యాదలతో చూడాలి’ అని మహేష్‌బాబు పేర్కొన్నారు.
దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ: తారక్
వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని జూ. ఎన్టీఆర్ (NTR) మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ‘కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు’ అని రాసుకొచ్చారు.
అసహ్యం వేస్తోంది: నాని
యంగ్ హీరో నాని కూడా మంత్రి కొండ సురేఖకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి’ అని ఎక్స్‌లో నాని పోస్టు పెట్టారు.
రాజకీయ లబ్ది కోసమే ఈ వ్యాఖ్యలు: వెంకటేష్
సీనియర్ నటుడు వెంకటేష్ కూడా ఈ వివాదంపై స్పందించారు. ‘ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వ్యక్తిగత జీవితం, కళల పట్ల పరస్పర గౌరవం, హార్డ్‌వర్క్, అంకితభావంతో మా సినీ పరిశ్రమ ఏర్పడింది. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది. రాజకీయాల్లోకి ఇతరుల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇందులోభాగమైన వారి కుటుంబానికి బాధ మాత్రమే ఉంటుంది. అటువంటి ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం, సానుభూతి పాటించాలని కోరుతున్నా. మీ చర్యలు, మాటలు స్ఫూర్తి నింపేలా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రవర్తన చాలా అగౌరవం: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్