పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టాలీవుడ్‌తో పాటు ఏపీ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించుకొని సత్తా చాటారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత ఏపీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించారు. దీంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత హిందీ టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati) కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ ప్రశ్న వేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రశ్న ఎంటంటే?
ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు. ‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడిగారు. కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్‌లో 50 శాతం మందికి పైగా పవన్ కల్యాణ్ అని చెప్పారు. దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ రూ.1.60లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్లారు.
పవన్ లైనప్
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‍లో ప్రస్తుతం మూడు భారీ చిత్రాలు సినిమాలు ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ చిత్రాలను పవన్ ఫినిష్ చేయాల్సి ఉంది. ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ క్రిష్ ఇప్పటికే తప్పుకోవడంతో ఆ బాధ్యతలను జయకృష్ణ చేపట్టారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్’ సింగ్ రావాల్సి ఉంది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో ‘ఓజీ’ చిత్రాన్ని పవన్ పట్టాలెక్కించారు. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన గ్లింప్స్, ప్రమోషన్ పోస్టర్స్ ఇప్పటికీ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. ముఖ్యంగా ‘ఓజీ’ కోసం పవన్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇందులో తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు.
రాజకీయాల్లో బిజీ బిజీ
ఏపీ ఎన్నికలకు మూడు నెలల ముందే పవన్ షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. దీంతో అప్పటివరకూ చురుగ్గా షూటింగ్ జరుపుకున్న ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ చిత్రాలకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఏపీ ఎన్నికల్లో పవన్ నేతృత్వంలోని జనసేన అద్భుత విజయాన్ని సాధించడం, అతడు కూటమిగా ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆపై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అంతా చకచకా జరిగిపోయింది. అయితే తాను సినిమాల్లో నటిస్తానని పవన్ స్పష్టం చేశారు. కానీ, తన తొలి ప్రాధాన్యత ప్రజాసేవకే అని, వీలైనప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు షూటింగ్‍లు చేసి పెండింగ్‍లో ఉన్న చిత్రాలు పూర్తి చేస్తానని పవన్ చెప్పారు. దీంతో వాయిదా పడ్డ సినిమాలు తిరిగి పట్టాలెక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
జనసేనాని పవన్ కల్యాణ్ తిరిగి మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హరివీర మల్లు చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. అదే రోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 20 రోజుల పాటు షూటింగ్‌లోనే ఉండనున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?