Tollywood Industry Meeting: శాంతించిన సీఎం రేవంత్‌.. టికెట్ల పెంపుపై కమిటీ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Industry Meeting: శాంతించిన సీఎం రేవంత్‌.. టికెట్ల పెంపుపై కమిటీ!

    Tollywood Industry Meeting: శాంతించిన సీఎం రేవంత్‌.. టికెట్ల పెంపుపై కమిటీ!

    December 26, 2024

    సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య కొంత గ్యాప్‌ ఏర్పడిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు.. సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, సినీ పరిశ్రమ కూడా సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు.

    తొక్కిసలాట వీడియో ప్రసారం..

    బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు ఆధ్వర్యంలో ఇండస్ట్రీ నుంచి 36 మంది సీఎంతో (Tollywood Industry Meeting) సమావేశమయ్యారు. దిల్‌రాజుతో పాటు అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సీ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, రాఘవేంద్రరావు, కిరణ్ అబ్బవరం తదితరులు భేటికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు. అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు.

    సెలబ్రిటీల ప్రతిపాదనలు

    సీఎంతో భేటీలో టాలీవుడ్‌ ప్రముఖులు పలు ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేది తమ కోరికని సినీ నటుడు నాగార్జున అన్నారు. యూనివర్సల్‌ లెవల్లో స్టూడియో సెటప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని దర్శకుడు రాఘవేంద్రరావు సీఎంకు సూచించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్‌ ఘటనపై మాట్లాడిన సీనియర్‌ నటుడు మురళి మోహన్‌.. అది తమనెంతో బాధించిందన్నారు. ‘ఎన్నికల ఫలితాల మాదిరిగానే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుంది. సినిమా రిలీజ్‌లో పోటీ వల్లే ప్రమోషన్‌ కీలకంగా మారింది’ అంటూ చెప్పుకొచ్చారు. ‘నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండాలి. నగరాన్ని ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌గా చేయాలనేది మా కల’ అని నిర్మాత దగ్గుబాటి సురేష్‌ సీఎంతో అన్నారు. 

    ఆ విషయంలో సీఎం తగ్గేదేలే..

    సినీ పెద్దల అభిప్రాయాలను విన్న సీఎం రేవంత్‌ రెడ్డి (Tollywood Industry Meeting).. ప్రభుత్వ వైఖరి ఎంటో స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలి. ఆలయ పర్యటకం, ఎకోటూరిజంను ప్రచారం చేయాలి. పెట్టులబడుల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటాం. అంతేకాదు బెనిఫిట్‌ షోలు కూడా ఉండవు. దీనిపై అసెంబ్లీలో చెప్పిన మాటలకు మేం కట్టుబడి ఉంటాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ తేల్చి చెప్పారు. 

    భేటిపై దిల్‌ రాజు వివరణ..

    సీఎం రేవంత్‌రెడ్డితో సెలబ్రిటీల సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. ఈ భేటి ముగిసిన అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు భేటిలో చర్చించిన అంశాలపై మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య గ్యాప్‌ ఉందనేది కేవలం అపోహ మాత్రమేనని దిల్‌రాజు స్పష్టం చేశారు. ‘తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యం. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిలిం హబ్‌గా మార్చడానికి కృషి చేస్తాం. తెలంగాణ‌ సామాజిక కార్య‌క్రామ‌ల్లో ఫిలిం ఇండ‌స్ట్రీ నుంచి స‌హ‌కారం ఉండాల‌ని ప్ర‌భుత్వం కోరింది. డ్ర‌గ్స్, గంజాయి లాంటి ఆవ‌గాహ‌న కార్య‌క్రమాల్లో ఇక‌నుంచి న‌టీన‌టులు పాల్గోంటారు. బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు అంశం అనేది చాలా చిన్న విష‌యం. ఆ రెండింటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ఘ‌ట‌న‌ల వ‌ల‌న ప్ర‌భుత్వానికి సినీ ప‌రిశ్ర‌మకు గ్యాప్ వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది అది నిజం కాదు. టాలీవుడ్ అభివృద్ధిపై 15 రోజుల్లో నివేదిక ఇస్తాం’ అంటూ దిల్‌రాజు వివరించారు. 

    మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు..

    టాలీవుడ్‌లో సమస్యలు (Tollywood Industry Meeting), ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన సూచనలు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై పరిశోధించనుంది. అలాగే అదనపు షోల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, టికెట్‌ రేట్ల పెంపుపై కూడా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ సూచనలను ఉప సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version