AP Young Leaders: ఏపీ భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పే యువనేతలు వీరే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AP Young Leaders: ఏపీ భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పే యువనేతలు వీరే..!

    AP Young Leaders: ఏపీ భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పే యువనేతలు వీరే..!

    April 6, 2023

    ఏ రంగమైన కొత్త పుంతలు తొక్కాలంటే యువత ఎంతో కీలకం. ఇందుకు రాజకీయాలేమి మినహాయింపు కాదు. ప్రస్తుతం గొప్ప నేతలుగా కీర్తి గడించిన వారంతా ఒకప్పుడు యూత్‌ లీడర్స్‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినవాళ్లే. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై తమదైన ముద్ర వేసేందుకు కొందరు యువనేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడటంతో పాటు, తమ నియోజక వర్గం సమస్యలను తీర్చేందుకు నడుం బిగిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్నారు. TDP, YSRCP పార్టీలో ఉన్న ఆ యువనేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

    TDP యువనేతలు:

    నారా లోకేష్‌

    తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌ నాయకుడిగా నారా లోకేష్‌ ఎదుగుతున్నారు. ప్రస్తుతం యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోంది. దీంతో చంద్రబాబు తర్వాత లోకేష్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారని కార్యకర్తలు భావిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన లోకేష్‌ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని లోకేష్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

    కింజరపు రామ్‌మోహన్‌ నాయుడు

    తెదేపా యువనేతగా నారా లోకేష్‌ తర్వాత కింజరపు రామ్‌మోహన్‌ నాయుడికి మంచి పేరు ఉంది. యర్రం నాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్‌మోహన్‌.. 2019లో వైసీపీ ఎదురు గాలిని తట్టుకొని శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై అనర్గళంగా మాట్లాడుతూ యువనేతగా ఎదిగారు. రాబోయే రోజుల్లో రామ్‌మోహన్‌ నాయుడు కీలక నేతగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    పరిటాల శ్రీరామ్‌ 

    పరిటాల రవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి ఉండరు. పరిటాల రవి మరణం తర్వాత రాప్తాడు నుంచి ఆయన భార్య పరిటాల సునీత రాజకీయ వారసత్వం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఆమె మంత్రిగాను చేశారు. ప్రస్తుతం పరిటాల వారసుడిగా శ్రీరామ్‌ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీ చేయోచ్చని ప్రచారం జరుగుతోంది.

    బొజ్జల సుధీర్‌

    ఏపీ మాజీ మంత్రి, తెలుగు దేశం సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణ గతేడాది మేలో చనిపోయారు. దీంతో శ్రీకాళహస్తి నియోజక వర్గంలో ఆయన కుమారుడు బొజ్జల సుధీర్‌ తెదేపా బాధ్యతలను భుజాన వేసుకున్నారు. నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతూ స్థానిక ప్రజల మద్దతును కూడగట్టుకుంన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తరపున సుధీర్‌ పోటీ చేస్తారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. తన తండ్రిలా రాష్ట్ర రాజకీయాల్లో సుధీర్‌ ముద్ర వేస్తారని ఆశిస్తున్నారు.

    JC పవన్‌ కుమార్‌ రెడ్డి 

    అనంతపురం రాజకీయాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు జేసీ దివాకర్‌ రెడ్డి. తాడిపత్రి నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాల పాటు దివాకర్‌ రెడ్డి చక్రం తిప్పారు. ప్రస్తుతం ఆయన వారసుడిగా జేసీ పవన్‌ కుమార్‌ రెడ్డి రంగంలోకి దిగారు. నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. స్థానిక కేడర్‌ను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పవన్‌ కుమార్‌ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జేసీ దివాకర్‌ రెడ్డి స్థానంలో పవన్‌ పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

    YCP యువనేతలు:

    బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

    వైసీపీలో జగన్‌ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన యువనేతగా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పేరు సంపాదించారు. ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారటీ ఛైర్మన్‌గానూ సిద్దార్థ రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. 

    శాప్‌ ఛైర్మన్‌గా రాష్ట్రవ్యాప్తంగా సిద్ధార్థ రెడ్డి పర్యటిస్తున్నారు. క్రీడా, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని మరింత ప్రజాదరణను కూడగట్టుకుంటున్నారు. రాబోయే ఎన్నికల ద్వారా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారు. 

    దేవినేని అవినాష్‌

    విజయవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూ చెరగని ముద్ర వేశారు. ఆయన మరణం తర్వాత దేవినేని అవినాష్‌ ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతున్న అవినాష్‌.. కేడర్‌ను ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల సీఎం జగన్‌ సైతం అవినాష్‌ నాయకత్వ పటిమను మెచ్చుకున్నారు. విజయవాడ ఈస్ట్ నుంచి YCP తరపున అవినాష్‌ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. 

    కరణం వెంకటేష్‌

    తెలుగుదేశంలో కీలక నేతగా ఎదిగిన కరణం బలరాం 2019లో చీరాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం YCPలో చేరి టీడీపీకి షాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో బలరాం కుమారుడు కరణం వెంకటేష్‌ చాలా యాక్టివ్‌గా తిరుగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి వెంకటేష్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 

    మార్గాని భరత్‌

    మార్గాని నాగేశ్వరరావు రాజకీయ వారసుడిగా మార్గని భరత్‌ 2019లో రాజకీయాల్లోకి అడుపెట్టారు. YCP తరపున రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు.రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తు భరత్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో YCP తరపున కీలక నేతగా భరత్‌ ఎదుగుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

    పేర్ని కృష్ణమూర్తి

    ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పలు వేదికలపై స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి మచిలిపట్నం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మచిలిపట్నం రాజకీయాలపై కృష్ణమూర్తి తనదైన ముద్ర వేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఉమ్మడి కృష్ణ జిల్లాలో బలమైన యువనేతగా కృష్ణమూర్తి ఎదిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version