రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 15 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్ చిత్రం దూసుకెళ్తోంది. తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఏవి? అందులో కల్కి ఏ స్థానంలో నిలిచింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
15 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం 15 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 15 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. ప్రభాస్ కర్ణుడు గెటప్‌లో ఉండి రూ.1000 కోట్లకు గురి పెట్టినట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ సత్తా ఏంటో మరోమారు నిరూపితమైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఏకైకా సౌత్ హీరోగా ప్రభాస్
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ద్వారా హీరో ప్రభాస్ రికార్డు సృష్టించాడు. రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక దక్షిణాది హీరోగా నిలిచాడు. ‘బాహుబలి 2’ చిత్రం ద్వారా ప్రభాస్ తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు. సలార్‌తో మరోమారు రూ.1000 కోట్లను టచ్ చేస్తాడని భావించినా రూ.705–715 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అయితే తాజాగా కల్కితో రెండోసారి ఈ ఫీట్‌ను సాధించాడు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని నిరూపించాడు. తద్వారా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) రికార్డ్‌ను ప్రభాస్ సమం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లే రెండుసార్లు తమ చిత్రాలను వెయ్యి కోట్ల క్లబ్‌లో నిలిపాడు. జవాన్, పఠాన్ చిత్రాల ద్వారా షారుక్ ఈ ఘనత సాధించాడు.
త్వరలో టాప్-3లోకి ‘కల్కి’
తాజా కలెక్షన్స్‌తో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కల్కి ఏడో స్థానంలో నిలిచింది. రూ.2,023 కోట్లతో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ (Dangal) టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2’ చిత్రం రూ.1,810 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రూ.1,387 కోట్లు, ‘కేజీఎఫ్ 2’ రూ.1,200–1,250 కోట్లు, ‘జవాన్’ రూ.1,148 కోట్లు, ‘పఠాన్’ రూ.1,050 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కల్కి రెండు వారాల వ్యవధిలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. రూ.1300 కోట్లకు పైగా రాబట్టి ఈ జాబితాలో ఈజీగా మూడో స్థానంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో 3, 4, 5 స్థానాల్లో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2, జవాన్ సినిమాలకు షాక్ తప్పేలా లేదు.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
‘కల్కి 2898 ఏడీ’ మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘లెట్స్ సెలబ్రేట్ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్ చేసుకుంది.
ఫస్ట్ వీకెండ్ ఎంత వచ్చిందంటే?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్ వీక్ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది.