ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం రెండు వారాలుగా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు ఇప్పటికీ కొనసాగుతోంది. అగ్రకథానాయకులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటనతో పాటు యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ క్యామియోలు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ‘కల్కి’ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ఈ మూవీ రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ రెండు ఓటీటీల్లోకి..
‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి థియేటర్లో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే థియేటర్‌లో చూసినప్పటికీ ఓటీటీలోనూ మరోమారు కల్కి చిత్రాన్ని వీక్షించాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్, డిజిటల్ ప్రీమియర్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కల్కి ఓటీటీ విడుదలకు సంబంధించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెండు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంస్థలు ‘కల్కి’ ఓటీటీ హక్కులను కొనుగోలు చేశాయి. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల హక్కులను అమెజాన్ దక్కించుకోగా, హిందీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ రెండింటిలో కల్కి స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘కల్కి’ని థియేట్రికల్ రిలీజ్‌కు 7 లేదా 8 వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. దీని ప్రకారం ఆగస్టు 15న ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశముందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. స్వాతంత్ర దినోత్సవం కానుకగా కల్కిని స్ట్రీమింగ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల్లో స్ట్రీమింగ్ సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి కల్కిని ఓటీటీలో చూడాలని భావించేవారికి ఇంకో నెల రోజులు ఎదురుచూపులు తప్పకపోవచ్చు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రూ.1000 కోట్లు వచ్చినట్లేనా?
కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు వసూలు చేసినట్లు సోమవారం (జులై 8) చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రూ.100 కోట్ల దూరంలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే కల్కి కలెక్షన్స్‌కు సంబంధించి అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చి రెండ్రోజులు అవుతుంది. సోమ, మంగళవారం వసూళ్లు ఈ రూ.900 కోట్లకు యాడ్ కావాల్సి ఉంది. అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ రెండు రోజుల వసూళ్లు కలుపుకుంటే కల్కి రూ.1000 కోట్ల క్లబ్‌లో అలవోకగా చేరిపోనుంది. దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావడమే తరువాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
హిందీలో వసూళ్ల ప్రభంజనం
‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్‌లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు తోడు మహాభారతం కాన్సెప్ట్‌తో కల్కి రావడంతో అక్కడి ఆడియన్స్ విశేష ఆదరణ కనబరుస్తున్నారు. ఫలితంగా కల్కి హిందీ వెర్షన్ వసూళ్లు నేటితో (జులై 10) రూ.200 కోట్ల మార్క్‌ను అందుకుంటాయని ప్రముఖ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవాళ కల్కి చిత్రం రూ.225 కోట్ల (GROSS) మైల్‌స్టోన్‌ను అందుకుంటుందని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ స్పెషల్ పోస్టును పెట్టారు.