నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు
రచన, దర్శకత్వం: అర్జున్ వైకే
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్
ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్ ఆర్
నిర్మాత: మణికంఠ జేఎస్, ప్రసాద్‌రెడ్డి టీఆర్
విడుదల తేదీ: 03-05-2024
సుహాస్ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లింగ్ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్ మణికంఠ, టి.ఆర్.ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఫేస్ బ్లైండ్‌నెస్‌తో బాధపడే యువకుడిగా సుహాస్ ఇందులో నటించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం (మే 3) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సుహాస్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూ తెలుసుకుందాం.
కథేంటి
రేడియో జాకీగా పనిచేస్తున్న సూర్య (సుహాస్) జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి ఫేస్ బ్లైండ్‌నెస్ అనే సమస్య బారిన సూర్య పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంటాడు. ఒక రోజు సూర్య కళ్లెదుట ఓ యువతి హత్య జరుగుతుంది. అది ఎవరు చేశారో స్పష్టంగా చూడలేకపోయినా పోలీసులకు తెలియజేయాలని అనుకుంటాడు. ఏసీపీ వైదేహీ (రాశి సింగ్) వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. ఈ క్రమంలో సూర్యపై దాడి జరుగుతుంది. అనూహ్యంగా సూర్యనే ఈ హత్య కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఆ కేసులో సూర్యని ఇరికించింది ఎవరు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? పాయల్‌తో హీరో లవ్ స్టోరీ ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరో సుహాస్ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఫేస్ బ్లైండ్‌నెస్ ఉన్న వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా సుహాస్ ఇంకాస్త మెరుగయ్యాడని చెప్పవచ్చు. పాత్రకు అవసరమైన చోట హాస్యాన్నీ, భావోద్వేగాల్ని పలికించి మెప్పించాడు. ఇక సుహాస్‌కు జోడీగా పాయల్ ఓకే అనిపించింది. వారి మధ్య వచ్చే సన్నివేశాలు సరదా సరదాగా సాగుతాయి. పోలీసు ఆఫీసర్‌గా రాశి సింగ్‌కు మంచి పాత్రే దక్కింది. ఆ రోల్‌కు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. వైవాహర్ష స్నేహితుడిగా అలవాటైన పాత్రలో సందడి చేశాడు. నందు, సాయి శ్వేత పాత్రల పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డిజార్డర్ ఉన్న హీరో పాత్రలను గతంలో చాలా సినిమాల్లో చూసినప్పటికీ దర్శకుడు అర్జున్ వైకే ఫేస్ బ్లైండ్‌నెస్‌ను కథాంశంగా తీసుకోవడం కొత్తగా అనిపించింది. మంచి మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచడంలోనూ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథానాయకుడి పాత్ర, దానికున్న సమస్యపై ప్రారంభంలోనే ప్రేక్షకులకు ఓ అవగాహన తీసుకొచ్చి తదుపరి సన్నివేశాలపై ఆసక్తి రగిలించాడు. హీరోకు స్నేహితుడి మధ్య వచ్చే సన్నివేశాలతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. విరామానికి ముందు వచ్చే అనూహ్య మలుపుతో కథ రసవత్తరంగా మారుతుంది. సెకండాఫ్ కీలక సమయాల్లో చోటు చేసుకునే మలుపులు, పతాక సన్నివేశాలతో సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాడు దర్శకుడు. అయితే అక్కడక్కడ కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్‌లో డెప్త్ లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. అలాగే దర్శకుడు కథని నడిపించిన విధానం ఓ టెంప్లేట్‌లా అనిపిస్తుంది.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా చంద్రశేఖరన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు కన్నా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలను BGM బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
- సుహాస్ నటన
- మలుపులు
- సెకండాఫ్
మైనస్ పాయింట్స్
- ప్రారంభ సీన్స్
- నెమ్మదిగా సాగే కథనం
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!