అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2‘ (Pushpa 2) చిత్రం కనీవినీ ఎరుగని రీతిలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన వసూళ్ల సునామీ చూసి ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో కేవలం ఆరు రోజుల్లోనే రూ.1002 కోట్ల కలెక్షన్స్ సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను హీరో అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నాడు. ‘పుష్ప 2’ విజయాన్ని ఉత్తరాది ప్రేక్షకులతో పంచుకునేందుకు అతడు దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టాడు. అక్కడి ప్రెస్‌మీట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ మారాయి.
దేశ రాజధానిలో ‘పుష్ప 2’ టీమ్
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రానికి యావత్ దేశం నుంచి విశేష స్పందన వచ్చింది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ ‘పుష్ప 2’ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. దేశ వ్యాప్తంగా వచ్చిన విశేష ఆదరణ చూసి థ్యాంక్యూ ఇండియా పేరుతో ‘పుష్ప 2’ టీమ్ దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది. హీరో అల్లు అర్జున్‌తో పాటు డైరెక్టర్ సుకుమార్, చిత్ర నిర్మాతలు ఇందులో పాల్గొన్నారు. ఢిల్లీ ల్యాండ్ అయిన వెంటనే బన్నీ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ‘నమస్తే ఢిల్లీ’ అంటూ బన్నీ ఫ్లైట్ దిగుతున్న ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
‘నా రికార్డులు బద్దలు కొట్టండి’
ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ నార్త్ ఆడియన్స్‌ను బన్నీ ఆకాశానికెత్తాడు. హిందీ ఆడియన్స్ లేకుంటే ‘పుష్ప 1’, ‘పుష్ప 2’ చిత్రాలు లేవని పేర్కొన్నాడు. ఇక పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డుల పైనా బన్నీ స్పందించాడు. ‘రికార్డ్స్ అనేవి శాశ్వతంగా ఉండిపోవు. రూ.1000 కోట్లు అనేది అభిమానుల ప్రేమకు ప్రతిబింబం. ఈ నంబర్స్ తాత్కాలికం. కానీ, వాళ్ల ప్రేమ మాత్రమే శాశ్వతం. రికార్డులు అనేవి ప్రతిసారీ బద్దలవుతూనే ఉండాలి. కొత్త రికార్డులు క్రియేట్ అవుతూనే ఉండాలని నేను ఎక్కువగా నమ్ముతా. మరో మూడు నెలలపాటు ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తా. వచ్చే వేసవిలోపు ఈ రికార్డులన్నీ బద్దలు కావాలని కోరుకుంటున్నా. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ పరిశ్రమ ఏదైనా కావచ్చు పుష్ప రికార్డ్స్‌ను మరో సినిమా దాటాలని నేను కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో పురోగతి అనేది ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.
‘పుష్ప 3’పై హైప్ పెంచిన బన్నీ
ప్రసంగం మొదట్లోనే దర్శకుడు సుకుమార్ మీద తనకున్న అభిమానం, ప్రేమను మరోమారు బన్నీ చాటుకున్నారు. ఆయన లేకపోతే పుష్ప ప్రపంచం ఉండేది కాదని అల్లు అర్జున్ స్పషం చేశాడు. ‘పుష్ప 3’ (Pushpa 3) ఉంటుందా అనే యాంకర్ ప్రశ్నకు సైతం బన్నీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ఈసారి ఝుకేగా నహీ (తగ్గేదేలే) కాదు.. రుకేగా నహీ (ఆగేదేలే)’ అంటూ సీక్వెల్‌పై అమాంతం అంచనాలు పెంచేశాడు. ఇదిలా ఉంటే సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని ‘పుష్ప 2’ క్లైమాక్స్‌లోనే దర్శకుడు సుకుమార్ హింట్ ఇచ్చాడు. సెకండ్ పార్ట్‌తో పోలిస్తే పుష్పరాజ్‌కు మరింత మంది శత్రువులు పెరిగినట్లు క్లైమాక్స్‌లో చూపించాడు. దీన్ని బట్టి థర్డ్ పార్ట్‌లో పుష్ప గాడి వేట మరో లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు.
బన్నీ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌ను దేశ రాజధాని ఢిల్లీలో బన్నీ కలిశాడంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో బన్నీ త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడంటూ ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. మామయ్య పవన్ బాటలో బన్నీ నడువబోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్ టీమ్ దీనిపై స్పందించింది. ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను దయచేసి ఏ ఒక్కరు లేదా మీడియా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. బన్నీకి సంబంధించినంత వరకూ అల్లు అర్జున్ టీమ్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మమని కోరింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!