Rail Coach Restaurant: హైదరాబాద్‌లో రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌.. ఫుడ్‌ ప్రియులకు ఇక పండగే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rail Coach Restaurant: హైదరాబాద్‌లో రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌.. ఫుడ్‌ ప్రియులకు ఇక పండగే..!

    Rail Coach Restaurant: హైదరాబాద్‌లో రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌.. ఫుడ్‌ ప్రియులకు ఇక పండగే..!

    September 13, 2023

    హైదరాబాద్‌లోని ఫుడ్‌ ప్రియులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అదేంటి రైల్వేశాఖకు ఫుడ్‌ లవర్స్‌కు మధ్య సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అదే ట్విస్ట్‌ ఇక్కడ. దక్షిణమధ్య రైల్వేశాఖ ఆధ్వర్యంలో నగరంలో ఓ సరికొత్త రెస్టారెంట్‌ ప్రారంభమైంది. అచ్చం రైలును తలపించినట్లు ఉండటమే ఈ రెస్టారెంట్‌ స్పెషల్‌. దీని ప్రత్యేకతలతో పాటు ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    నగరానికి నడిబొడ్డున.. హుస్సేన్‌ సాగర్‌కు ఆనుకొని ఉన్న నెక్లెస్‌ రోడ్‌లోని రైల్వేస్టేషన్‌లో ‘రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌’ ప్రారంభమైంది. సరికొత్త పద్ధతిలో భోజన ప్రియులకు ప్రత్యేకమైన భోజనాన్ని అందిస్తోంది. వినియోగంలో లేని పాత బోగీని రెస్టారెంట్ తరహాలో ఆధునికీకరించింది రైల్వేశాఖ. కస్టమర్లకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా అన్ని హంగులతో రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. 

    నగరానికి చెందిన బూమరాంగ్ రెస్టారెంట్‌కు ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలను రైల్వేశాఖ అప్పగించింది. దీంతో ఈ రెస్టారెంట్‌లోకి వచ్చే వారికి పసందైన ఫుడ్‌ అందించడంతో పాటు ప్రత్యేక అనుభూతిని పంచే బాధ్యతను బూమరాంగ్ తీసుకుంది. 

    రైల్వేశాఖ ఇంతకుముందే ఓ రెస్టారెంట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో దాన్ని లాంచ్‌ చేసింది. దీని బాధ్యతలను కూడా బూమరాంగ్‌ రెస్టారెంట్‌కే అప్పగించింది. దానికి ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో నెక్లెస్‌ రోడ్‌ దగ్గర ఈ రెస్టారెంట్‌ను రైల్వేశాఖ ఓపెన్‌ చేసింది. దీనికి కూడా అదే స్థాయిలో ఫుడ్‌ లవర్స్‌ నుంచి ఆదరణ లభిస్తుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.

    రైలు ప్ర‌యాణికుల‌తో పాటు కామ‌న్ ప‌బ్లిక్‌కు కూడా రెస్టారెంట్ అందుబాటులో ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. నచ్చిన ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకొని కోచ్‌లోనే కూర్చొని తినవచ్చని పేర్కొన్నాయి. పార్శిల్ సదుపాయం కూడా అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశాయి. 

    ఇక ఫుడ్‌ విషయానికి వస్తే ఈ రెస్టారెంట్‌లో చిరుతిళ్లు, అల్పాహారాలు, భోజనం, ఇతర రకాల వంటకాలు అందుబాటులో ఉండనున్నట్లు నిర్వహకులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లలో దశలవారీగా ఇటువంటి రైల్‌ కోచ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 

    హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో నెక్లెస్‌ రోడ్‌ ఒకటి. రోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకుల అక్కడికి వెళ్తుంటారు. ఈ స్టేష‌న్  చుట్టుప‌క్క‌ల ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు ఎక్కువగా ఉండ‌టంతో రైల్‌కోచ్ రెస్టారెంట్‌కు తాకిడి ఎక్కువ‌గా ఉంటుందని భావిస్తున్నారు.

    ఇక రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ఐదేళ్ల పాటు బూమ్‌రాంగ్ రెస్టారెంట్ నిర్వ‌హించ‌నుంది. ఈ వినూత్న సౌకర్యాన్ని రైలు ప్రయాణికులు, సామాన్య ప్రజలు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ విజ్ఞప్తి చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version