భారతదేశం గర్వించతగ్గ డైరెక్టర్లలో దర్శకధీరుడు S.S. రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఆయన తీసిన ప్రతీ సినిమా ఓ కళాఖండమనే చెప్పాలి. తనకు తానే పోటీ అన్నట్లుగా ప్రతీ సినిమాను ఎంతో అద్భుతంగా ఆయన తెరకెక్కిస్తుంటారు. రాజమౌళి సినిమా వస్తుందంటే యావత్ దేశం అలెర్ట్ అయిపోతుంది. అప్పటివరకూ ఉన్న సినీ రికార్డులన్నీ రాజమౌళి సినిమాకు దాసోహం అయిపోతాయి. రాజమౌళి రీసెంట్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకొని యావత్ దేశాన్ని గర్వించేలా చేసింది. ఇంతటి కీర్తిని గడించిన రాజమౌళి తాజాగా మరో అందలం ఎక్కారు. ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో చోటు సంపాదించారు.
2023 ఏడాదికి గాను ప్రఖ్యాత టైమ్ మేగజీన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచ వ్యాప్త ప్రభావశీలుర జాబితాలో రాజమౌళి చోటు సంపాదించారు. ఈ ఘనత సాదించిన తొలి ఇండియన్ డైెరెక్టర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో జక్కన్నతో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, రచయిత సల్మాన్ రష్దీ, న్యాయ నిర్ణేత పద్మాలక్ష్మీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ రాజు ఛార్లెస్, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్ చోటు సంపాదించారు. అలాగే ప్రఖ్యాత గాయని బియాన్స్, సిరియా స్విమ్మర్స్ సారా మర్దిని, యుస్రా మర్దిని, సూపర్ మోడల్ బెల్లా హడిడ్ చోటు దక్కించుకున్నారు. ఇంతమంది ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల మధ్య జక్కన్న స్థానం సంపాదించడమంటే అది సాధారణ విషయం కాదు.
టైమ్ మేగజీన్‌లో S.S. రాజమౌళి గురించి ప్రముఖ బాలీవుడ్ నటి అలీయా భట్ ప్రొఫైల్ రాసింది. సినిమాపై రాజమౌళికి ఉన్న విజన్‌పై ప్రశంసలు కురిపించింది. ‘ఆడియన్స్ గురించి రాజమౌళికి బాగా తెలుసు. సినిమాను ఎలా తీస్తే హిట్ కొడుతుందో ఆయనకు కొట్టిన పిండి. కథల ఎంపికలో రాజమౌళికి ఎంతో నైపుణ్యం ఉంది. భారత్‌లోని జనాభా విభిన్న సంస్కృతులు, అభిరుచులను కలిగి ఉంటారు. వారందరినీ రాజమౌళి తన సినిమాల ద్వారా ఏకం చేశారు’ అని అలియా భట్ రాసుకొచ్చింది. అటు బాలీవుడ్ నటుడు షారుక్ గురించి నటి దీపికా పదుకొనే కూడా ప్రొఫైల్ రాసింది. ప్రపంచ ప్రసిద్ధ నటుల్లో షారుక్ ఒకరిని పేర్కొంది. షారుక్.. గొప్ప మనసు, దాతృత్వం కలిగిన వ్యక్తి అని ప్రశంసించింది.
రాజమౌళి తన తర్వాత చిత్రం మహేష్‌బాబుతో తీయబోతున్నారు. దీంతో ఇప్పటినుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమాకు సంబంధించి రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. మహేష్ సినిమాను రాజమౌళి మూడు పార్ట్స్‌గా తీస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీన్ని రాజమౌళి ఖండించకపోవడంతో ఈ వార్త నిజమేనని ఊహాగానాలు వినిపిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లు అని ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయితే అది రూ.1500 కోట్లకు కూడా చేరొచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే సినిమా మూడు పార్ట్స్ రిలీజ్ చేయడానికి రాజమౌళి కనీసం 8 ఏళ్లు తీసుకుంటాడని కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. అయితే ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం