నటినటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్, గౌతమి, అల్లు అర్హ
దర్శకత్వం: గుణశేఖర్
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసెఫ్
నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత గతేడాది ‘యశోద’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో సామ్ ఇవాళ (ఏప్రిల్ 14) ‘శాంకుతలం’ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సమంత తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు గుణశేఖర్ డైరెక్టర్ కావడం, దిల్ నిర్మాతగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే పాటలు, ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో శాకుంతలంపై ఆసక్తి రెట్టింపు అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? సమంత, గుణశేఖర్‌లకు హిట్ తెచ్చి పెట్టిందా? వంటివి రివ్యూలో చూద్దాం.
కథ:
విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు ఆదేశంతో మేనక (మధుబాల) భూమిపైకి వస్తుంది. తన అందంతో తపస్సును నాశనం చేయడమే కాకుండా విశ్వామిత్రుడికి శారీరకంగా దగ్గరై పాపకు జన్మనిస్తుంది. ఆ పాపకు కణ్వ మహర్షి (సచిన్ ఖడేకర్) శాంకుతల(సమంత)గా పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుతాడు. శాంకుతల పెద్దయ్యాక ఓ రోజు కణ్వ అశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) ఆమె అందచందాలు చూసి ఇష్టపడతాడు. గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. త్వరలోనే తిరిగి వచ్చి రాజ్యానికి తీసుకెళ్తానని దుష్యంతుడు హామి ఇస్తాడు. ఈ క్రమంలో సమంత గర్భవతి అవుతుంది. ఈ నేపథ్యంలో దుష్యంతుడు, సమంత ఎలా కలిశారు? వారు విడిపోవడానికి దుర్వాస మహాముని (మోహన్‌బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే:
శకుంతల పాత్రకు సమంత పూర్తిగా న్యాయం చేసింది. భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించింది. అయితే ఈ పాత్రకు సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం మైనస్ అని చెప్పొచ్చు. పౌరాణిక పాత్ర కావడంతో సమంత వాయిస్ అతికినట్లు అనిపించదు. భరతుడి పాత్రలో అల్లు అర్హ ఆకట్టుకుంది. ఎంతో చలాకీగా నటించింది. ముద్దుముద్దు మాటలతో అలరించింది. అటు దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటన ఆకట్టుకుంటుంది. సమంత, దేవ్ మోహన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక దుర్వాస మహర్షి పాత్రకు మోహన్‌బాబు నిండుదనం తీసుకొచ్చారు. ఆయన తెరపై కనిపించేంది కొద్దిసేపే అయినప్పటికీ తన నటనతో అందరినీ కట్టిపడేస్తాడు. సచిన్, అనన్య, మధుబాల, జిషు సేన్ గుప్తా వంటి నటులు తెరపై చాలా మందే ఉన్నప్పటికీ నటనపరంగా వారికి పెద్దగా అవకాశం దక్కలేదు.
టెక్నికల్‌గా:
శాకుంతలం సినిమాను తీయడంలో డైరెక్టర్ గుణశేఖర్ తడబడినట్లు కనిపిస్తోంది. అందరికీ తెలిసిన ప్రేమ కావ్యాన్ని ఓ దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. గ్రాఫిక్స్ విజువల్స్ విషయంలో మరింత శ్రద్ధ వాహించి ఉంటే బాగుండేది. దుష్యంతుడు రాజుగా కంటే కమర్షియల్ సినిమాల్లో హీరోగానే ఎక్కువగా అనిపిస్తాడు. పైగా శాంకుతలం కథ దుష్యంతుడి కోణంలో చెప్పుకుంటూపోవడం ప్రేక్షుకులకు అంతగా రుచించలేదు. అయితే మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలే సినిమాలో హైలెట్ అని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
- సమంత నటన
- మణిశర్మ సంగీతం
- విరామ, పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- నెమ్మదిగా సాగే కథనం
- గ్రాఫిక్స్
- సాగదీత సన్నివేశాలు
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం