సినిమాకు హీరో, హీరోయిన్ రెండు కళ్లు లాంటి వారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లకు నటన పరంగా పెద్ద స్కోప్ దొరకడం లేదు. సినిమా మెుత్తం హీరో చుట్టూనే సాగేలా కొందరు దర్శకులు సినిమాలు తీస్తున్నారు. పాటల కోసం, అందచందాలను ఆరబోయటం కోసం మాత్రమే హీరోయిన్లు అన్నట్లు చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘లైగర్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలను గమనిస్తే హీరోయిన్ నటన కంటే వారి ఎక్స్‌పోజింగ్‌పైనే దర్శకులు ఎక్కువగా దృష్టిపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లోని కొందరు యువ డైరెక్టర్లు మాత్రం హీరోయిన్లను ఒకప్పటిలా డిగ్నిటీగా చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో శేఖర్ కమ్ములాను ఫాలో అవుతూ సినీ లవర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేసిన చిత్రాలేంటి? అందులో హీరోయిన్స్‌ను ఎలా చూపించారు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శేఖర్ కమ్ముల (Sekhar Kammula)
టాలీవుడ్‌లో సెన్సిబుల్ దర్శకుడు అనగానే ముందుగా శేఖర్ కమ్ముల గుర్తుకు వస్తారు. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఆయా సినిమాల కోసం ఎంచుకునే హీరోయిన్స్, వారిని ఆయన చూపించే విధానం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆనంద్, గోదావరి చిత్రాల్లో నటి కమలిని ముఖర్జీని ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. పక్కింటి అమ్మాయి అనిపించేతలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. అలాగే ‘లీడర్’లో రీచా గంగోపాధ్యాయ, ‘లైఫ్ ఈజ్‌బ్యూటీఫుల్’లో షగున్ కౌర్ పాత్రలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇక ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ చిత్రాల్లో సాయి పల్లవి పాత్రను మనసుకు హత్తుకునేలా ఎలా తీర్చిదిద్దారో అందరికీ తెలిసిందే. పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేయనప్పటికీ ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుందంటే అందులో శేఖర్ కమ్ములకు ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. హీరోయిన్లను డిగ్నిటీగా ఎలా చూపించాలో, వారి నుంచి నటన ఏవిధంగా రాబట్టాలో తెలిసిన దర్శకుడు కావడంతో శేఖర్ కమ్ములతో కనీసం ఒక సినిమా అయిన చేయాలని కథానాయికలు ఆశ పడుతుంటారు.
హను రాఘవపూడి (Hanu Raghavapudi)
శేఖర్ కమ్ముల తరహాలోనే దర్శకుడు హను రాఘవపూడి కథానాయికల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. ఆయన దర్శత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’, ‘క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘పడి పడి లేచె మనసు’, ‘సీతారామం చిత్రాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దర్శకత్వంలో పని చేసిన లావణ్య త్రిపాఠి, మెహరిన్, సాయిపల్లవి, మృణాల్ ఠాకూర్ ఎంత మంచి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి అద్భుతమైన ప్రేమ కావ్యంలో మృణాల్‌ను చాలా బాగా చూపించారు. ఆ సినిమాతో ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ సినిమాలోని సీత పాత్ర తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని మృణాల్ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. హను రాఘవపడి ప్రభాస్‌తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే ఆమె లుక్స్ విపరీతంగా ఆకర్షించగా డైరెక్టర్ హను ఇంకెంత బాగా చూపిస్తారోనని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
వివేక్ ఆత్రేయ (Vivek Athreya)
యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సైతం హీరోయిన్ల విషయంలో శేఖర్ కమ్ములానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్‌గా నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రంలో తమిళ నటి ప్రియాంక అరుళ్ మోహన్‌ను ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. ఎక్కడా గ్లామర్‌షోకు చోటు ఇవ్వకుండా ఆమె ద్వారా అద్భుత నటనను రాబట్టి ప్రశంసలు అందుకున్నారు. అందుకు ముందు డైరెక్ట్ చేసిన ‘మెంటల్ మదిలో’ (Mental Madhilo), ‘బ్రోచెవారెవరురా’ (Brochevarevarura), ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రాల్లోనూ హీరోయిన్ల స్కిన్ షో కంటే డిగ్నిటీ లుక్‌కే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్, నివేదా థామస్, నజ్రియా నజిమ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
శౌర్యువ్ (Shouryuv)
దర్శకుడు శౌర్యువ్ ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మనసుకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని మలిచి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో నాని హీరోగా నటించగా మృణాల్ ఠాకూర్ అతడికి జోడీగా చేసింది. బాలీవుడ్‌లో అప్పటికే హాట్ బాంబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌ను ఇందులో మళ్లీ అచ్చ తెలుగు అమ్మాయిగా చూపించారు. సాంగ్స్‌లో స్కిన్ షోకు అవకాశం ఉన్నప్పటికీ శౌర్యువ్ ఆ పని చేయలేదు. ఆమె పోషిస్తున్న డిగ్నిటీ పాత్రపై ప్రభావం చూపకుండా ఆద్యంతం మృణాల్‌ను అందంగా చూపించారు. హీరోయిన్ పాత్ర ఎలా ఉండాలి? ఎలా చూపించాలి? అని శౌర్యువ్‌కు ఉన్న స్పష్టతను చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. తన తర్వాతి సినిమాల్లోనూ ఇదే రీతిన కొనసాగాలని ఆశిస్తున్నారు.
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ యూత్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయారు. యువత మెచ్చే కంటెంట్‌తో వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే కుర్రకారును ఆకట్టుకువాలన్న తాపత్రయంలో అతడు ఎక్కడా గ్లామర్ షోకు ఆస్కారం ఇవ్వడం లేదు. తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ నుంచి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా రీతు వర్మ నటించింది. అసభ్యతకు, అనవసర స్కిన్‌షోకు చోటు లేకుండా ఆమెతో మంచి నటన రాబట్టాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో రీతు వర్మ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటుడిగా మారి పలు సినిమాల్లో నటించిన తరుణ్ బాస్కర్ ‘కీడా కోలా’తో మళ్లీ డైరెక్టర్‌గా మారారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?