నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, గౌతమ్ వాసుదేవ మీనన్, రాజీవ్ మీనన్
దర్శకత్వం: వెట్రిమారన్
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: ఆర్.వేల్‌రాజ్
ఎడిటింగ్: రమర్
నిర్మాత: ఎల్రెడ్ కుమార్
డైరెక్టర్ వెట్రిమారన్‌కు తమిళంలో ఎంతో గుర్తింపు ఉంది. హీరోల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆయన పలు జాతీయ అవార్డులను అందుకున్నాడు. అత్యంత సహజంగా కనిపించేలా ఆయన తీసిన విసరనై, వడా చెన్నై, అసురన్ వంటి సినిమాలు వెట్రిమారన్‌కు ప్రతిభకు అద్దం పడతాయి. తమిళ్‌లో ఆయన తీసిన ‘అసురన్’ చిత్రం ఓ ప్రభంజనమే సృష్టించింది. తెలుగులో ‘నారప్ప’గా వచ్చి ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా, వెట్రిమారన్ తాజా చిత్రం ‘విడుదల పార్ట్ 1’ ఇవాళ తెలుగులో రిలీజైంది. వెట్రిమారన్ సినిమా కావడంతో ఎప్పటిలాగే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. మరీ ‘విడుదల’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? వెట్రిమారన్‌కు మరో హిట్ తెచ్చిపెట్టిందా? ఇప్పుడు చూద్దాం.
కథ
పోలీసు కానిస్టేబుల్‌గా కుమరేశన్(సూరి) కొత్త ఉద్యోగంలో చేరతాడు. ప్రజాదళం నాయకుడైన పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకు పనిచేస్తున్న పోలీస్ దళంలో డ్రైవర్‌గా చేరతాడు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడం పోలీసు విధి అని కుమరేశన్ నమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలో అడవిలో ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేస్తుంది. ఆమెను కాపాడేందుకు పోలీసు జీపును ఉపయోగించి కుమరేశన్ పైఅధికారుల ఆగ్రహానికి గురవుతాడు. మరోవైపు గాయపడిన మహిళ మనవరాలు పాప (భవానీ శ్రీ)తో కుమరేశన్ స్నేహం చేస్తాడు. అది కాస్త ప్రేమకి దారితీస్తుంది. ఒక పక్క ప్రేమ, ఇంకోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేటలో కుమరేశన్ ఎలాంటి సంఘర్షణకి గురవుతాడన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే:
పాత్రలకు తగ్గ నటుల్ని ఎంచుకోవడంలో డైరెక్టర్ వెట్రిమారన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సూరి, భవానీ శ్రీల నటన ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. కుమారేశన్, పాప పాత్రల్లో ఉన్న అమాయకత్వాన్ని వారు తమ నటనతో చక్కగా చేసి చూపించారు. అటు క్రూరంగా వ్యవహరించే పోలీసు ఆఫీసర్‌గా చేతన్ అదరగొట్టాడు.పెరుమాళ్‌గా విజయ్‌సేతుపతి కనిపించేంది కొద్దిసేపే అయిన తన మార్క్ నటనతో మెప్పించాడు. గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్ తదితరులు తమ పరిధిమేరకు నటించారు.
టెక్నికల్‌గా:
విడుదల పార్ట్-1 సినిమాలో డైరెక్టర్ వెట్టిమారన్ కొత్త ప్రపంచాన్నే ఆవిష్కరించారు. తనదైన శైలిలో అడవి, పోలీసుల సెటప్ అంతా చాలా సహజంగా ఉంది. కానీ.. కథలో సంఘర్షణ, డ్రామా మాత్రం పెద్దగా మెప్పించదు. కొన్ని సన్నివేశాలు మరీ సాగదీతలా అనిపిస్తాయి. దళాలను పట్టుకోవడం కోసం పోలీసులు యత్నించడం, వారి ఇరువురు మధ్య సాగే పోరాటంలో సామాన్యులు నలిగిపోవడం చాలా తెలుగు సినిమాల్లో చూసిందే. ఈ చిత్రంలోనూ అదే సన్నివేశాలు రిపీట్ కావడంతో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కుమారేశన్, పాప మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు కూడా రొటిన్‌గా అనిపిస్తాయి. ఇకపోతే కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- నటీనటులు
- సినిమాటోగ్రఫీ
- పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- సంఘర్షణ లేని కథ
- సాగదీత సన్నివేశాలు
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం