టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే అది ఆడియన్స్‌కు కన్నుల పండుగగా ఉంటుంది. గతంలో ఈ తరహా మల్టీ స్టారర్ చిత్రాలు పెద్ద ఎత్తునే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో వాటి జోరు తగ్గింది. దీంతో ఆడియన్స్ కూడా మల్టీస్టారర్ మేనియా నుంచి కాస్త పక్కకు జరిగారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత మళ్లీ ఆ తరహా చిత్రాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో సరైన కథ తగిలితే మల్టీ స్టారర్లు చేసేందుకు తెలుగు స్టార్లు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చిరు-పవన్-చరణ్, రామ్‌చరణ్-సూర్య కాంబినేషన్స్‌పై గాసిప్స్ వచ్చాయి. తాజాగా బాలయ్య-రామ్ పోతినేని కాంబో చిత్రంపైనా జోరుగా ప్రచారం మెుదలైంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మల్టీస్టారర్ లోడింగ్..!
మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), రామ్ పోతినేని (Ram Pothineni) ముందు వరుసలో ఉంటారు. నటుడు బాలకృష్ణ గత కొంతకాలంగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు. అటు రామ్ కెరీర్ ప్రారంభంలో లవర్ బాయ్ చిత్రాలు చేసినప్పటికీ ఇటీవల యాక్షన్ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఇస్మార్ట్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి యాక్షన్ చిత్రాల్లో నటించాడు. అటువంటి ఈ ఇద్దరి హీరోల కాంబోలో ఓ క్రేజీ మల్టీస్టారర్ రాబోతున్నట్లు ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి కాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ వార్త నిజమైతే మాస్ ఆడియన్స్‌కు పండగే అని చెప్పవచ్చు.
గుడ్ ఫ్రెండ్‌షిప్
హీరో రామ్, నందమూరి బాలకృష్ణకు మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఈ విషయం తొలిసారి స్కంద ఆడియో ఫంక్షన్‌లో బయటపడింది. బోయపాటి, రామ్ కాంబోలో రూపొందిన ‘స్కంద’ ఆడియో రిలీజ్ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఆ సందర్భంగా హీరో రామ్‌తో ఆయన ఎంతో సన్నిహితంగా మెలిగారు. రామ్ తన స్పీచులో బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక్కడ ఒక్క తరాన్ని అలరించేందుకు అల్లాడుతుంటే బాలయ్య మాత్రం మూడు తరాలను అలరిస్తూనే ఉన్నారంటూ పొగడ్తల్లో ముంచేత్తారు. అటు బాలయ్య రామ్‌ను ఆకాశానికెత్తారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఓ సినిమాలో కలిసి నటిస్తే ఇక రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ అంటున్నారు.
చరణ్ – సూర్య కాంబోపై బజ్!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్ – సూర్య మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ క్రేజీగా ఉంటుందని అంటున్నారు. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
మెగా హీరోలతో మల్టీస్టారర్!
మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. అటువంటి హరీశ్ శంకర్ తన ‘మిస్టర్ బచ్చన్‘ సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, చిరంజీవిల కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అది పట్టాలెక్కితే అన్ని పాన్ ఇండియాల కంటే అదే అతి పెద్ద పాన్ ఇండియా అవుతుందని పేర్కొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే గతంలో చిరు, రామ్‌చరణ్‌లు కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. ‘బ్రూస్‌లీ’, ‘మగధీర’ చిత్రాల్లో చరణ్ కోసం మెగాస్టార్ ఓ స్పెషల్ క్యామియో కూడా ఇచ్చారు. అటు పవన్ కల్యాణ్ సైతం ‘శంకర్ దాదా MBBS‘, ‘శంకర్ దాదా జిందాబాద్‘ చిత్రాల్లో చిన్న క్యామియో పోషించారు.