• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!

    నటీనటులు: షారుక్‌ ఖాన్‌, తాప్సీ, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ, దియా మిర్జా, సతీశ్‌ షా, అనిల్‌ గ్రోవర్‌ తదితరులు

    దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాణీ

    సంగీతం: అమన్‌ పంత్‌, ప్రీతమ్

    సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్‌, మనుశ్‌ నందన్‌

    నిర్మాతలు: గౌరీ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే

    నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ ఫిల్మ్స్‌ 

    విడుదల తేదీ: 21-12-2023

    ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ – షారుక్‌ఖాన్‌ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘డంకీ’ (Dunki). హిరాణీ డైరెక్షన్‌లో వచ్చిన  ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘సంజు’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది రెండు సూపర్‌ హిట్స్‌ (పఠాన్‌, జవాన్‌)తో ఊపుమీదున్న షారుక్‌తో హిరాణీ చిత్రం తీయడంతో ‘డంకీ’పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సి నటించింది. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశాల్‌ అతిథి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? షారుక్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిందా? దర్శకుడు హిరాణీ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. 

    కథ

    పంజాబ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మ‌న్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశ‌ల్‌), బుగ్గు (విక్ర‌మ్ కొచ్చ‌ర్‌), బ‌ల్లి (అనిల్ గ్రోవ‌ర్‌) ఒక్కో స‌మ‌స్య‌తో బాధపడుతుంటారు. వాటి నుంచి గ‌ట్టెక్క‌డానికి ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ, వీసాల‌కి త‌గినంత చ‌దువు, డ‌బ్బు వీరి వద్ద ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే ఆ ఊరికి జ‌వాన్ హార్డీ సింగ్ (షారుక్‌ ఖాన్‌) వ‌స్తాడు. ఆ న‌లుగురి ప‌రిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఏన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఒకరికి మాత్ర‌మే వీసా వ‌స్తుంది. అయినా స‌రే, అక్ర‌మ మార్గాన (డంకీ ట్రావెల్‌) ఇంగ్లండ్‌లోకి ప్ర‌వేశించాల‌ని వారు నిర్ణయించుకుంటారు. ఆ క్ర‌మంలో వాళ్ల‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? ఇంగ్లాండ్‌కు వెళ్లారా లేదా? అన్నది కథ.

    ఎవరెలా చేశారంటే

    ‘డంకీ’ చిత్రం షారుక్‌లోని మరో నట కోణాన్ని ఆవిష్కరించింది. మాట తప్పని జవాన్ హర్డీసింగ్‌ పాత్రలో షారుక్‌ ఒదిగిపోయారు. ప్రథమార్థంలో ఎంతగా నవ్వించారో, ద్వితియార్థంలో అంతగా భావోద్వేగాల్ని పంచారు. మన్ను పాత్రలో తాప్సి అదరగొట్టింది. చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఇక  విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించాడు. ఆయన నిడివి తక్కువే అయినా సినిమాలో విక్కీ పాత్ర చాలా కీలకం. ఇక మిగిలిన నటులు తమ పాత్రపరిధి మేరకు నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తన గత చిత్రాల మాదిరిగానే సామాజికాంశాలు, హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. న‌వ్విస్తూ, హృద‌యాలను బ‌రువెక్కిస్తూ, సాహ‌సోపేత‌మైన డంకీ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల్ని భాగం చేశారు. మ‌న్ను, బుగ్గు, బ‌ల్లిల కుటుంబ నేప‌థ్యాలను గుండెకు హత్తుకునేలా చూపించారు. డంకీ ప్ర‌యాణంలో వ‌లస‌దారుల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టారు. విదేశాల్లో వారి బ‌తుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆక‌ట్టుకుంది. హార్డీ, మ‌న్ను ప్రేమ‌క‌థను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆ జంట మ‌ధ్య సాగే ప్రేమ‌ నేప‌థ్యం క‌న్నీళ్లు పెట్టిస్తుంది. 

    సాంకేతికంగా

    సాంకేతిక అంశాల విషయానికొస్తే.. సంగీతం, కెమెరా విభాగాల‌ు చక్కటి పనితీరు కనబరిచాయి.  ‘లుట్ పుట్ గ‌యా’ అనే హుషారైన పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అమ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌కుడిగానే కాకుండా ఎడిట‌ర్‌గానూ మ‌రోసారి త‌న‌దైన ముద్ర వేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • నటీనటులు
    • హాస్యం, భావోద్వేగాలు
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • సాగదీత సీన్స్
    • ఊహకందే కథ, కథనం

    రేటింగ్‌ : 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv