విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 5) విడుదల కానుంది. గీతాగోవిందం లాంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత విజయ్-పరుశురామ్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అటు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. ఆ విశేషాలేంటో చూద్దాం.
ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
భారీ అంచనాలతో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.44 కోట్లకు చేరింది.
సెన్సార్ ఝలక్!
ఫ్యామిలీ స్టార్ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైమ్‌ను 2గం.ల 43 నిమిషాలకు ఫిక్స్ చేసింది. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు సమాచారం. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని సమాచారం.
ఆ చిత్రాలతో గట్టి పోటీ!
విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో నటించినప్పటికీ ఫ్యామిలీ స్టార్‌కు రెండు సినిమాల నుంచి గట్టిపోటీ తప్పదనిపిస్తోంది. ఒకటి ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) కాగా, రెండోది మలయాళం బ్లాక్ బాస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys). గత శుక్రవారం రిలీజైన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ వారం కూడా మంచి వసూళ్లు సాధిస్తూ వీకెండ్ వైపు పరుగులు పెడుతోంది. రెండో వారంతం కూడా టిల్లు స్క్వేర్‌కు మంచి ఆదరణ లభించే అవకాశముంది. మరోవైపు మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్.. ఏప్రిల్ 6న విడుదలవుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీని చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఈ రెండు చిత్రాలను తట్టుకొని ‘ఫ్యామిలీ స్టార్’ ఏమేర రాణిస్తుందో చూడాలి.