టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్ ‘పూరి మ్యూజింగ్స్’లో ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను చర్చిస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియా వినియోగంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియా అనేది జీవితాలను మార్చగలిగే శక్తివంతమైన సాధనమని, అయితే దానికి దూరంగా ఉంటే కుటుంబ బంధాలు మరింత బలపడతాయని, విడాకుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు.
సోషల్ మీడియా ప్రభావం
పూరి జగన్నాథ్ అభిప్రాయం ప్రకారం.. ‘‘సోషల్ మీడియా అనేది కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి ప్రారంభమైన సాధనంగా కనిపించింది. కానీ, ఇప్పుడు మన జీవితాల్లో డిజిటల్ దెయ్యంలా మారింది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల మనం ఇతరులతో అనవసరంగా పోల్చుకోవడం మొదలుపెట్టాం. కొత్త దుస్తులు కట్టినా, ఇంట్లో సంతోషంగా ఉన్నా, స్నేహితులతో గడిపినా ప్రతి క్షణం ఫొటో తీసి పోస్ట్ చేయడంపై ఆసక్తి పెరిగింది. కానీ దీని వల్ల మానసిక శాంతి పోయి, అసూయ, అసంతృప్తి పెరుగుతున్నాయి.’’
ట్రోలింగ్ సమస్య
‘‘మీరు ఏ ఫొటో పోస్ట్ చేసినా అది అందరికి నచ్చదు. మీరు మాల్దీవుల్లో బికినీ ఫొటో పంచుకున్నా ట్రోలింగ్ తప్పదు. కొందరు విమర్శిస్తారు, మరికొందరు అసభ్యంగా మాట్లాడతారు. వాటిని చూసి బాధపడుతూ మీ పని మానేసి బాధతో కూర్చుంటారు. ఎందుకంటే, ఆ ఫొటోలు చూసే వాళ్లు కూడా పని లేని వాళ్లే. చివరకు మీరు కూడా అదే స్థితిలో పడిపోతారు.’’
సోషల్ మీడియా కారణంగా విడాకులు
‘‘తాజా సర్వే ప్రకారం, 10 విడాకుల్లో 3 వివాహాలు సోషల్ మీడియా కారణంగా బంధాలు దెబ్బతినడం వల్లే జరుగుతున్నాయి. కుటుంబ సంబంధాల నాశనం ప్రధానంగా డిజిటల్ వేదికల వల్లే జరుగుతోంది. ఇంట్లో గొడవలు, అశాంతికి సోషల్ మీడియా ప్రధాన కారణమని గుర్తించాలి’’ అని చెప్పుకొచ్చారు.
వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలి
పూరి ఇంకా మాట్లాడుతూ,
‘‘మీ ఇంట్లో జరిగే విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవద్దు. మీ వ్యక్తిగత జీవితం గురించి బైట చెప్పకుండా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెళ్లైన వారైతే ప్రతి ఫొటో, ప్రతి అంశం పంచుకోవడం ఆపేయాలి. మీ జీవితంలోని ఆనందాలు, కష్టాలు మీలోనే ఉంచుకోండి. మీ కుటుంబం మీదే దృష్టి పెట్టండి. దానివల్లనే జీవితానికి స్థిరత్వం వస్తుంది’’ అన్నారు.
నెగెటివిటీకి దూరంగా ఉండండి
‘‘మీరు ఏ ఫొటో పెడితే అది నెగెటివిటీని ఆకర్షిస్తుంది. మీ కుక్క ఫొటో పెడితే అది అనారోగ్యానికి గురవుతుంది. డైనింగ్ టేబుల్ వద్ద ఫోటో పెడితే ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు వస్తాయి. ఈ ప్రవర్తన ద్వారా ఇతరుల అసూయ మీకు సమస్యలను తీసుకురాగలదు’’ అని పూరి పేర్కొన్నారు.
కొత్త ఏడాదికి కొత్త తీర్మానం
‘‘కొత్త సంవత్సరం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. కనీసం ఒక్క నెల అయినా డిజిటల్ డిటాక్స్ చేపట్టండి. మీరు మీ జీవితంలో మానసిక శాంతి అంటే ఏంటో అర్థం చేసుకుంటారు. మీ బంధాలు బలపడతాయి, విడాకులు తగ్గుతాయి, జీవితంలో సంతోషం పెరుగుతుంది’’ అని పూరి పేర్కొన్నారు.
సమాజానికి పూరి సూచనలు
పూరి చివరగా చెబుతూ..
‘‘మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు మీ కుటుంబసభ్యులు. వాళ్లతో గడపడానికి మీరు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. డిజిటల్ ప్రపంచాన్ని వినియోగించండి కానీ అది మిమ్మల్ని మింగివేయకూడదు.’’
ఈ సందేశం ద్వారా పూరి జగన్నాథ్ నేటి యువతికి మరియు కుటుంబాలకు ఒక గొప్ప మార్గదర్శకత్వాన్ని అందించారు.