సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెసిందే. ఈ ఘటనకు బాధ్యున్ని చేస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల కావడం వంటి విషయాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా, అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు.
“అల్లు అర్జున్‌ను అరెస్ట్ సబబే
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనపై పవన్ మాట్లాడుతూ, “ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం తప్పనిసరి. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంలో పొరపాటు లేదు” అన్నారు.
“అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి కానీ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. మానవతా దృక్పథం లోపించనట్టు అయింది. అల్లు అర్జునే కాదు కనీసం టీమ్ అయినా సంతాపం చెప్పి ఉండాల్సింది” అని చెప్పుకొచ్చారు.
“తన పేరు చెప్పలేదని రేవంత్… అర్జున్‌ను అరెస్టు చేశారని అనడం కూడా పెద్ద తప్పు అని, రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత” అని వెల్లడించారు.
“అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్టు చేస్తారు, చట్టం ఎవరికి చుట్టం కాదు” అని రేవంత్ రెడ్డిపై ప్రశంశలు కురిపించారు.
అలాగే, “ఘటన జరిగిన బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించుంటే, ఈ వివాదం ఇంత పెద్దదిగా మారేది కాదు. తన చర్యల ద్వారా అల్లు అర్జున్ గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నాడు” అని పేర్కొన్నారు.
ప్రతి హీరోకు క్రేజ్
“అల్లు అర్జున్ విషయంలో ముందూ వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుంది ఇందులో పోలీసుల తీరును తప్పుబట్టను అని వెల్లడించారు.
“ప్రతి హీరో తన సినిమా కోసం ప్రేక్షకులు ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకోవాలని అనుకుంటారు. తమ అభిమానులపై ప్రేమ చూపడానికి ఆసక్తి చూపుతారు. ఇది తప్పు కాదు, కానీ తమ చర్యలతో ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందో ముందుగానే ఆలోచించాలి” అన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ఇలాంటి పరిస్థితుల్లో సారీ చెప్పడానికి పలు మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి బాధితుల కుటుంబాలను ప్రత్యక్షంగా కలవడం. ఈ చిన్న చర్య ద్వారా పెద్ద వివాదాలను నివారించవచ్చు. అల్లు అర్జున్ తరఫున ఇలా చేయడం లోపించింది” అని తెలిపారు.
తొక్కిసలాటను నివారించడం ముఖ్యం
పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ.. “న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా తప్పు చేస్తే దానికి పర్యవసానం ఉంటుందని ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి” అని తెలిపారు.
ఘటన గురించి
డిసెంబర్ 2, 2024న హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్స్‌కి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి ఘటనలు ఇక మళ్లీ జరగకుండా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు.