సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.
ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం)
కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.
‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద..
వలలు వెయ్యొద్దు వయసు మీద..
ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి.
సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.
‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని..
చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ..
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ..
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’
‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా..
కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా..
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా..
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.
పుడుతూనే ఉయ్యాల(నేనింతే)
పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.
‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే..
ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే..
చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే..
నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా..
నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’
‘‘టర్నే లేని దారులూ..
ట్విస్టే లేని గాథలూ..
రిస్కే లేని లైఫులూ..
బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.
తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్)
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి.
‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని..
చేతకాని వాడల్లే చూడొద్దే..
ధర్మరాజు అంతటివాడు ఆడాడే..
తీసిపారేయొద్దు జూదాన్ని..
మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే..
స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే..
ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే..
వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’
పక్కా లోకల్(జనతా గ్యారేజ్)
ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.
తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది..
రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే…
‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో..
ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో..
ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..
వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో..
అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..
షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..
టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..
నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’
డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది.
ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది.
మరికొన్ని..
తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!