కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ని తెలుగులో ‘శాకిని డాకిని’గా తీసుకొచ్చాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. ఈ సినిమాకి విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ, దూకుడైన ప్రమోషన్లతో ఈ మూవీపై అంచనాలను పెంచేసింది చిత్రబృందం. శుక్రవారం(Sep 16) ప్రేక్షకులను పలకరించింది. మరి ఈ సినిమా వెండితెరపై నిలబడిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి..?
ఇద్దరి వ్యక్తుల మధ్య శత్రుత్వం.. స్నేహంగా మారితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్నేహ బంధం.. ఒక బలమైన కారణం వల్ల ఏర్పడితే అది అత్యద్భుతంగా ఉంటుంది. అలాంటి కథే ఇది. శాలిని(నివేతా థామస్), దామిని(రెజీనా) పోలీస్ అకాడమీలో ట్రైనీలుగా చేరతారు. వీరిద్దరికి అసలు పడేది కాదు. ఉప్పూ నిప్పూ అన్నట్టే సాగుతాయి వీరి మధ్య సన్నివేశాలు. ప్రతి అంశంలోనూ పోటీ పడుతుంటారు. ఒక రోజు వీరిద్దరూ ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడాన్ని చూస్తారు. ఈ విషయం పోలీసులకు చెబితే వారు పెడచెవిన పెడతారు. దీంతో శాలిని, దామిని కలిసి తెరవెనుక ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. ఈ ప్రయాణంలో వీరికి ఎలాంటి అనభవాలు ఎదురయ్యాయి? చివరికి దర్యాప్తును ఎలా ముగించారు? తమ దర్యాప్తులో తెలుసుకున్న నిగూఢ విషయాలేంటి? అనే అంశాలను తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారు..?
శాలిని, దామినిగా నివేత, రెజీనా ఇద్దరూ ప్రేక్షకులను మెప్పిస్తారు. నివేత తన కామెడీ టైమింగ్‌తో అదరగొడితే.. దామిని తన యాటిట్యూడ్‌తో వీక్షకులను అబ్బురపరుస్తుంది. ఈ సినిమాకు వీరిద్దరూ చాలా చెమటోడ్చారు. హీరోలకు తగ్గకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ముఖ్యంగా పోలీస్ ట్రైనింగ్‌లో, పోరాట సన్నివేశాల్లో ఔరా అనిపించారు. ప్రొఫెషనల్ ట్రైనర్లను తలపించేలా వారి పాత్రల్లో ఒదిగిపోయారు. యాక్షన్ మూవీలో కామెడీని పండించారు. వీరిద్దరూ ఈ సినిమాతో ఒక మెట్టు పైకెదిగారు. ఇక పోలీసు అకాడమీ చీఫ్ పాత్రకు భానుచందర్ బాగా నప్పారు. పృథ్వీ, రఘుబాబు, సత్యల కామెడీ కాసేపు నవ్విస్తుంది.
సాంకేతిక అంశాలు..
ఒక సున్నితమైన కథాంశాన్ని ప్రేక్షకుడికి సాదాసీదాగా చెప్పడంలో దర్శకుడు సుధీర్ వర్మ ఫర్వాలేదనిపించారు. మిడ్‌నైట్ రన్నర్స్ సినిమాలోని ప్రధాన అంశాల్ని ఒడిసిపట్టుకుంటూ.. మన నేటివిటీకి తగ్గట్లు చేసిన మార్పులు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ల మధ్య సంభాషణలు, ఇన్విస్టిగేషన్ అంశాలు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. కానీ, అక్కడక్కడా లాజిక్కులను ఆయన మిస్సయ్యారు. పదునైన కథనాన్ని అందించలేకపోయారు. సినిమాటోగ్రఫీ మోస్తరుగా ఉంటుంది. సంగీతంపై దర్శకుడు కాస్త దృష్టి పెడితే బాగుండనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా లేదు. కథకు అనుగుణంగా నిర్మాణ విలువలున్నాయి.
బలాలు
హీరోహీరోయిన్ల నటన
యాక్షన్ సన్నివేశాలు
కామెడీ
బలహీనతలు
సంగీతం
నిర్మాణ విలువలు
లాజిక్ లేని స్క్రీన్‌ప్లే
ఫైనల్‌గా.. శాకిని డాకిని తమ సాహసాలతో ప్రేక్షకుడిని మెప్పిస్తారు.